జగన్ పార్టీలోకి కొల్లాపూర్ ఇంఛార్జ్

జగన్ పార్టీలోకి కొల్లాపూర్ ఇంఛార్జ్

మహబూబ్‌నగర్: ఇటీవల ఉప ఎన్నికల అనంతరం తెలుగుదేశం పార్టీకి తొలి దెబ్బ తగిలింది. పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు మహబాబ్‌నగర్ జిల్లాకు చెందిన ముఖ్యనేత గట్టి షాక్ ఇచ్చారు. జిల్లాకు చెందిన కొల్లాపూర్ నియోజకవర్గ ఇంఛార్జ్ జగదీశ్వర రావు పార్టీ సభ్య్తత్వానికి, పదవులకు రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుకు ఫ్యాక్స్ ద్వారా పంపించారు.

తాను ఫ్యాక్స్ ద్వారా చంద్రబాబుకు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, పదవులకు రాజీనామా చేస్తున్నట్లు రాసిన లేఖను పంపించినట్లు విలేకరుల సమావేశంలో తెలిపారు. తాను త్వరలో కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరనున్నట్లు ప్రకటించారు.

ఇటీవల జరిగిన ఉప ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ ఘోర పరాజయం మూటకట్టుకున్న విషయం తెలిసిందే. ఉప ఎన్నికలు జరిగిన పద్దెనిమిది అసెంబ్లీ, ఒక పార్లమెంటు నియోజకవర్గాలలో ఏ స్థానంలోనూ గెలుపొందలేదు. అంతేకాదు పలుచోట్ల డిపాజిట్లు కూడా కోల్పోయింది. కాంగ్రెసు కూడా చావుతప్పి కన్ను లొట్టబోయినట్లు రెండు సీట్లలో గెలుపొంది కాస్త ఫరవాలేదు అనిపించికుంది.

జగన్ పార్టీ పద్దెనిమిది అసెంబ్లీ, ఒక పార్లమెంటు స్థానాలలో విజయకేతనం ఎగురవేశాయి. తెలంగాణలోని పరకాల నియోజకవర్గంలో తెలంగాణ రాష్ట్ర సమితి గెలుపొందింది. అంతకుముందు తెలంగాణలో జరిగిన ఉప ఎన్నికలలోనూ తెలుగుదేశం పార్టీ ఘోర పరాజయం చవి చూసింది.