ప్రణబ్‌కు మద్దతిచ్చేందుకు మమత నో

ప్రణబ్‌కు మద్దతిచ్చేందుకు మమత నో

రాష్ట్రపతి ఎన్నిక జాతీయ స్థాయి రాజకీయాల్లో చిచ్చురేపుతోంది. పైకి బలంగా కనిపిస్తున్న యుపిఏకు మమత రూపంలో కొత్త శతృవును తయారు చేస్తున్న రాష్ట్రపతి ఎన్నిక... విపక్షంలో వున్న ఎన్డీఏలోనూ చీలిక తెస్తోంది. ఆసక్తికరంగా మారిన రాష్ట్రపతి ఎన్నికలపై స్పెషల్‌ అనాలిసిస్‌..

రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించిన చర్చ ప్రారంభంకాగానే ప్రణబ్‌ ముఖర్జీ పేరు తెరమీదికొచ్చింది. బెంగాలీ బాబే కాబట్టి మమత ఆమోదం సులభ సాధ్యమేననుకున్న యుపిఏకు.. మరీ ముఖ్యంగా కాంగ్రెస్‌  పార్టీకి మమత ఝలకిచ్చారు. అబ్దుల్‌ కలామ్‌ పేరును తెరమీదికితెచ్చారు. షాకిచ్చిన మమతకు సోనియా కూడా అదే రీతిన సమాధానమిచ్చారు. సోనియాతో రహస్య భేటీ తర్వాత ములాయం ప్రణబ్‌కు మద్దతు ప్రకటించి, బెంగాల్‌ దీదీ ప్రయత్నాలకు గండికొట్టారు. తొలుత అబ్దుల్‌ కలాం పేరును ప్రస్తావించిన ములాయమే కాంగ్రెస్‌ మాయోపాయలకు పడిపోవడంతో మమత ఒంటరిదైంది. ములాయం అండ చూసుకున్న కాంగ్రెస్‌ నేతలు... మమతను యుపిఏ నుంచి బయటికి పంపేందుకు సిద్ధమవుతున్నారు. అందుకే దిగ్విజయ్ సింగ్‌ వంటి వారు మమతపై ఘాటైన కామెంట్లు చేస్తున్నారు. దాంతో మమత అగ్గిమీద గుగ్గిలమవుతున్నట్లు సమాచారం.  

యుపిఏలో మమత రేపిన చిచ్చు ఇలా కొనసాగుతుంటే.. రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేయాలా వద్దా అన్న అంశంపై మల్లగుల్లాలు పడుతోంది ఎన్డీఏ కూటమి. ప్రణబ్‌ను ఓడించేందుకు పోటీ చేయాలని బిజెపి భావిస్తుంటే.. ఎలాగో ఓడిపోయే ఎన్నికల్లో పోటీచేయడమెందుకని జెడియు వంటి పార్టీలు వాదిస్తున్నాయి. ఎన్నికలకు ముందే సరెండరయితే... క్విడ్‌ ప్రో కో పద్దతిలో ఉప రాష్ట్రపతి పదవిని అడిగే అవకాశాలు కూడా వుండవనుకుంటున్న కమలనాథులు... పోటీకి విముఖత ప్రదర్శిస్తున్న పార్టీలను బుజ్జగించేందుకు ప్రయత్నిస్తున్నారు. ములాయం నోటి వెంటే మొదట అబ్దుల్‌ కలాం పేరు వినిపించడంతో లోలోపల సంబరపడిన కమలనాథులు... ఎస్పీ, తృణమూల్‌ మద్దతుతో కలాంను రాష్ట్రపతిని చేయడం ద్వారా యుపిఏను నైతికంగా దెబ్బతీయొచ్చని భావించారు. చివరికి ములాయం ప్లేటు ఫిరాయించి, ప్రణబ్‌కే మద్దతు పలకడంతో కంగుతిన్నారు. మరోవైపు సంగ్మాకు మద్దతివ్వాలన్న వాదన కూడా ఎన్డీఏలో భిన్నాభిప్రాయాలకు దారితీస్తోంది. సంగ్మాకు మద్దతిచ్చినా.. ఆయన తుదికంటా పోటీలో వుంటాడా అన్నది సందేహంగా మారింది. ఈ నేపథ్యంలో బిజెపి మాటలకు విలువిచ్చే పార్టీలసలు ఎన్డీఏలో ఉన్నాయా అన్న సందేహాలు మొదలయ్యాయి. 

మొత్తమ్మీద రాష్ట్రపతి ఎన్నికల ప్రహసనంలో కాంగ్రెస్‌ పార్టీ వ్యూహచతురతే ఇప్పటికి పైచేయిగా కొనసాగుతోంది. మమత, ములాయంల జోడీని విడదీయడం ద్వారా అబ్దుల్‌ కలాంను పోటీకి దూరం చేసిన కాంగ్రెస్ యుక్తి... సంగ్మాను తప్పించేందుకు శరద్‌పవార్‌ ద్వారా ఒత్తిడి చేయించే స్థితికి చేరింది. మరోవైపు మిత్రపక్షాలనే తమ వాదనతో ఒప్పించలేని దుస్థితిలో బిజెపి కొనసాగుతుండడంతో ప్రణబ్‌ రాష్ట్రపతి కావడం ఖాయంగా కనిపిస్తోంది.