ధన త్రయోదశి

ధన త్రయోదశి

ఆశ్వయుజ బహుళ త్రయోదశినాడు గోత్రిరాత్రవ్రతం జరుపుతారని చతుర్వర్గ చింతా మణి చెబుతుంది. ఇప్పటికీ దిపావళి రెండు రోజులు ఉంటుంది. దీపావళి గుజరాతీయు లకు సంవత్సరాది. ఈ ఉగాదికి రెండు రోజులు పూర్వ,ం రెండు రోజులు తర్వాత కూడా వారికి పండుగలే. అనగా దీపావళి పర్వదినాలలో వారికి వరసగా ఐదు రోజులు పండుగలన్న మాట. ఆ ఐదురోజుల పండుగలలో ఈనాడు మొదటిది.
ఆమాదేర్‌ జ్యోతిషీ అనే గ్రంథం దీనిని ధన త్రయోదశి అని పేర్కొంటూ ఉంది. ధనత్ర యాదశిని గుజరాతీలు ధన్‌తీరాస్‌ అంటారు. త్రయోదశి అనగా పదమూడో తిథి. పద మూడు మంచి అంకెకాదని పాశ్చాత్యుల నమ్మిక, మనకు మాత్రం పదమూడో తిథి మంచిరోజు. దీపావళి సంవత్సరాది అయిన గుజరాతీలు వారి పొరుగువారైన మహారా ష్ట్రులు ధన త్రయోదశిని గొప్పపర్వంగా జరుపు తారు. ఈరోజు వారు తమ ఇళ్లను శుభ్రం చేస్తారు. అలికి, కడిగి, రంగురంగుల ముగ్గులు పెడతారు. శుచిగాఉంచితే లక్ష్మీదేవి ఆ ఇంటికి వస్తుందని వారి విశ్వాసం. ఈ రోజు నుంచీ దీపాలు వెలిగించడం ప్రారంభమవు తుంది. ఈ రోజు వారు అభ్యంగన స్నానం చేసి మంచి బట్టలు కట్టుకుని సుగంధ ద్రవ్యాలు రాచుకొని ధన పూజచేస్తారు. ఇంట్లో ఉన్న బంగారు వస్తు వులను, వెండి వస్తువులను పాలతో కడుగు తారు. శుభ్రంచేసి పూజ చేసే చోట ఉంచు తారు. ఈ రోజు వ్యాపారస్తులు తమ సరుకునిలవ, రొక్క నిలవ సరి చూచుకొని లక్ష్మికి పూజ చేస్తారు. గుజరాత్‌, మహారాష్ట్రదేశాల్లో ఈ పండుగ జరుపబడే తీరు ఇది. ఇక మాళవదేశంలో ఇది జరుపబడే తీరు తెలుసుకుందాం. ఈ సందర్భంలో 'డాక్టర్స్‌ ఆఫ్‌ మాల్వా' అనే గ్రంథంలో ఇట్లా వుంది. వర్తకులు తమ లెక్కాడొక్కా తేల్చుకుంటారు. వర్షాలు చాలా వరకు వెనక పట్టాయి. కాగా ఇళ్లకు వెల్లకొట్టి అలంకరించడానికి అవకాశం ఏర్పడు తుంది. ఈ పండుగకు పితృదేవతలు కూడా తమ పూర్వ గృహాలకు తిరిగి వస్తారని మాళవ దేశస్థుల నమ్మకం. కాబట్టి వారు ధనత్రయోదశి నాడు సాయం కాలం తమ ఇంటి ముందు రోడ్డు మీద దక్షిణ దిక్కుగా దీపం ఉంచుతారు. వచ్చే పితృదేవతలకు దారి చూపిస్తుందని వారి విశ్వాసం.
ఈ చతుర్దశినాటి అభ్యంగన స్నానం వల్ల, దీపదానం వల్ల, యమతర్పణం వల్ల మాన వులు తమకు నరకం లేకుండా చేసుకుంటారో దానికి నరకచతుర్దశి అని పేరని కొందరు అంటారు.
'చతర్దశ్యాంతుయే దీపాన్నరకాయ దదంతి చ
తషాం పితృగణా: సర్వే నరకాత్‌ స్వర్గ మాప్నురయ:' అని శాస్త్ర వచనం.
'చతుర్దశి నాడు ఎవరు నరక లోక వాసులకై దీపాలు వెలిగి స్తారో వారి పితృదేవతలు అందరూ నరక లో కం నుండి స్వర్గలోకా నికి పోవుదురు. అని దాని తాత్పర్యం. దీపావళి పండు గలో ముఖ్యమైనది ఏమంటే తెల్లవారకుండా అభ్యంగన స్నానం చేయడం. చీకటి వుండగా స్నానం చేయనివారు నరక కూపంలో పడిపోతా రట. ప్రతీమాసంలోనూ బహుళచతుర్దశి మాస శివరాత్రి. ఆనాడు కాని, మరునాడు బహుళ అమావాస్యనాడుకాని అభ్యంగస్నానం చేయకూడదనే ఆచారం ఉంది. ఈ ఆచారం ఆశ్వయుజ బహుళ చతుర్దశికి అమావాస్యకు లేదు. పైగా ఆరోజు అభ్యంజన స్నానం తప్పనిసరిగా చేయా లని వ్రత చూడామణి మొదలైన గ్రంథాలు చెబుతున్నాయి. ఈ వేకువజా మున తైలా భ్యంగనం చే సికొని యమ తర్పణం చేసే వారికి యమ దర్శనం లేదని శాస్త్ర వచనం. చతుర్దశినాడు నూవుల నూనెతో తలంటుకోవాలి. నరక చతుర్దశి, దీపావళి అమా వాస్యలందు తిలతైలంలో లక్ష్మీదేవి ఆవేశించి ఉంటుందని శాస్త్రవచనం. లక్ష్మీ కళలు ఆవేశించి ఉండే తిల తైలంతో ఈరోజు తలంటి పోసుకోవ డం లక్ష్మీప్రదమైంది.
నరకచతుర్దశి నాడు చేసే పిండివంటలు
నరకచతుర్దశినాడు తినవలసిన ఆహా రంలో పూర్వీకులు చెప్పారు. నువ్వులతో వండిన పిండివంటలు ఈ రోజు తప్పక తినాలి. మాషపత్రములే కాక మాషములతో చేసిన పిండివంటలు కూడా ఈనాడు తినడం మంచిది. చతుర్దశినాడు అప్పాలు తినాలని చెప్పారు.
దీపదానం
నరకచతుర్దశినాడు సాయంకాలం ప్రదో షకాలమందు దీపదానం చేయాలి. దేవాల యాల్లో, మఠాల్లో దీపపంక్తులు ఉంచాలి. లక్ష్మీకాములైన మానవులు ఈనాడును, దీపా వళినాడును, కార్తికశుద్ధ పాడ్యమి నాడును దీప ప్రదానం తప్పనిసరిగా చేయాలి.
శాస్త్రాల్లో ప్రదోషకాలాన చేసే ఈ దీపదా నాల వల్ల రెండు విధాలైన ఉపయోగాలు ఉన్నట్లు చెప్పబడింది. ఈ దీపాలు నరకలోక వాసులకు వలసిన వెలుతురును ఇస్తాయి. ఈ దీపదానాలవల్ల ఇక్కడి వారికి యమమార్గా ధికారుల బాధ లేకుండా పోతుంది, నరక బాధ తప్పిపోతుంది.
ఆశ్వయుజ కృష్ణ అమావాస్య
దీపావళి అమావాస్య
దీపమాలికలతో లక్ష్మికి నీరాజనమీయబడే రోజు కావడం చేత దీనికి దీపావళి అనే పేరు వచ్చింది. నరకలోకవాసులకై దీపావళి కల్పించే రోజు కాబట్టి దీనికి దీపావళి అనే పేరు వచ్చింది.
హిందూ మత సంస్కృతికి, హిందూ మత సంప్రదాయానికి దీపావళి పర్వం ఒక చిహ్నమని చెప్పవచ్చు. రాక్షస రాజైన బలిచక్రవర్తి పాతా ళానికి విష్ణువుచే అణగ ద్రొక్కబడిన రోజు కావడం చేత ఇది ఒక మహో త్సవ రోజుగా పరిగణించ బడుతూ ఉంది.
శ్రీరాముడు పట్టాభిషిక్తుడైన రోజు కావున మహోత్సవం ఏర్పాటైంది.
విక్రమశక స్థాప కుడైన విక్రమార్క చక్రవర్తి పట్టాభిషికం పొందిన రోజు.
లక్ష్మీదేవి ఈ రోజు భూలోకానికి దిగి వచ్చి ఇల్లిల్లు తిరుగుతుందని ప్రజల విశ్వాసం. కాగా ఇండ్లు శుచిగా ఉంచాలి.
మధ్యాహ్నం పిండి వంటలతో భోజనం. భోజనానంతరం జూదం ఆడడం. లక్ష్మీదేవి తమ ఇంటికి రావడానికి దారి చూపేందుకు దీపాలు.

దీపావళి :
బాణాసంచా
చిటపట టుప్పుటప్పునెడి సీమటపాకుల పెట్టెలెన్నియు
ద్భటముగ ఢమ్ముడ మ్మను టపాకులలెన్ని మతాబులెన్ని పి
క్కటి ఝల్లులెన్ని, మరి కాకరపూవతులెన్ని గాల్తురో
దిటముగఁదెల్పనాత రమె దివ్వెల పండుగ రేయి నర్భకుల్‌.
దాసు శ్రీరాములు
దీపావళి పండుగకు వెలుతురు ఇచ్చే, చప్పుడుచేసే, బాణాసంచా కాల్చడం దేనికి అనే జిజ్ఞాస కలగడం సహజం. పెద్దనే పాళపు గింజలు పుల్లకు గుచ్చి వెలిగించడం. జనపకట్టె జుంజుం కట్టలు వెలి గించడం. కూడా కొన్ని ప్రాంతాల్లో ఉంది. ఈజిజ్ఞాసకు మీమాంస అనేక రీతులుగా చెప్పబడుతుంది.
