సుప్రీంకోర్టులో జయలలిత, శశికళకు షాక్

సుప్రీంకోర్టులో జయలలిత, శశికళకు షాక్

తమిళనాడు ముఖ్యమంత్రి,  అన్నాడిఎంకె అధినేత్రి జయలలితకు, ఆమె సన్నిహితురాలు శశికళకు సోమవారం సుప్రీం కోర్టులో చుక్కెదురయింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసును ఎదుర్కోవాల్సిందేనని సుప్రీం తేల్చి చెప్పింది. తమపై ఉన్న అక్రమాస్తుల కేసును కొట్టివేయాలని శశికళ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఆమె పిటిషన్ పైన విచారణ జరిపిన కోర్టు కేసు కొనసాగుతుందని తీర్పు చెప్పింది.

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జయలలిత గత సంవత్సరం కర్నాటక రాజధాని బెంగళూరు కోర్టులో రెండుసార్లు హాజరయిన విషయం తెలిసిందే. ఆ సమయంలో కోర్టు ఆమెకు వందల కొద్ది ప్రశ్నలను ఆమె ముందు ఉంచింది. బెంగళూరు కోర్టులో జయలలిత విచారణకు హాజరైన సమయంలో శశికళ కూడా వెంట వెళ్లారు.

శశికళకు చెందిన లాయర్లు తెలిపిన వివరాల ప్రకారం... కేసుకు సంబంధించిన పత్రాలను అడిగినప్పటికీ సిబిఐ(సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్) ఇవ్వలేదని కాబట్టి తమపై ఉన్న ఆదాయానికి మించిన ఆస్తుల కేసును కొట్టి వేయాలని శశికళ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. 1991-1996 వరకు తమిళనాడును పాలించిన జయలలిత తన పాలనలో అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి.

తన పాలన సమయంలో తనకు, తన సన్నిహితురాలు శశికళకు లబ్ధి జరిగే విధంగా జయలలిత పాలనను మిస్ యూజ్ చేశారనే ఆరోపణలు ఉన్నాయి. కాగా కొద్దికాలం క్రితం శశికళను, ఆమె భర్తను జయలలిత పార్టీ నుండి బహిష్కరించిన విషయం తెలిసిందే. అయితే ఆ తర్వాత శశికళ.. జయలలితతో రాజీపడ్డారు.