ఊపందుకున్న సీఎం కిరణ్ ప్రచారం

ఊపందుకున్న సీఎం కిరణ్ ప్రచారం

సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఉపఎన్నికల ప్రచారం ఊపందుకుంది. శ్రీకాకుళం జిల్లాలో పర్యటించిన ఆయన కేడర్‌లో జోష్‌ పెంచారు. వైఎస్‌ కుటుంబంపై డైరెక్ట్‌ అటాక్‌కు దిగిన కిరణ్‌ కుమార్‌ రెడ్డి ఇటు టీడీపీ అధినేత చంద్రబాబుపైనా నిప్పులు చెరిగారు. సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూనే ప్రత్యర్థులను చీల్చిచెండాడుతానన్నారు. మరోవైపు తిరుపతి ప్రచారంలో కిరణ్‌ మత పరమైన వ్యాఖ్యలు చేశారంటూ ఎన్నికల సంఘం నోటీసులు ఇచ్చింది.సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఉపఎన్నికల ప్రచారంలో తనదైన శైలిలో ముందుకు దూసుకుపోతున్నారు. 

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించిన ఆయన కేడర్‌లో జోష్‌ నింపారు. జలుమూరు, శ్రీముఖలింగం, కొమనాపల్లి, కరవంజ, ఈదులవలస గ్రామాల్లో రోడ్‌షో నిర్వహించి సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించారు. మబగాంలో రోడ్‌షో నిర్వహించాల్సి ఉన్నా అప్పటికే రాత్రి 10గంటలు దాటడంతో ప్రచారం ముగించారు.వైఎస్‌ కుటుంబంపై డైరెక్ట్‌ అటాక్‌కు దిగిన సీఎం కిరణ్‌.. జగన్‌ను సీబీఐ అరెస్ట్‌ చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. జగన్‌ సంస్థల్లోకి వేలకోట్ల రూపాయల పెట్టుబడులు ఎలా వచ్చాయో చెప్పనందుకే సీబీఐ ఆయన్ను అరెస్ట్‌ చేసిందన్నారు. నేరం రుజువైతే 14ఏళ్ల జైలుశిక్ష కూడా తప్పదని కిరణ్‌ తేల్చిచెప్పారు.