వచ్చే నెలనుంచి వాహనాల జీవితపన్ను పెంపు?

వచ్చే నెలనుంచి వాహనాల జీవితపన్ను పెంపు?

మీరు టూ వీలరో లేక కారో కొనుక్కోవాలనుకుంటున్నారా... అందుకు ఇంకాస్త సమయం వేచి చూద్దామనుకుంటున్నారా... అయితే మీ పర్స్‌కు అదనపు భారం పడ్డట్లే. కొత్త వాహనాలకు కట్టే జీవిత పన్ను పెంచేందుకు రవాణాశాఖ రంగం సిద్ధం చేసింది. ఇప్పటికే ఆచరణలో ఉండాల్సిన కొత్త పన్ను విధానం, రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల కారణంగా కాస్త పెండింగ్‌లో పడింది. ఎలక్షన్‌ హడావుడి ముగిశాక కొత్త టాక్స్‌లు వడ్డించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. 

వాహనాల జీవిత పన్ను రూపంలో ఏటా 1500కోట్లకు పైగా ఆదాయం తెచ్చే ఆర్టీఏకు త్వరలో కాసుల పంట పండనుంది. లైఫ్‌టాక్స్‌ల్లో పెంపుదల చేయాలంటూ ఏడాది క్రితం రవాణా శాఖ నుంచి ప్రభుత్వానికి ప్రతిపాదనలు వెళ్లాయి. అయితే లైఫ్‌ టాక్స్‌ పెంచితే జనాల నుంచి విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందని కొంతకాలం పెండింగ్‌లో పెట్టింది. అయితే..వచ్చే నెలలో దీన్ని అమలు చేసేందుకు రంగం సిద్ధం చేసింది. ఈ నెలలోనే జీవిత పన్నుకు పెంపుదల చేస్తూ జీవో రావలసిన ఉంది. ఎన్నికల కోడ్‌ అమలులో ఉండటంతో వచ్చే నెలకు వాయిదా పడింది. 

ప్రస్తుతం రాష్ట్రంలో మోటర్‌ సైకిల్‌ కొంటే ఇప్పటివరకు దాటి రేటుకు 9శాతం జీవిత పన్ను కట్టాల్సి ఉండేది. అయితే రెండు శాతం లైఫ్‌టాక్స్‌ పెంచుతూ 11శాతం వసూలు చేయాలని....కార్లకైతే 12నుంచి 14శాతం వసూలు చేసేవిధంగా కొత్త పన్నుల విధానం రాబోతుంది. అంతేకాకుండా లక్షదాటిన మోటర్‌ వెహికిల్‌కు 16శాతం, 20లక్షలు దాటిన లగ్జరి కార్లకు 16శాతం పన్నులు లైఫ్‌టాక్స్‌ విధించాలని ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి. ఇకనుంచి కొత్తగా కొనుగోలు చేయబోయే ట్రాక్టర్లు, ఆటోల విషయంలో ఇంతకాలం మూడునెల్లకోసారి పన్నులు కట్టాల్సి ఉండేది. ఆ విధానానికి స్వస్తి చెబుతూ వీటిని కూడా లైఫ్‌టాక్స్‌ల పరిధిలోకి తీసుకురాబోతున్నారు. వీటినుంచి దాదాపు 3శాతం పన్ను వసూలు చేయాలని ఆర్టీఏ ప్రతిపాదించింది.

వచ్చే నెల చివరివారంలోపు జీవితపన్నులు పెరగడం ఖాయంగా కనిపిస్తుంది. ఇదే కనుక జరిగితే కొత్త వాహనాలు కొనాలనుకున్న వారికి అదనపు భారం పడ్డట్లే. 50వేల లోపు మోటర్‌సైకిల్‌ కొన్నవాళ్లకు ఇప్పటివరకు 4500 లైఫ్‌టాక్స్‌ కడితే....పెంచుతున్న కొత్త పన్నులతో 6వేల వరకు కట్టాల్సి వస్తుంది. కార్ల విషయంలో కూడా 10లక్షల ఖరీదు కారు కొంటే ఇప్పటివరకు లక్షా ఇరవై వేలు లైఫ్‌టాక్స్‌ కడితే...ఇకమీద లక్షా 40వేలు కట్టాల్సి ఉంటుంది. లైఫ్‌టాక్స్‌ పెంచడం ద్వారా మరో 500కోట్లమేర ప్రభుత్వ ఖజానాకు జనాల సొమ్ము వచ్చిపడనుంది. అయితే కొత్తగా వాహనాలు కొనాలనుకున్న వారికి పెంచుతున్న జీవిత పన్ను నుంచి తప్పించుకోవాలంటే ఇదే మంచిటైం అంటూ విశ్లేషకులు సూచిస్తున్నారు.