జగన్ భద్రతపై విజయమ్మ కామెంట్

జగన్ భద్రతపై విజయమ్మ కామెంట్

తన తనయుడు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి భద్రత లేదని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవ అధ్యక్షురాలు, పులివెందుల శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మ సోమవారం ఆవేదన వ్యక్తం చేశారు. జగన్‌ను కలిసిన అనంతరం విజయమ్మను మీడియా పలకరించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పోలీసు భద్రత సరిగా లేదని, అనడానికి జగన్‌ను సాధారణ వాహనంలో తరలించడమే నిదర్శనం అన్నారు.

ఇదే అంశాన్ని వైయస్ జగన్మోహన్ రెడ్డి నాంపల్లి ప్రత్యేక కోర్టు జడ్జి దృష్టీకి తీసుకు వెళ్లారన్నారు. కాగా వైయస్ జగన్మోహన్ రెడ్డిని అధికారులు చంచల్‌గూడ జైలు నుండి నాంపల్లి ప్రత్యేక కోర్టుకు సాధారణ వాహంలో తరలించిన విషయం తెలిసిందే. దీనిపై జగన్ అసహనం వ్యక్తం చేశారు. కోర్టుకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు స్వీకరించిన కోర్టు సిబిఐ, జైళ్లశాఖకు నోటీసులు జారీ చేసింది. సాధారణ వాహనంలో తీసుకు రావడంపై 14వ తేదిలోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది.

నాంపల్లి ప్రత్యేక కోర్టులో కుటుంబ సభ్యులను కలిసేందుకు కోర్టు జగన్‌కు అరగంట అనుమతి ఇచ్చారు. ఆయన తల్లి విజయమ్మ, భార్య భారతితో మాట్లాడారు. వారి మధ్య తాజా రాజకీయ పరిస్థితులు చర్చకు వచ్చినట్లుగా తెలుస్తోంది. మొదట ఇరువురు జగన్ యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారని తెలుస్తోంది. ఆ తర్వాత విజయమ్మ ఉప ఎన్నికల ప్రచారం, ప్రజల స్పందన తదితర అంశాల గురించి వివరించినట్లుగా తెలుస్తోంది.

గత నెల 27న జగన్‌ను అరెస్టు చేసిన అనంతరం వైయస్ విజయమ్మ, షర్మిలలు జోరుగా ఉప ఎన్నికల ప్రచారం నిర్వహించిన విషయం తెలిసిందే. వారి ప్రచార సభలకు జనాలు బాగా తరలి వచ్చారు. భారతి రెడ్డి కూడా కంపెనీల వ్యవహారాల గురించి తెలిపినట్లుగా తెలుస్తోంది.