మహాలయ పక్షమున స్వర్గం నుండి దిగి వచ్చి భూలోకంలో తిరుగుతూ ఉండే పితృదేవతలు ఈ రోజు తిరిగి పితృలోకానికి ప్రయాణమై వెళతాడు. వారికి వెలుతురు చూపడం నిమిత్తం నరలోక వాసులు చేతులతో కాగడాలు పట్టుకొని ఆకాశం వైపు చూపాలని శాస్త్రవచనం. ఆ కాగడాలే ఇప్పుడు దీపావళి పండుగలో మతాబులు కాల్చటంగా మారింది. ఇక చప్పుడు చేసే టపాకాయల విషయం. దీపావళి నాటి రాత్రి లక్ష్మీపూజ చేసిన తర్వాత నిద్రపోకుండా ఉండి అర్థరాత్రి అయిపోయాక చేటల మీద కర్రలు కొట్టి, డిండిమం అనే వాద్యాలు వాయించి ఆ లక్ష్మిని వీధుల వెంట సాగనంపాలని శాస్త్ర వచనం.
ఆ వాద్యధ్వనులే సముచితంగానే ఉంది. నరకాసురుడి చావుకి సంతోషించి భూలోకం లోని వారు బాణాసంచా కాలుస్తున్నారని వాడుక.
టపాకాయలు
దీపావళి మరురనాటి నుంచి కార్తీక మాసం. కార్తీక మాసంలో కడనలు. దీపావళి వెళ్లిన నాలుగో రోజు నాగులచవతి. నాగుల చవితికి చలి ప్రవేశిస్తుంది. దీపావళి వానా కాలానికి శీతాకాలానికి సంధి కాలంలో వస్తుంది. వర్షాకాలంలో పచ్చిక బాగా మొలు స్తుంది. పచ్చికతో క్రిమికీటకాలతో, నాటి నుంచి నెల పొడువునా పెట్టబడే దీపాలతో క్రిమి కీటకాదులు ఎక్కువగా నశిస్తాయి. మందుల కాల్పుల వలన, దీపాల వెలిగింపు వల్ల వాయు వులో కీటకాదులను నాశనం చేసే గుణం పెం పొందుతుంది.
దీపమాలిక
నరకచతుర్దశి నాటి ప్రదోషకాలమునందు వలెనే దీపావళి అమావాస్యనాడు కూడ ఇళ్లలోను, దేవాలయాల్లోనూ, మఠాల్లోనూ దీపమాలికలు ఉంచాలి. దీపాలు వృక్షాకార ముగ చేసి వెలిగించాలి.
ఈ పండుగల సందర్భంలో సాయంత్రం ప్రదోష కాలాల్లో దేవాలయాదుల్లో దీపాలు వెలిగించడం వల్ల మానవులకు యమలోక మార్గంలో అధికారుల బాధ ఉండదని శాస్త్ర ప్రమాణము.
పిల్లల దివిటీలు
మన దేశంలో దీపావళినాడు సాయం త్రం ప్రదోష కాలంలో పిల్లలు దివిటీలు కొట్టే ఆచారం ఉంది. ఈ ఆచారం పితృదేవతలకు వెలుగుచూపించే నిమిత్తం వేసే కాగడా కరణీయ విధానం నుండే పుట్టుకువచ్చినట్లు ఊహించాలి.
ఈ దివిటీలు కొట్టడానికి ప్రాయకంగా గోగుదుత్తలు, గోగుకర్రలు కాని చెరకు కల్రు కాని, ఆముదపు కర్రలు కాని ఉపయోగిస్తారు. నూనెలో గుడ్డ వత్తులు నానబెట్టి ఉంచుతారు. చిగుళ్లు తెంపని గోగు కొమ్మలు తెచ్చివాని చివర పంగల్లో ఈ వత్తులు వేళ్లాడేటట్లు కడ తారు. గోవులు ఇంటికి వచ్చే వేళ ఈ వత్తులు వెలిగించి ఆ వత్తులు బాగా వెలుగుతూ ఉండగ వీధి వాకిటిలో కొడతారు. పెళ్లికాని ఆడపిల్లలు, వడుగు కాని మగపిల్లలు చిన్నవాళ్లుమాత్రమే ఈ విధంగా చేస్తారు. ఆ దివిటీలు కొట్టేటప్పుడు
దుబ్బూ దుబ్బూ దీపావళీ
మళ్లిd వచ్చే నాగుల చవితి
పుట్టమీద పొట్ట కర్ర
పట్టుకురా బావమరిది
అనే పాట పాడుతారు. ఈ పాట పాడుతూ వాటిని కొట్టి ఒక వారగా పారేసి వచ్చి కాళ్లు చేతులు కడుగుకొని తీపి పదార్థం తింటారు.