జైలులో జగన్ నవ్వుతుంటే కొందరికి అసూయ

జైలులో జగన్ నవ్వుతుంటే కొందరికి అసూయ

 తమ పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు  వైయస్ జగన్మోహన్ రెడ్డి జైలులో ఉన్నప్పటికీ నవ్వడాన్ని చూసి కొందరు అసూయ పడుతున్నారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికార  ప్రతినిధి అంబటి రాంబాబుబుధవారం అన్నారు. ఆయన మధ్యాహ్నం చంచల్‌గూడ జైలులో జగన్‌ను కలిశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. జగన్ మనోస్థైర్యంతో ఉన్నారని చెప్పారు.

సమీప భవిష్యత్తులో పెద్ద ఎత్తున వివిధ పార్టీల నుండి వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి వలసలు రావడం ఖాయమని అన్నారు. రాబోయే రోజులలో ప్రధాన ప్రతిపక్షం అధికారపక్షం మరింత దగ్గరకు రాబోతున్నాయని అంబటి విమర్శించారు. జైలులో జగన్ చాలా ధైర్యంగా ఉన్నారని చెప్పారు. ఎలాంటి అసహనం ప్రదర్శించడం లేదని చెప్పారు. జగన్ త్వరలో జైలు నుండి బయటకు వస్తారని ఆశిస్తున్నామన్నారు.

జగన్ ఎలాంటి తప్పు చేయలేదన్నారు. కుట్రలో భాగంగానే ఆయన జైలుకు వెళ్లారని అందరూ గట్టిగా నమ్ముతున్నారన్నారు. జగన్ త్వరలో బయటకు వస్తారని తాను, జగన్, ప్రజలు గట్టిగా నమ్ముతున్నారని చెప్పారు. త్వరలో అన్ని విషయాలు బయటకు వస్తాయన్నారు. జగన్‌ను ఆయన భార్య భారతి రెడ్డి, విశ్వరూప్ తనయుడు కృష్ణ, పిజెఆర్ తనయ విజయా రెడ్డి, శాసనసభ్యురాలు శోభా నాగి రెడ్డి, మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన రావు సతీమణి జక్కంపూడి విజయలక్ష్మి, వంగవీటి రాధా తదితరులు కలిశారు.

కాగా రాష్ట్రంలో ఎప్పుడు ఏ ఎన్నికలు జరిగినా తమ పార్టీ క్లీన్ స్వీప్ చేస్తుందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎంపి మేకపాటి రాజమోహన్ రెడ్డి కడపలో అన్నరు. ఉప ఎన్నికలలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తరఫున గెలిచిన వారు బుధవారం ఉదయం ఇడుపులపాయలో దివంగత వైయస్సార్ సమాధి వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా మేకపాటి మాట్లాడారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పట్ల ప్రజల్లో ఉన్న నమ్మకానికి ఇటీవల జరిగిన ఉప ఎన్నికలలోని ఫలితాలే నిదర్శనం అన్నారు