రామ్‌దేవ్ తో చేతులు కలిపిన చంద్రబాబు!

రామ్‌దేవ్ తో చేతులు కలిపిన చంద్రబాబు!

 నల్లధనం వెలికితీత, అవినీతిపై తమ పోరాటానికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మద్దతిస్తానని చెప్పారని ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబా చెప్పారు. ఆయన సోమవారం ఉదయం చంద్రబాబు నివాసంలో ఆయనతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తనపై కేంద్ర ప్రభుత్వం ఉద్దేశ్య పూర్వకంగా ఆరోపణలు చేస్తోందని బాబా అన్నారు. అవినీతిపై పోరాటం చేస్తున్నందుకే మమ్మల్ని లక్ష్యంగా చేసుకున్నారన్నారు.

దేశ ప్రజల ప్రోద్భలంతోనే తాము ఉద్యమిస్తున్నామని చెప్పారు. మా పోరాటం వ్యక్తులు, పార్టీలకు వ్యతిరేకం కాదని.. కేవలం అవినీతికి మాత్రమే వ్యతిరేకం అన్నారు. నల్లధనంపై కేంద్రం విడుదల చేసిన శ్వేతపత్రం ఓ బోగస్ అని మండిపడ్డారు. ఇరవై ఏళ్లుగా తాను సేవ చేస్తున్నప్పటికీ ఎప్పుడూ ఆరోపణలు చేయలేదని, అవినీతిపై ఉద్యమిస్తున్న సమయంలో తనపై దాడి చేస్తున్నారని అన్నారు. ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌పై తాను వ్యక్తిగతంగా ఎప్పుడూ ఆరోపణలు చేయలేదన్నారు. మైనింగులో చాలా అక్రమాలు జరిగాయన్న సంగతిని విస్మరించలేమన్నారు.

అనంతరం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. నల్ల ధనం వెలికితీత, అవినీతి నిర్మూలనపై అన్ని పార్టీలతో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. రాజకీయాలు పక్కన పెట్టి ఈ రెండు అంశాలను అన్ని పార్టీలు జాతీయ అజెండాగా తీసుకోవాలని సూచించారు. ప్రముఖ సంఘ సంస్కర్త అన్నా హజారే, యోగా గురువు రాందేవ్ బాబాల పోరాటానికి మద్దతు పలుకుతున్నట్లు చెప్పారు. అవినీతిపై పోరాడుతున్న వారి మీద ప్రభుత్వం ఎందుకు దాడి చేస్తుందో అర్థం కావడం లేదన్నారు.

కాగా రాష్ట్రపతి అభ్యర్థి రేసులో ఉన్న పిఎ సంగ్మా చంద్రబాబు నాయుడును సోమవారం కలిశారు. రాష్ట్రపతి ఎన్నికల సమయంలో తన అభ్యర్థిత్వాన్ని బలపరచాల్సిందిగా సంగ్మా చంద్రబాబును కోరారు. ఉప ఎన్నికల అనంతరం పోలిట్ బ్యూరోలో చర్చించి నిర్ణయం తీసుకుంటానని చంద్రబాబు చెప్పారని సంగ్మా విలేకరులతో అన్నారు.