ఇక మూకుమ్మడి రాజీనామాలు

ఇక మూకుమ్మడి రాజీనామాలు

కర్నాటక రాజకీయం ముదురుతోంది. మాజీ ముఖ్యమంత్రి, బిజెపి సీనియర్ నేత యడ్యూరప్ప వర్గం ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఆదివారం యడ్యూరప్ప తన మద్దతుదారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా యడ్డీ వర్గం పార్టీ అధిష్టానానికి ఆల్టిమేటం జారీ చేసింది. ఈ నెల 5వ తేదిలోగా ముఖ్యమంత్రి సదానంద గౌడను తొలగించాలని, తాము సూచించిన అభ్యర్థిని ఆ స్థానంలో కూర్చుండ బెట్టాలని సూచించారు.

తాము విధించిన గడువులోగా సదానందను మార్చకుంటే మూకుమ్మడి రాజీనామాలు చేస్తామని హెచ్చరించారు. యడ్డీ వర్గం భేటీ అయి భవిష్యత్తు ప్రణాళికపై చర్చించింది. పార్టీ దూతగా వచ్చిన ధర్మేంద్ర ప్రధాన్ చర్చలు విఫలమయ్యాయి. తాము సూచించిన జగదీష్ షెట్టార్‌కు బాధ్యతలను అప్పగించాల్సిందేనని వారు ధర్మేంద్ర వద్ద కుండబద్దలు కొట్టారు. రాష్ట్రపతి ఎన్నికల తర్వాత కర్నాటకపై దృష్టి పెట్టాలని అధిష్టానం భావించింది.

అయితే 5లోగా తేల్చాలని యడ్డీ వర్గం అల్టిమేటం జారీ చేయడంతో ఇప్పుడు ఉక్కిరిబిక్కిరవుతోంది. దీంతో వెంటనే ఢిల్లీ రావాలని ముఖ్యమంత్రి సదానంద గౌడను ఆదేశించింది. ఆయన ఈ రోజు ఢిల్లీ వెళ్లి పార్టీ పెద్దలతో చర్చలు జరుపుతారు. యడ్యూరప్పకు మద్దతుగా ఇప్టటికే తొమ్మిది మంది మంత్రులు రాజీనామా చేశారు. తాజాగా మరో ఆరుగురు ఎంపీలు రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది. యడ్డీకి 51 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని చెబుతున్నారు.

సదానంద ఈ రోజు ఢిల్లీ వెళ్లనుండటంతో ముఖ్యమంత్రి మార్పా మరేమైనా సోమవారం తేలే అవకాశముందని అంటున్నారు. కాగా యడ్డీ వర్గంతో భేటీ అయిన ధర్మేంద్ర ప్రధాన్ అధిష్టానానికి నివేదిక సమర్పించేందుకు ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయంలో ధర్మేంద్ర విలేకరులతో మాట్లాడారు. రాజీనామా చేసిన మంత్రులు వాటిని వెనక్కి తీసుకోవాలని కోరారు. రాష్ట్ర పరిస్థితులను అధిష్టానం పెద్దలకు వివరిస్తానని, త్వరలోనే వారు మంచి నిర్ణయం తీసుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు.