నిత్యానందకు రిషి డిమాండ్

నిత్యానందకు రిషి డిమాండ్

రాసలీలల స్వామి నిత్యానంద స్వామి కేసును తన రాజకీయ పలుకుబడి ఉపయోగించి మూసివేయిస్తానని, ప్రతిగా తనకు రూ.11 కోట్ల డబ్బు, ఫార్చూన్ కారు ఇవ్వాలని రుషికుమార్ స్వామి అనే అతను డిమాండ్ చేశాడని ఓ ప్రయివేటు ఛానెల్‌లో సోమవారం ప్రచారం కావడం దుమారం రేపింది.  నిత్యానంద రాసలీలలను ఖండిస్తూ పలు కన్నడ సంఘాలు, సంస్థలు, స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించారు. వాటికి ఈ రిషికుమార్ స్వామి నేతృత్వం వహించారు. నిత్యానంద లాంటి వారిని వెలి వేయాలని, ఆయనను కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇలాంటి వారిని ఉపేక్షించవద్దని చెప్పారు. అయితే అప్పుడు నిత్యానంద రాసలీలలపై ఉద్యమించిన రిషికుమార్ స్వామి ఇప్పుడు వివాదంలో చిక్కుకున్నారు.

తన రాజకీయ పలుకుబడి ఉపయోగించి కేసును మూసివేయిస్తానని నిత్యానందకు ఆఫర్ చేసినట్లుగా టీవి ఛానల్‌లో జోరుగా ప్రచారం సాగింది. దీంతో హాసన్ జిల్లా అరసికెరె పట్టణంలోని రుద్రగుండి రోడ్డులోని రుషికుమార స్వామికి చెందిన ఇంటిపై స్థానికులు దాడి చేశారు. అక్కడ ఉన్న పూలకుండీలు, వస్తువులను ధ్వంసం చేశారు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు అక్కడకు చేరుకొని ఆందోళనకారులను అక్కడి నుండి పంపించారు.

రిషికుమార్ స్వామి, చిక్‌మగ్‌లూరులోని ఆయన ఆశ్రమం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పలు ప్రాంతాలలో ఉన్న ఆయన ఫ్లెక్సీలను, బ్యానర్లను ధ్వంసం చేశారు. కాగా టివీ ఛానెళ్లలో నిత్యానంద నుండి తాను 11 కోట్ల రూపాయలు, ఫార్చూన్ కారు డిమాండ్ చేసినట్లు వార్తలు రావడంతో అతను అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లుగా తెలుస్తోంది.