పట్టాబి రామారావు ఇష్యూ

పట్టాబి రామారావు ఇష్యూ

కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డికి బెయిల్ మంజూరు చేసినందుకు ముడుపులు తీసుకున్న న్యాయమూర్తి పట్టాభి రామరావు వ్యవహారంలో రాయలసీమకు చెందిన ఓ మంత్రి పాత్ర ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆ మంత్రి రాయలసీమలోని కర్నూలు జిల్లాకు చెందినవారని వివిధ తెలుగు టీవీ చానెళ్లలో వార్తల్లో వస్తున్నాయి. పట్టాభి రామారావుతో వ్యవహారం నడపడంలో ఆ మంత్రి ప్రధాన పాత్ర పోషించినట్లు చెబుతున్నారు. ఆ మంత్రి గతంలో గాలి జనార్దన్ రెడ్డి చంచల్‌గుడా జైలులో ఉన్నప్పుడు తనిఖీ పేరుతో జైలుకు వెళ్లారని కొన్ని టీవీ చానెళ్లు వ్యాఖ్యానిస్తున్నాయి.

ఎబిఎన్ ఆంధ్రజ్యోతి టీవీ చానెల్ ఆ మంత్రి పేరును చెబుతూ ఆ మంత్రి పాత్రపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయంటూ వార్తాకథనాన్ని ప్రసారం చేసింది. సిబిఐ అధికారులు ఓ స్టార్ హోటళ్లో గాలి జనార్దన్ రెడ్డి సోదరుడు సోమశేఖర రెడ్డిని కలిసిన వ్యక్తుల వివరాలను హోటల్ సిసి కెమెరాల ఫుటేజ్ ద్వారా సేకరించారని, వాటి హార్డ్ డిస్కులను కూడా తీసుకున్నారని అంటున్నారు. ఫోన్లను కూడా ట్యాప్ చేసిన వ్యవహారం గుట్టు విప్పారని అంటున్నారు. 

డీల్ కుదర్చడంలో రాయలసీమ మంత్రి కీలక పాత్ర పోషించారని అంటున్నారు. రిటైర్డ్ న్యాయమూర్తి టీవి చలపతి రావు మధ్యవర్తిగా వ్యవహరించారని వార్తలు వస్తున్నాయి. అలాగే, హైదరాబాదు పాతబస్తీకి చెందిన ఓ రౌడీషీటర్, పట్టాభి రామారావు కుమారుడు ఈ వ్యవహారంలో ఉన్నారని అంటున్నారు. రాఘవాచారి అనే న్యాయవాది పాత్రపై కూడా సిబిఐ అనుమానాలు వ్యక్తం చేస్తున్నట్లు ఎబిఎన్ ఆంధ్రజ్యోతి వ్యాఖ్యానించింది. అలాగే, కంపిల శానససభ్యుడు సురేష్ పేరును ఈ చానెల్ ప్రస్తావించింది.

చలపతిరావుతో ఎవరెవరు మాట్లాడారనే విషయాలను సిబిఐ అధికారులు సేకరించినట్లు చెబుతున్నారు. కాగా, పది కోట్ల రూపాయలకు డీల్ కుదుర్చుకుని  గాలి జనార్దన్ రెడ్డి కి ఒఎంసి కేసులో బెయిల్ మంజూరు చేసిన పట్టాభి రామారావుపై సస్పెన్షన్ వేటు పడింది. హైకోర్టు నుంచి అనుమతి రాగానే సిబిఐ పట్టాభి రామారావుపై కేసు నమోదు చేసి, ఆయనను అరెస్టు చేసే అవకాశాలున్నట్లు చెబుతున్నారు.