బీజేపీకి రాష్ట్రపతి ఎంపిక టెన్షన్

బీజేపీకి రాష్ట్రపతి ఎంపిక టెన్షన్

రాష్ట్రపతి ఎన్నిక కమలనాథులకు కొత్త తలనొప్పి తెచ్చిపెట్టింది. ప్రణబ్‌కు పోటీగా గట్టి ప్రత్యర్థిని దించాలన్న వారి ఆశలపై అబ్దుల్ కలాం నీళ్లు చల్లడంతో కొత్త అభ్యర్ధి అన్వేషణలో పడ్డారు. ఈ క్రమంలో పీఏసంగ్మా పేరును సీరియస్‌గా పరిశీలిస్తున్నారు. బుధవారం జరిగే ఎన్డీఏ భేటీలో దీనిపై తుది నిర్ణయం తీసుకోనుంది.

రాష్ట్రపతి అభ్యర్థి రేసు నుంచి అబ్దుల్ కలాం తప్పుకోవడంతో బిజెపి ప్రత్యామ్యాయాలవైపు దృష్టి సారించింది. తాను రాష్ట్రపతి అభ్యర్థి రేసులో లేనని ఇప్పుడే ప్రకటన చేయవద్దని కమలనాధులు కోరినా కలామ్ వినలేదని సమాచారం. ఖచ్చితంగా గెలుస్తానని హామీ ఇస్తేనే పోటీకి సై అని కలాం స్పష్టం చేశారు. దీంతో UPA అభ్యర్థి ప్రణబ్ ముఖర్జీకి ధీటుగా అన్నాడియంకె, బిజూ జనతాదళ్ సంయుక్తంగా ప్రతిపాదిస్తున్న NCP సీనియర్ నాయకుడు, లోక్ సభ మాజీ స్పీకర్ పీఏ సంగ్మా పేరును సీరియస్ గా పరీశీలిస్తోంది. రాత్రి జరిగిన బీజేపీ కోర్ కమిటీ సమావేశంలో రాష్ట్రపతి అభ్యర్ధి ఎంపికపై సుదీర్ఘంగా చర్చించారు. అద్వానీ, గడ్కరీతో పాటు పలువురు సీనియర్ నేతలు ఈ భేటీకి హాజరయ్యారు. ప్రణభ్ ను ఏకగ్రీవంగా ఎన్నిక కానివ్వకూడదని ఇందులో సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు సమాచారం. బరిలో నిలిచి గట్టి పోటీ ఇవ్వాలని మెజారిటీ నేతలు భావించారు.

అయితే సంగ్మా అభ్యర్థిత్వానికి ఎన్డీయె కూటమిలోని కీలక భాగస్వామ్య పక్షాలైన శివసేన, జేడీ-U సమ్మతించక పోవడంతో వారిని ఒప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ మేరకు బిజెపి అగ్రనేతలు అద్వానీ, సుష్మా స్వరాజ్ స్వయంగా రంగంలోకి దిగి ఆయా పార్టీల నేతలతో ఇప్పటికే సంప్రదింపులు ప్రారంభించారు. నిజానికి, సంగ్మా బలమైన ప్రత్యామ్నాయం కాకపోయినప్పటికీ, ప్రణబ్‌కు గట్టి పోటీ ఇచ్చేందుకు ఎన్డీయె ఈ దిశగా సమాలోచనలు జరుపుతోంది. ఎన్సీపీ అధినేత శరద్‌పవార్ తమ పార్టీకి చెందిన సంగ్మా అభ్యర్థిత్వాన్ని తిరస్కరించడంతో వైరిపక్షం శివసేనను సముదాయించే వీలున్నదని బిజెపి నేతలు భావిస్తున్నారు. 

బిజెపి నాయకురాలు, కేంద్ర మాజీ మంత్రి మేనకా గాంధీ ప్రణబ్ ముఖర్జీకి మద్దతు ప్రకటించారు. ఆమె ప్రణబ్ ముఖర్జీని కలిసి తన సంఘీభావం తెలిపారు. రాష్ట్రపతి పదవికి ప్రణబ్ అద్భుతమైన అభ్యర్థిగా ఆమె అభివర్ణించారు. అటు అకాలీదళ్ మాత్రం NDA తీసుకునే నిర్ణయానికి కట్టుబడతామన్నారు.బుధవారం జరిగే NDA సమావేశంలో కూటమిలోని ఇతర పార్టీల అభిప్రాయాలను కూడా తెలుసుకుని రాష్ట్రపతి అభ్యర్ధి ఎంపికపై తుది నిర్ణయం తీసుకోవాలని బీజేపీ భావిస్తోంది.