కేసులు వామపక్షాలకు, అదికారం కాంగ్రెస్ కు!

కేసులు వామపక్షాలకు, అదికారం కాంగ్రెస్ కు!

మన రాష్ట్రంలో తెలుగుదేశం అదికారంలో ఉన్నప్పుడు రెండువేల సంవత్సరంలో బషీర్ బాగ్ వద్ద జరిగిన పోలీసు కాల్పులు ఒక కీలకమైన ఘట్టంగా అంతా గుర్తిస్తారు. ఆ కాల్పులలో మరణించినవారికి స్మృత్యర్ధం ఒక స్థూపాన్ని కూడా కాంగ్రెస్ ప్రభుత్వ సహకారంతో నిర్మించారు. బషీర్ బాగ్ కాల్పులు ఘటన కూడా టిడిపి ఓటమికి, కాంగ్రెస్ అదికారంలోకి రావడానికి ఉపయోగపడింది.అయితే పన్నెండు సంవత్సరాల తర్వాత సిఐడి కాల్పుల కేసులో ఛార్జీషీట్ దాఖలు చేస్తున్నదన్న కధనాలు ఆశ్చర్యం కలిగిస్తాయి. అందులో ఒకరిద్దరు కాంగ్రస్ నేతలు మినహా ,ప్రధానంగా వామపక్షాల నేతలపై పోలీసులు కేసు పెట్టడం ఆసక్తికరంగా ఉంది. అంటే అదికారం కాంగ్రెస్ పార్టీకి, కేసులు మాత్రం వామపక్షాల నేతలకా అన్న మీమాంస ఏర్పడింది. అప్పట్లో కాంగ్రెస్ , సిపిఐ, సిపిఎం , తదితర వామపక్షాలు అన్నీ కలిసి ఆందోళన నిర్వహించాయి.నాటి ఘటనకు అసలు బాధ్యులుగా వామపక్ష నేతలు సురవరం సుధాకర్‌రెడ్డి ( ప్రస్తుతం సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి), బీవీ రాఘవులు (సీపీఎం రాష్ట్ర కార్యదర్శి), పుణ్యవతి (రాఘవులు సతీమణి)మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య (సీపీఐ(ఎమ్-ఎల్) మానం ఆంజనేయులు (న్యూడెమోక్రసీ), కాంగ్రెస్ నేత , ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి తదితర 28 మందిపై కేసులు నమోదు చేసే దిశగా సీఐడీ అడుగులు వేస్తోంది.మొత్తం మీద కాంగ్రెస్ నేతలలో మెజార్టీ అధికారాన్ని అనుభవిస్తే, వామపక్ష నేతలు లాఠీ దెబ్బలనే కాక, ఇప్పుడు పోలీసు కేసులను కూడా ఎదుర్కోవలసి వస్తోందన్నమాట.స్తూపం కూడా కట్టించడానికి సహకరించిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఈ కేసును ఉపసంహరించుకుంటుందా? లేక కొనసాగిస్తుందా అన్నది ఆసక్తికరం.