తెలంగాణాపై కేంద్రంలో కదలిక !

తెలంగాణాపై కేంద్రంలో కదలిక !

ఉప ఎన్నికల్లో వరుస వైఫల్యాలతో తల బొప్పి కట్టించుకుంటున్న కాంగ్రెస్‌ పార్టీ, తెలంగాణా అంశాన్ని తేల్చేయనుందా ? ఢిల్లీ వెళ్ళి వస్తున్న కాంగ్రెస్ నేతలను ప్రశ్నిస్తే... కావచ్చన్న సమాధానమే వస్తోంది. తాజాగా మంత్రి టిజి వెంకటేశ్‌ చేసిన కామెంట్లు ఈ వాదనను మరింత బలపరుస్తున్నాయి. రాష్ట్రపతి ఎన్నికల తర్వాత ఈ అంశంపై కాంగ్రెస్‌ అధిష్టానం దృష్టి సారించే అవకాశాలున్నాయని తెలంగాణా కాంగ్రెస్‌ నేతలంటున్నారు.

 ఈ ఏడాది తొలి ఆర్నెల్లలోనే రెండు సార్లు ఉప ఎన్నికలను చూసింది ఆంధ్ర రాష్ట్రం. రెండు మార్లు అధికార కాంగ్రెస్‌ది పరాజయ పరాభవమే. తాజాగా పరకాలలో ఏకంగా అయిదో స్థానానికి పరిమితమవడం కాంగ్రెస్‌ పెద్దలను కలవర పరుస్తోంది. కారణాలేంటో తేల్చమంటూ రాష్ట్ర నాయకత్వాన్ని ఆదేశించింది. అందుకే తొలిసారి ఢిల్లీ పెద్దలెవరూ లేకుండా రాష్ట్ర కాంగ్రెస్‌ సమన్వయ భేటీ జరిగింది. సీమాంధ్రలో జగన్‌ ఉధృతి, తెలంగాణాలో ప్రత్యేక రాష్ట్ర కాంక్షపై ఎటూ తేల్చని వైనమే కొంప ముంచిందని రాష్ట్ర నాయకత్వం తేల్చింది. నివేదిక ఇంకా ఢిల్లీకి చేరక ముందే అక్కడ కదలిక మొదలైన సంకేతాలు కనిపిస్తున్నాయంటున్నారు రాష్ట్ర కాంగ్రెస్‌ వర్గాలు. 

రసకందాయంలో పడిన రాష్ట్రపతి ఎన్నికల సంగతి మరో రెండు, మూడు రోజుల్లో తేలిపోనుంది. ఈ అంశంలో క్లారిటీ రాగానే రాష్ట్ర కాంగ్రెస్‌ కుదేలవుతున్న వ్యవహారంపై కాంగ్రెస్‌ అధిష్టానం పూర్తి స్థాయిలో దృష్టి సారించ నుంది. జగన్ జోరుకు ఎలా కళ్ళెం వేయాలనే అంశంతో పాటు... సుదీర్ఘ కాలం పాటు తెలంగాణా అంశాన్ని నాన్చడం వల్ల జరుగుతున్న నష్టంపై కూడా అధిష్టానం దృష్టి సారించనుందని టీ-కాంగ్రెస్ నేతలంటున్నారు. రాష్ట్ర విభజనకు సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నారని, అయితే... రాయల సీమ విషయంలోనే ఇంకా మల్లగుల్లాలు పడుతున్నారని వారు ప్రైవేటు సంభాషణల్లో చెబుతున్నారు. 

రాయలసీమలోని నాలుగు జిల్లాల్లో రెండింటికి ఆంధ్ర ప్రాంతంతోను, మిగిలిన రెండింటిని తెలంగాణాతోనూ కలపాలన్న ప్రతిపాదనను కాంగ్రెస్‌ అధిష్టానం పరిశీలిస్తుందని అంటున్నారు. దీనికి సంబంధించిన సమాచారమందడం వల్లనే సీమ మంత్రులిద్దరు ఢిల్లీ వెళ్ళారన్నది టీ-కాంగ్రెస్‌ ఎంపీల అభిప్రాయం. దానికి తోడు తెలంగాణా ఇచ్చేస్తారేమో అన్న టిజి వెంకటేశ్‌ మాటలు కూడా టీ-కాంగ్రెస్ నేతల వాదనను బలపరుస్తున్నాయి.రాష్ట్ర కాంగ్రెస్‌కు కాయకల్ప చికిత్స అనివార్యమనుకుంటున్న పార్టీ అధిష్టానం తెలంగాణాపై తేల్చడం, జగన్‌ జోరుకు కళ్ళెం వేయడం వంటి వ్యూహాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం.