డబుల్ గేమ్ ఆడని నేతలు ఉన్నారా?

డబుల్ గేమ్ ఆడని నేతలు ఉన్నారా?

కొద్ది రోజుల క్రితం రాష్ట్ర మంత్రి దానం నాగేందర్ ఒక వ్యాఖ్య చేశారు. తెలంగాణ మంత్రులు బయటకు మాట్లాడేది ఒకటి, లోపల చేసేది మరొకటి , ఏదొ ఒక విషయంపై స్పష్టంగా ఉండాలని ఆయన అన్నారు. ఇది వాస్తవం. నిజానికి రాజకీయమే ఒక మాయ. ద్వంద్వ నీతికి పాల్పడడంలో రాజకీయానికి మించిన రంగం మరొకటి ఉండకపోవచ్చు. ఇది ప్రాంతాలకు అతీతమైన వ్యవహారం. అందులోను మన రాష్ట్రలోను రాజకీయ నాయకుల, పా్ర్టీల డబుల్ గేమ్ చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. రాజకీయ నేతలు ఇలా వ్యవహరించడానికి ఏ మాత్రం సంకోచించకపోవడం ఇందులోని ప్రత్యేకత.తెలంగాణ అంశాన్ని తీసుకోండి.అందరిది డబుల్ గేమే.పైకి కావాలని అనడం, లోపల రాకుండా ఉంటే బెటర్ అనుకోవడ, లేదా పైకి సమైక్యవాదానికి అనుకూలంగా మాట్లాడడం, తెలంగాణ వస్తే బాగుండని అనుకోవడం.. ఇదొక రంగులమాయగా కనిపిస్తుంది. మన రాష్ట్రంలో ఈ విషయంలో నేతల సరళిని పరిశీలిస్తే మాట మార్చని లేదా డబుల్ గేమ్ ఆడని నేతలు బహు అరుదు అని చెప్పాలి. ముందుగా ముఖ్య నేతల సంగతి చూద్దాం. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి విషయం ముందుగా ఆలోచిద్దాం. ఆయన పక్కా సమైక్యవాది.అందులో ఎవరికి సందేహం ఉండనవసరం లేదు. కాని ఎక్కడా ఆ మాట బహిరంగంగా చెప్పరు. తెలంగాణను తాము అడ్డుకోబోమని, అంతా అదిష్టానం నిర్ణయం అని చెబుతారు.అయితే ఈ మధ్య కాలంలో ఒకసారి మాత్రం ధైర్యంగా రాజకీయాల కోసం తెలంగాణ ఇస్తారా అని ప్రశ్నించారు.అయితే కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు అనుకూలంగా తీర్మానం చేసినప్పుడు , రెండో ఎస్.ఆర్.సి.ని వేయడమే మార్గం అని మానిఫెస్టో లో రాసినప్పుడు కిరణ్ కాని మరెవ్వరూ కాని వ్యతిరేకించలేదు. మాజీ ముఖ్యమంత్రి,తెలుగుదేశం అదినేత చంద్రబాబు నాయుడు కూడా సమైక్యవాదే.కాకపోతే పరిస్థితుల కారణంగా, రాజకీయ అవసరాల కోసం తెలంగాణకు అనుకూలంగా తీర్మానం చేశారు.కేంద్రం తెలంగాణ ఇవ్వదనే ఆయన నమ్మారు కనుకే ఆ రకంగా తీర్మానం చేశారు. తీరా కేంద్రం తెలంగాణకు అనుకూలంగా ప్రకటన చేశాక రెండు కళ్ల సిద్దాంతంలో పడ్డారు.ఇటీవల తెలంగాణ విషయంలో ఒక అడుగు ముందుకు వేసి తాను తెలంగాణకు వ్యతిరేకం కాదని ప్రసంగాలు చేస్తున్నారు. కాని ఆయన పార్టీ సీమాంధ్ర నేతలు అనేకమంది సమైక్యవాదానికి అనుకూలంగా మాట్లాడుతుంటారు.నిజానికి మన రాష్ట్రానికి ముఖ్యమంత్రులుగా పనిచేసిన వారిలో ఒక్క చెన్నారెడ్డి మినహా మిగిలినవారంతా రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కోరుకున్నవారే . అయితే చెన్నారెడ్డి కూడా 1950,1960 దశకాలలో ఆయా సందర్భాలలో , ఉద్యమానికి నాయకత్వం వహించినప్పుడు ప్రత్యేకవాదిగా ఉన్నంతగా పదవిలో ఉన్నప్పుడు లేరని చెప్పాలి.ఉదాహరణకు ఆయన ముఖ్యమంత్రి అయ్యాక పలుమార్లు ప్రతిపక్ష నేతలు ఆయన వేర్పాటువాదం గురించి ప్రస్తావించేవారు. దానిని ఆయన ఖండించి ఎప్పుడూ అదే విషయం చెబుతారేమిటని ప్రశ్నించిన ఘట్టం కూడా శాసనసభ రికార్డులలో నిక్షిప్తం అయి ఉంది.చెన్నారెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్రాన్ని విభజించడానికి అసలు ప్రయత్నమే చేయలేదన్నది, అందుకు అనుగుణంగా తీర్మానం వైపు అడుగు వేయలేదన్నది నిజం. అది కూడా మిగిలినవారి మాదిరి ద్వంద విధానమే.తెలంగాణ ఉద్యమం తీవ్రంగా జరిగిన 1969లో ముఖ్యమంత్రిగా ఉన్న కాసు బ్రహ్మానందరెడ్డి మాత్రం ఎన్నడూ ప్రత్యేక రాష్ట్రానికి మద్దతు ఇవ్వలేదు. అలాగే తన భావాన్ని దాచుకుని పైకి ఒకటి, లోపల ఒకటి చేయలేదు. కాని ఇప్పుడు ముఖ్యమంత్రులు అయినా, ప్రతిపక్ష నేతలైనా లోపల ఎలాంటి భావం ఉన్నా తెలంగాణకు అనుకూలంగా మాట్లాడుతుంటారు.ఈ ధోరణి గత దశాబ్దంలోనే అదికంగా వచ్చిందని చెప్పాలి.దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి కూడా సమైక్యవాదే. కాని ఆయన ప్రత్యేక రాష్ట్రం డిమాండ్ తో ఆవిర్భవించిన టిఆర్ ఎస్ తో కలిసి ప్రభుత్వాన్ని నడపవలసి వచ్చింది. అందుకు అదిష్టానం ఆదేశం ఉండవచ్చు. అంతేకాదు. రెండువేల తొమ్మిది ఫిబ్రవరి పన్నెండో తేదీన శాసనసభలో వై.ఎస్.చేసిన ఒక ప్రకటన గుర్తుకు తెచ్చుకోండి.తెలంగాణకు తమ ప్రభుత్వం వ్యతిరేకం కాదని చెబుతూనే, ఆ తర్వాత వ్యాక్యాలన్నీ ఆచరణలో కష్ట సాధ్యమయ్యే విధంగా
ప్రకటన చేశారు. రాష్ట్రం ఏర్పాటుపై భాగస్వాములందరితోను చర్చలు జరపాలని నాటి మంత్రి రోశయ్య ఆధ్వర్యంలో కమిటీని వేస్తున్నట్లు ప్రకటించారు. ఆ కమిటీ ఏర్పడింది లేదు. పనిచేసింది లేదు. సరే .ఇతర పార్టీలు కూడా దానిపై అంత ఆసక్తి చూపలేదు. అది వేరే విషయం.ఇక రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అయితే పార్టీ అదిష్టానం తెలంగాణ తీర్మానం పెట్టమని ఆదేశించింది. కాని రోశయ్య తాను అంగీకరించలేదని అంటారు.పోనీ అలాగని సమైక్యవాదానికి అనుకూలంగా బహిరంగంగా ఎక్కడా చెప్పకుండా జాగ్రత్తగా ఉంటారు. పైగా వై.ఎస్.జగన్ మహబూబాబాద్ కు రైలులో వెళుతుంటే , పెద్ద హై డ్రామా సృష్టించి రైలుపై రాళ్లు వేసినవారిని కాకుండా , రైలులో ఉన్న జగన్ ను అరెస్టు చేసి వెనక్కి తీసుకువచ్చారు. రాష్ట్ర చరిత్రలో ఇదొక కీలక ఘట్టంగా కనిపిస్తుంది.ఇక కేంద్రంలో పాలన చేస్తున్న కాంగ్రెస్ పార్టీ కూడా ఇలాగే పిల్లిమొగ్గలు వేసి రాష్ట్రాన్ని ఈ స్థితికి తెచ్చింది.రెండువేల నాలుగులో ఎలాగైనా అదికారంలోకి రావాలన్న తాపత్రయంతో ఇప్పటి రాష్ట్రపతి , అప్పటి కాంగ్రెస్ ప్రముఖుడు అయిన ప్రణబ్ ముఖర్జీతో తెలివైన ఒక డ్రాఫ్ట్ తయారుచేసి మానిఫెస్టోలో పెట్టింది. దాని ప్రకారం తెలంగాణ, విదర్భ రాష్ట్రాల ఏర్పాటు కు అనుకూలంగా మొదటి లైన్ లో రాసి, రెండో లైన్ లో దేశ పరిస్థితుల రీత్యా రెండో ఎస్.ఆర్.సి పరిష్కారం అని చెప్పింది. పోనీ అదైనా చేసిందా అంటే అదీ చేయలేదు.ఏకంగా క్యాబినెట్ నిర్ణయంతో సంబంధం లేకుండా సోనియాగాంధీ ఇంటిలో భేటీ అయిన కాంగ్రెస్ కోర్ కమిటీ తెలంగాణ రాష్ట్ర్ర ప్రక్రియను ఆరంభిస్తున్నట్లు ప్రకటించింది. దీనికి ఇక్కడ రాజకీయ పార్టీలు తీర్మానం చేయడం కూడా దోహదపడి ఉండవచ్చు. ఆ తర్వాత ఇక్కడ రివర్స్ అయినట్లే కేంద్రంలో కూడా రివర్స్ చేశారు.ఇక బిజెపి కూడా గతంలో ఇదే రకంగా వ్యవహరించింది. ఒక ఓటు రెండు రాష్ట్రాలు అని చెప్పి, వేరే చోట మూడు రాష్ట్రాలు ఇచ్చి, తెలంగాణ గురించి అసలు పట్టించుకోలేదు.పైగా ఉప ప్రధాని హోదాలో ఉన్న అద్వాని అంతటి నేత హైదరాబాద్ రాజదాని ఉన్నచోట ప్రత్యేక డిమాండ్ ఏమిటని కొట్టి పారేశారు. ఇప్పుడేమో తెలుగుదేశం అడ్డుపడింది కనుక రాష్ట్రం ఇవ్వలేకపోయాం అని చెబుతుంది.ఒకప్పుడు సమైక్యవాదం కోసం పెద్ద ఎత్తున సీమాంధ్రలో ఉద్యమం చేసిన కమ్యూనిస్టు పార్టీ మాత్రం తన వైఖరిని అదికారికంగా మార్చుకుని కట్టుబడి ఉంది.అయితే సిపిఎం మాత్రం ఇప్పటికీ సమైక్య రాష్ట్ర సిద్దాంతంతోనే ఉన్నా, ఏదో ఒకటి తేల్చమని డిమాండ్ చేస్తోంది.కొత్త రాజకీయ పార్టీ వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ అద్యక్షుడు జగన్ కాంగ్రెస్ లో ఉన్నప్పుడు ఏకంగా సమైక్యవాద ప్లకార్డు పుచ్చుకున్నారు. ఆ తర్వాత సొంతంగా పార్టీ పెట్టుకున్నాక తెలంగాణ మనోభావాలను గౌరవిస్తామని, దీనిపై కేంద్రమే నిర్ణయం తీసుకోవాలని తీర్మానం చేశారు. తెలంగాణ రాష్ట్ర సమితి నేత కె.చంద్రశేఖరరావు ఒకప్పడు సమైక్యవాద పార్టీగా ఉన్న తెలుగుదేశం పార్టీలో అత్యంత క్రియాశీలకంగా ఉండేవారు.పైగా ప్రత్యేక ఉద్యమానికి మూలకారణమైన ప్రభుత్వ ఉద్యోగాలలో జోనల్ వ్యవస్థనే ఆయన వ్యతిరేకిస్తూ శాసనసభలో ప్రసంగించారు.ఆ తర్వాత ఆయన తన అబిప్రాయాన్ని మార్చుకుని తెలంగాణవాదానికి కట్టుబడ్డారు. కాకపోతే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుపై రకరకాల డెడ్ లైన్లు , జోస్యాలు చెప్పి జనాన్ని గందరగోళంలో పెట్టిన చరిత్ర ఆయనది.