కోలా కృష్ణమోహన్ ప్రెస్ మీట్

కోలా కృష్ణమోహన్ ప్రెస్ మీట్

 తనకు కోట్లలో లాటరీ వచ్చినట్లు గతంలో పలువురిని మోసం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కుంటున్న కోలా కృష్ణమోహన్ అనే వ్యక్తి శనివారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. దీంతో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి తలనొప్పి తప్పేట్లు లేదు. కోలా మీడియా సమావేశానికి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి చెందిన సాక్షి టీవీ చానెల్ అత్యధిక ప్రాధాన్యం ఇచ్చింది. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడికి చెందిన విదేశీ బ్యాంకుల ఖాతాల గుట్టును కోలా కృష్ణమోహన్ గుట్టు విప్పినట్లు సాక్షి టీవీ చానెల్ వ్యాఖ్యానించింది.

తనకు కోట్లలో లాటరీ వచ్చినట్లు గతంలో పలువురిని మోసం చేసినట్లు కోలాపై కేసులున్నాయని కూడా సాక్షి టీవీ చానెల్ తెలిపింది. చంద్రబాబుకు, అతని కుటుంబ సభ్యులకు విదేశాల్లోని బ్యాంకు ఖాతాల్లో వేల కోట్ల రూపాయలు ఉన్నట్లు కోలా కృష్ణమోహన్ ఆరోపించారు. 2003లో చంద్రబాబు చాలా విదేశీ ఖాతాలను క్లోజ్ చేసినట్లు ఆయన తెలిపారు. సింగపూర్‌లోని ఒక బ్యాంకులో చంద్రబాబుకు 15 వేల కోట్ల రూపాయల డాలర్లు ఉన్నట్లు ఆయన తెలిపారు.

చంద్రబాబు విదేశీ ఖాతాల వివరాలను రెండు రోజుల్లో హైకోర్టుకు తెలుపుతానని ఆయన చెప్పారు. మరో పది రోజుల్లో మరోసారి మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరిన్ని వివరాలు చెబుతానని ఆయన అన్నారు. గతంలో తనపై చంద్రబాబు రెండుసార్లు హత్యా ప్రయత్నం చేయించారని ఆయన ఆరోపించారు. ఇప్పుడు తనకు ఏమైనా జరిగితే చంద్రబాబు బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆయన అన్నారు. తనకు లాటరీ వచ్చినట్లు తెలిసి చంద్రబాబు తనను పార్టీలోకి ఆహ్వానించారని, మచిలీపట్నం లోకసభ సీటు ఇస్తానని చెప్పారని ఆయన అన్నారు.

చంద్రబాబుకు తాను 1999లో ఐదు కోట్ల పది లక్షల రూపాయలు ఇచ్చినట్లు ఆయన తెలిపారు. పది లక్షల రూపాయలు చెక్ రూపంలో ఇచ్చినట్లు ఆయన తెలిపారు. ఆ చెక్కును నగదు రూపంలోకి మార్చుకున్నట్లు ఆయన తెలిపారు. కోటి రూపాయల నగదు చంద్రబాబుకు ఇంట్లోనే ఇచ్చినట్లు ఆయన తెలిపారు. మిగిలిన నాలుగు కోట్ల రూపాయలను లండన్‌లోని మిడ్‌ల్యాండ్స్ బ్యాంక్ ఖాతా నుంచి సింగపూర్ బ్యాంకులోని చంద్రబాబు ఖాతాలోకి మార్చినట్లు ఆయన తెలిపారు. లండన్‌లోని తన ఖాతా నెంబరు 433846 958001గా ఆయన తెలిపారు.

సింగపూర్‌లోని డ్యూషే బ్యాంకులో సి. నాయుడు. నారా అనే పేరుతో 0204049121100 నెంబరుతో ఖాతా ఉన్నట్లు కోలా కృష్ణమోహన్ చెప్పారు. సింగపూర్ బార్‌లేస్ బ్యాంకులో చంద్రబాబుకు మరో ఖాతా ఉన్నట్లు ఆయన తెలిపారు. లండన్‌లోని నార్త్‌వెస్ట్ బ్యాంకులో కూడా ఖాతా ఉన్నట్లు ఆయన చెప్పారు. స్విట్జర్లాండ్‌లోని క్రెడిట్ నూయిస్ బ్యాంకులో కూడా చంద్రబాబుకు ఖాతా ఉందని చెప్పారు. 2003లో కొన్ని ఖాతాలను మూసేసినప్పటికీ ఇంకా అనేక ఖాతాల్లో వేల కోట్ల రూపాయలు ఉన్నాయని ఆయన చెప్పారు.

చంద్రబాబు వల్లనే తాను అనేక కేసుల్లో ఇరుక్కున్నట్లు ఆయన తెలిపారు. 2003లో తనపై చంద్రబాబు మూడు సార్లు హత్యా ప్రయత్నం చేయించారని ఆయన ఆరోపించారు. చంద్రబాబు కుమారుడు నారా లోకేష్ తన వద్ద 25 లక్షల రూపాయలు తీసుకున్నట్లు కోలా కృష్ణమోహన్ తెలిపారు.