అంతరంగాన్ని ఆవిష్కరించిన అద్వానీ

అంతరంగాన్ని ఆవిష్కరించిన అద్వానీ

కొంతకాలంగా పార్టీ వ్యవహారశైలిపై కినుక వహించిన బీజేపీ అగ్రనేత అద్వానీ తన అంతరంగాన్ని ఆవిష్కరించారు. పార్టీ అంతర్గత విషయాలపై కుండబద్దలు కొట్టారు. ప్రజల్లో యూపీఏ సర్కారుపై వ్యతిరేకత పెరుగుతున్నా.. అదే సమయంలో బీజేపీకి తగిన ఆదరణ రాకపోవడాన్ని ఆయన గుర్తు చేశారు. పార్టీ చీఫ్ గడ్కరి తీరును కూడా అద్వానీ తప్పుపట్టారు. 

భారతీయ జనతా పార్టీ అగ్రనేత ఎల్కే.అద్వానీ సొంత పార్టీ అనుసరిస్తున్న వైఖరి పట్ల తీవ్ర నిరాశ వ్యక్తం చేశారు. బీజేపీ వైఖరి పట్ల దేశ ప్రజలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారంటూ ఆయన పరోక్షంగా ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ గడ్కారీపై విమర్శలు చేశారు. ట్విట్టర్ బ్లాగులో తన మనస్సులోని భావాలను అద్వానీ వెల్లడించారు. కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం పట్ల దేశ ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారన్నారు. అదేసమయంలో బీజేపీ పట్ల కూడా వారు నిరాశగా ఉన్నారని చెప్పుకొచ్చారు.

కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం అన్ని రంగాల్లో పూర్తిగా విఫలమైనప్పటికీ.. ప్రజలను ఆకర్షించడంలోనూ, వారికి భరోసా ఇవ్వడంలోనూ, నమ్మకం కలిగించడంలోనూ బీజేపీ నేతలు పూర్తిగా విఫలమయ్యారని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యంగా కీలకాంశాలపై సరైన నిర్ణయాలు తీసుకోలేక ప్రజల్లో విశ్వాసాన్ని కోల్పోతున్నట్టు ఆయన అభిప్రాయపడ్డారు. ఉత్తర ప్రదేశ్ ఎన్నికలలో ఎదురైన ఘోర పరాజయాన్ని అద్వానీ ప్రస్తావించారు. మాయావతి సర్కారులో అవినీతి ఆరోపణలు ఎదుర్కొని సస్పెండైన మాజీ మంత్రిని రాత్రికి రాత్రే పార్టీలోకి ఆహ్వానించి సీటివ్వడాన్ని ఆయన తప్పుబట్టారు.పార్టీ ఆధికారంలో ఉన్న రాష్ట్రాల్లో బీజేపీ నేతల అవినీతికి అడ్డుకట్ట వేయలేక పోయామన్న బాధను అద్వానీ వ్యక్తం చేశారు. జార్ఖండ్ రాజ్యసభ వ్యవహారం, కర్ణాటకలోయడ్యూరప్ప ఎపిసోడ్ పార్టీకి మచ్చ తెచ్చాయన్నారు. ఇప్పటికైనా చేసిన తప్పులను సమీక్షించుకుని ముందుకు సాగాలని ఈ అగ్రనేత పార్టీ కేడర్ కు పిలుపునిచ్చారు.