సీఎం కిరణ్‌పై వేటు తథ్యం

సీఎం కిరణ్‌పై వేటు తథ్యం

రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పైకి మాత్రం తన పదవికి వచ్చిన ఢోకా ఏమి లేదని గాంభీర్యవదాన్ని ప్రదర్శిస్తున్నప్పటికీ.. లోలోపల మాత్రం ఆయనకు ముచ్చెమటలు పడుతున్నాయి. రాష్ట్రపతి ఎన్నికల అనంతరం రాష్ట్రంలో నాయకత్వ మార్పడి తప్పదన్న హస్తిన పరిణామాలు, సొంత పార్టీ నేతల మాటలు తేటతెల్లం చేస్తున్నాయి. దీంతో కిరణ్ కుమార్ రెడ్డి అప్రమత్తమై తన పదవిని కాపాడుకునేందుకు లాబీయింగ్ మొదలెట్టినట్టు సమాచారం. 

ఇందులోభాగంగానే ఆయన రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ గులాం నబీ ఆజాద్, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్, సోనియా రాజకీయ సలహారు అహ్మద్ పటేల్ వంటి సీనియర్లతో మంతనాలు జరుపుతున్నట్టు ఢిల్లీ మీడియా వర్గాల కథనం. అలాగే, పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణను కూడ జోడు పదవుల నుంచి తొలగించి కేవలం పీసీసీ చీఫ్‌ లేదా మంత్రిగానే కొనసాగించే అవకాశాలు ఉన్నట్టు సమాచారం. 

ప్రధానంగా, ఉప ఫలితాల కంటే.. కిరణ్ కుమార్ రెడ్డి, బొత్స వైఖరిల పట్ల పార్టీ అధినేత్రి సోనియా ఆగ్రహంతో ఉన్నట్టు సమాచారం. వారిపై తాము ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేశారంటూ తనను కలిసిన సీనియర్ల వద్ద వ్యాఖ్యానించినట్టు సమాచారం. ముఖ్యంగా.. వైఎస్.జగన్ గురించి సమాచారం చేరవేయడంలో కిరణ్ పూర్తిగా విఫలమయ్యారన్నది సోనియా మాటగా ఉంది. జగన్‌ వెంట నలుగురైదుగురు ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారంటూ నమ్మబలికించడాన్ని ఆమె జీర్ణించుకోలేక పోతున్నారు. అందుకే.. తొలుత కిరణ్‌కు షాకిచ్చి తర్వాత మంత్రివర్గ ప్రక్షాళన పేరుతో బొత్సకు కత్తెర వేయాలన్నది ఆమె ఆలోచనగా ఉన్నట్టు వినికిడి. 

ఇదే నిజమైతే.. రాష్ట్రానికి నాలుగో కృష్ణుడు (సీఎం)గా తెలంగాణ ప్రాంతానికి చెందిన సీనియర్ నేత కందూరు జానారెడ్డి బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది. వాస్తవానికి అధిష్టానానికి నమ్మినబంటుగా ఉన్న పీసీసీ మాజీ చీఫ్ ధర్మపురి శ్రీనివాస్‌కు ఈ అవకాశం ఇవ్వాల్సి ఉంది. అయితే, ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీంతో ఆ లక్కీ ఛాన్స్ కె.జానారెడ్డిని వరించే అవకాశాలు ఉన్నట్టు సమాచారం. పైపెచ్చు.. కేంద్ర మంత్రి ఎస్.జైపాల్ రెడ్డి సైతం జానారెడ్డికి అండగా ఉంటున్నారు. అధిష్టానంతో జైపాల్ రెడ్డికి సత్ సంబంధాలు ఉండటంతో జనారెడ్డి సీఎం అయ్యే సూచనలు ఎక్కువగా ఉన్నట్టు ఢిల్లీ వర్గాల సమాచారం.