సి.ఎమ్. మార్పు కాదు..టి. పై నిర్ణయం కావాలి!

సి.ఎమ్. మార్పు కాదు..టి. పై నిర్ణయం కావాలి!

ఒకపక్క అధిష్టానం ముఖ్యమంత్రి కిరణ్ ను మార్చుతారన్న అసమ్మతి ప్రచారం జోరుగా సాగుతుంటే,మరో వైపు కిరణ్ ను బలపరిచే తెలంగాణ ఎమ్మెల్యేలు పలువురు డిల్లీలో మకాం చేసి ముఖ్యమంత్రి మార్పు కాదు..తెలంగాణపై నిర్ణయం తీసుకోవాలన్న డిమాండ్ ను తెరపైకి తెస్తున్నారు. మేడ్చల్ ఎమ్మెల్యే కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో సుమారు ఇరవై మంది ఎమ్మెల్యేలు ఈ ప్రయత్నంలో పడ్డారు. ముఖ్యమంత్రిని మార్చుతారా?లేదా అన్న నిర్ణయం సంగతి ఎలా ఉన్నా, ఎవరి సంశయాలతో వారు తమ వ్యూహాలను అమలు చేస్తున్నారు. కిరణ్ కు సన్నిహితంగా ఉండే ఈ ఎమ్మెల్యేలు ప్రస్తుతం డిల్లీలోనే ఉండి అధిష్టానం పెద్దలను కలుసుకోవడానికి యత్నిస్తున్నారు.అలాగే సోనియాగాంధీని కలిసి ఈ విషయాన్ని స్పష్టం చెప్పదలిచారు.తెలంగాణ వ్యక్తి ముఖ్యమంత్రి అయినందువల్ల వచ్చే ప్రయోజనం ఉండదని, తెలంగాణపై తేల్చాలని వారు కోరుతున్నారు. ఇది తెలివైన వ్యూహమే. ఎందుకంటే తెలంగాణపై నిర్ణయం అనగానే కోస్తా, రాయలసీమలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్.పిలు తెలంగాణపై నిర్ణయం తీసుకోవద్దని, అందులోను తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇవ్వడానికి వీలు లేదని వాదిస్తారు.ఈ వివాదం జోలికి వెళ్లాలంటేనే అధిష్టానం కూడా భయపడే పరిస్థితి ఏర్పడింది.అందువల్ల ఆ అంశం ఎటూ తేలదు కనుక సి.ఎమ్.ను మార్చకుండా , సి.ఎమ్.కు కూడా ఎమ్మెల్యేలలో బలమైన మద్దతు ఉందని తెలియచప్పడానికి వీరు యత్నిస్తారు.మొత్తం మీద వ్యూహ,ప్రతి వ్యూహాలతో కాంగ్రెస్ రాజకీయం నడుస్తోంది.