ప్రణబ్ వెళ్లాక జూబ్లీహాల్లో మంటలు

ప్రణబ్ వెళ్లాక జూబ్లీహాల్లో మంటలు

మాజీ కేంద్రమంత్రి, యుపిఏ రాష్ట్రపతి అభ్యర్థి ప్రణబ్ ముఖర్జీ ప్రసంగించి వెళ్లిన కాసేపటికే జూబ్లీహాల్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. వచ్చే రాష్ట్రపతి ఎన్నికలలో ప్రణబ్ ముఖర్జీ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇందుకోసం పలు పార్టీల మద్దతు కూడగట్టే క్రమంలో భాగంగా ఆయన ఆదివారం హైదరాబాద్ వచ్చారు. ఆయన కాంగ్రెసు శాసనసభా పక్షంతో జూబ్లీహాల్లో భేటీ అయ్యారు. అయితే ఆయన ప్రసంగించి వెళ్లిన కాసేపటికే అక్కడ మంటలు చెలరేగాయి.

దట్టమైన పొగలు అలుముకొని హాల్లో మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో సిబ్బంది మొత్తం బయటకు వచ్చారు. షార్ట్ సర్క్యూట్ ఈ ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకు వచ్చాయి. విద్యుత్ తీగలు దెబ్బతినడం వల్లే ప్రమాదం చోటు చేసుకుందని అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. నేతలు అక్కడ ఉండగానే మంటలు చెలరేగటంతో అందరూ ప్రాణభయంతో బయటకు పరుగు తీశారు.

జూబ్లీహాల్లో జరిగిన అగ్ని ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వెంటనే స్పందించారు. దీనిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. విచారణాధికారిగా అజయ్ మిశ్రాను నియమించారు. ఘటనపై వెంటనే తనకు నివేదిక ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. తాజ్ కృష్ణాలో ప్రణబ్‌ను ముఖ్యమంత్రి కలిశారు. ప్రమాద ఘటనను వివరించారు. ప్రణబ్ ఈ ఘటనపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇది చిన్న ప్రమాదమే అని, అధికారులు అప్రమత్తమై చల్లార్చారని మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు.

కాగా అంతకుముందు జూబ్లీహాల్లో ప్రణబ్ మాట్లాడుతూ... రాష్ట్రపతిగా పోటీ చేయడం అరుదైన గౌరవం అన్నారు. ఎపి ఓటర్లు తనకు మద్దతివ్వాలని విజ్ఞప్తి చేశారు. నాకు మద్దతిచ్చిన వారందరికీ కృతజ్ఞతలు అన్నారు. యుపిఏలో లేకపోయినప్పటికీ తనకు మద్దతిచ్చిన జెడి(యు), శివసేన, సిపిఎం, ఫార్వర్డ్ బ్లాక్ పార్టీలకు ధన్యవాదాలు తెలిపారు. మిగిలిన పార్టీలు కూడా తనకు మద్దతివ్వాలని కోరారు. ప్రణబ్‌ను పలువురు నేతలు కలుసుకున్నారు. తాజ్ కృష్ణలో ఎంఐఎం నేతలు ప్రణబ్‌ను కలిశారు.