రాజీవ్‌ని జైల్లో పెట్టలేదే: షర్మిల

రాజీవ్‌ని జైల్లో పెట్టలేదే: షర్మిల

 ప్రకాశం జిల్లా ఒంగోలులో ఆమె తన తల్లి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మతో కలిసి ఉప ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బోఫోర్స్ కేసులో రాజీవ్ గాంధీని అప్పట్లో జైల్లో పెట్టలేదే అని ఆమె వ్యాఖ్యానించారు. కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆధేశాల మేరకే సిబిఐ జగన్‌ను అరెస్టు చేసిందని ఆమె ఆరోపించారు.

ఉప ఎన్నికలు జరుగుతున్న 18 శానససభా స్థానాల్లో తమ పార్టీకి డిపాజిట్లు కూడా రావనే భయంతోనే జగన్‌ను జైల్లో పెట్టారని ఆమె అన్నారు. జగన్ త్వరలోనే నిర్దోషిగా బయటకు వస్తారని ఆమె అన్నారు. రాజన్న రాజ్యం కావాలంటే జగన్ ముఖ్యమంత్రి కావాలని ఆమె అన్నారు. హెలికాప్టరును కూల్చి, మంచివాళ్లను జైల్లో పెట్టే దుర్మార్గపు రాజకీయాలను తిప్పికొట్టాలని ఆమె పిలుపునిచ్చారు. రెండేళ్లుగా జగన్‌ను వేధిస్తున్నారని, చివరకు ఎన్నికల సమయంలో అరెస్టు చేశారని ఆమె అన్నారు.

దేశమంతా హెరిటేజ్‌లు పెట్టి కేంద్రం హోం మంత్రి చిదంబరంతో చీకటి ఒప్పందాలు చేసుకున్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి వైయస్ రాజశేఖర రెడ్డి గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని ఆమె అన్నారు. పార్టీని కాంగ్రెసులో విలీనం చేసి కోట్ల రూపాయలతో ఐటి దాడుల్లో దొరికిన చిరంజీవి ఇప్పుడు నీతులు చెబుతున్నారని ఆమె అన్నారు. కష్టకాలంలో వైయస్సార్ కుటుంబానికి అండగా ఉండి, రైతుల పక్షాన నిలబడి పదవికి రాజీనామా చేసిన బాలినేని శ్రీనివాస రెడ్డికి ఓటు వేసి గెలిపించాలని ఆమె ప్రజలను కోరారు.

ముఖ్యమంత్రి కావాలని అనుకుని ఉంటే 150 మంది శాసనసభ్యులు బలపరిచినప్పుడే జగన్ ముఖ్యమంత్రి అయ్యేవారని వైయస్ విజయమ్మ అన్నారు. కాంగ్రెసులో ఉంటే ముఖ్యమంత్రిని చేసేవారట అని ఆమె ఎద్దేవా చేశారు. కేంద్రం కనుసన్నల్లోనే సిబిఐ నడుస్తోందని ఆమె విమర్శించారు. వైయస్ రాజశేఖర రెడ్డి నుంచి సాయం పొందినవాళ్లు చాలా మంది ఉన్నారని, అయితే కష్టకాలంలో వైయస్ కుటుంబం వెంట నడిచినవాళ్లు అతి కొద్ది మంది ఉన్నారని, ఆ కొద్ది మందిలో బాలినేని శ్రీనివాస రెడ్డి ఒక్కరని ఆమె అన్నారు.

సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా వైయస్ రాజశేఖర రెడ్డి పాలన సాగిందని ఆమె చెప్పారు. వైయస్ జగన్ ఓదార్పు యాత్ర కాంగ్రెసు పార్టీకి నచ్చలేదని, దీంతో ఆ రోజు నుంచే కక్ష సాధింపు చర్యలు ప్రారంభించారని ఆమె విమర్శించారు. వైయస్ కుటుంబాన్ని ఎందుకు వేధిస్తున్నారని ఆమె ప్రశ్నించారు. న్యాయ నిర్ణేతలు ప్రజలేనని, సరైన న్యాయం చేస్తారనే నమ్మకంతోనే ప్రజా కోర్టుకు వచ్చానని ఆమె అన్నారు. జగన్ నిర్దోషిగా వచ్చి ముఖ్యమంత్రి అవుతారని, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ప్లీనరీలో చెప్పిన ప్రతి పథకం అమలవుతుందని ఆమె చెప్పారు.