ఆంధ్రప్రదేశ్ కాంగ్రెసుపై సోనియా గాంధీ

 ఆంధ్రప్రదేశ్ కాంగ్రెసుపై సోనియా గాంధీ

 ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు చిరంజీవి ప్రచారం చేసినా పార్టీ ఉప ఎన్నికల్లో తగిన ఫలితాలు సాధించకపోవడానికి గల కారణాలను అన్వేషించే పనిలో ఆమె పడినట్లు తెలుస్తోంది. పరకాలలో డిపాజిట్ దక్కకపోవడం, తిరుపతిలో అభ్యర్థి ఓడిపోవడం, నెల్లూరు లోకసభ సీటులో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి మేకపాటి రాజమోహన్ రెడ్డికి మెజారిటీ ఎలా వచ్చిందనే విషయాలపై ఓ అవగాహనకు వచ్చేందుకు ఆమె ప్రయత్నాలు చేస్తున్నట్లు చెబుతున్నారు.

రాష్ట్రపతి ఎన్నికల తర్వాత రాష్ట్రంలో మార్పులు చేర్పులు ఉంటాయని కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు రాయపాటి సాంబశివరావు చేసిన వ్యాఖ్యలు ఈ నేపథ్యంలో ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఈ నెల 29వ తేదీన కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్‌తో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ సమావేశం కానున్నారు. కొద్ది రోజులుగా కాంగ్రెసు అధిష్టానం రాష్ట్రపతి అభ్యర్థిపై దృష్టి సారించింది.

రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక, విజయాన్ని ఖాయం చేసుకోవడం వంటి సమస్యలు తీరడంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై కాంగ్రెసు అధిష్టానం దృష్టి పెట్టాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఉప ఎన్నికలపై పూర్తి స్థాయిలో విశ్లేషణ చేపట్టి, వ్యవహారాలను చక్కదిద్దడానికి సమాయత్తమవుతున్నట్లు తెలుస్తోంది. ఉప ఎన్నికల ఫలితాలపై  ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ వేర్వేరు నివేదికలు ఇచ్చారు. చిరంజీవి తనదైన విశ్లేషణను ముందు పెడుతున్నారు.

అభ్యర్థుల ఎంపిక, జిల్లాల్లో నేతల మధ్య ఘర్షణ వాతావరణం, అసమ్మతి కార్యకలాపాలు, లోపాయకారిగా జగన్ వర్గంతో కుమ్మ క్కు కావడం వంటి అంశాలపైన లోతైన అధ్యయనం చేయాలని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి గులాం నబీ ఆజాద్ భావిస్తున్నట్లు పార్టీ పెద్దలు చెబుతున్నారు. ఈ నెల 28న ప్రణబ్‌ముఖర్జీ రాష్ట్రపతి అభ్యర్థిత్వం కోసం నామినేషన్ దాఖలు చేయనున్న నేపథ్యంలో కిరణ్, బొత్స ఢిల్లీ వెళ్లనున్నారు. 29న వారిద్దరితోనూ ఆజాద్ సమీక్షాసమావేశాన్ని నిర్వహించే అవకాశం ఉందని చెబుతున్నారు. రాష్ట్రంలోని అంతర్గత పోరుపై ఈ భేటీలో ప్ర ధానంగా దృష్టి సారించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.