తెలంగాణ ఏర్పాటుకు అనుకూలంగా కాంగ్రెస్ లేదని కాంగ్రెస్ నేతలే చెబుతుంటే ఈయన మాత్రం ఢిల్లీలో ఉండి కాంగ్రెస్ తో చర్చలు జరిపానని అంతా అయిపోయిందని ప్రకటనలు చేస్తారు.తెలుగుదేశం నుంచి సస్పెండ్ అయి బలమైన ప్రత్యేకవాదిగా గుర్తింపు పొందిన నాగం జనార్ధనరెడ్డి శాసనసభలోనే రాష్ట్రం విడిపోతే హైదరాబాద్ లో మహబూబ్ నగర్ నుంచి వలస వచ్చినవారు ఎలాంటి కష్టాలు పడతారో ఉపన్యాసం చెప్పిన సందర్భం ఉంది. హరీశ్వర్ రెడ్డి వంటి వారైతే అసలు తెలంగాణ తీర్మానం జోలికి పోవద్దని చెబితే చంద్రబాబు వినలేదని అంటారు. తీరా చేశాక కట్టుబడి ఉండాలి కదా అన్నది అలాంటి కొందరి వాదం.ఇక మంత్రుల విషయానికి వస్తే వారిది అదే బాట. పైకి తెలంగాణవాదానికి కట్టుబడి ఉన్నామంటారు. అసలు తమకు తెలంగాణ తప్ప పదవులే అక్కర్లేదని అంటారు.కాని మంత్రి పదవులు వదులుకోవడానికి సిద్దపడరు.పైగా తాము రాజీనామా చేస్తే తెలంగాణ వస్తుందంటే రాజీనామా చేస్తామని అంటారు.అంటే రాదు కాబట్టే తాము పదవులలో కొనసాగుతున్నామని చెబుతున్నారనుకోవాలి. జానారెడ్డికాని, మరెవరిదైనా ఇదేమాట,ఇదే బాట. ఓట్ల రాజకీయంలో ఎవరూ ఎవరికి తీసిపోరు.ఈ నేపధ్యంలో కేంద్ర నేతలు ఎవరైనా తెలంగాణ గురించి వ్యతిరేకంగా మాట్లాడితే మాత్రం ఒక్కసారిగా విమర్శలు చేస్తుంటారు. కేంద్ర మంత్రి షిండే కాని, వాయలార్ రవి కాని, అజాద్ కాని తెలంగాణ రాష్ట్రం ఇప్పట్లే సాద్యం కాదని ప్రత్యక్షంగా చెబితే అలా ఎలా అంటారు. తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టారనో, ఇంకొకటనో ఈ నేతలు హడావుడి చేసి ఆ ప్రకటనలలో కొంత మార్పు ఉండేలా చేస్తుంటారు. అంటే వారెవరూ వాస్తవాలు చెప్పరాదన్నది వీరి అభిమతమా? పైగా వీరికి ఏమి తెలుసు, సోనియాగాంధీ అనుకూలం అని కూడా వీరు వాదిస్తుంటారు.వీరే కాదు. తెలంగాణలో కొందరు ఎమ్మెల్యేలు ఉన్నారు. వారు పైకి తెలంగాణవాదులు. లోపల మాత్రం అందుకు విరుద్దంగా వ్యవహరిస్తుంటారు.ఇలా ఒకరనేమిటి ? రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో డబుల్ గేమ్ ఆడని నేతలను టార్చ్ లైట్ పెట్టి వెతకవలసిందే. అందాక ఎందుకు ముఖ్యమంత్రిని మార్చవద్దని ఇరవై,ముప్పై మంది తెలంగాణ ఎమ్మెల్యేలు ఢిల్లీ వెళ్లి అదిష్టానానికి చెప్పారంటేనే పరిస్థితిని అర్దం చేసుకోవచ్చు. తెలంగాణపై తేల్చాలని అంటూనే ముఖ్యమంత్రికి మద్దతు ఇచ్చిన తీరులోనే రాజకీయం ఉంది.అదే సమయంలో సమైక్యవాదం పేరుతో హడావుడి చేసే కొంతమంది ఎమ్మెల్యేలు రాష్ట్రం విడిపోతే నష్టం లేదనేవారు కూడా ఉన్నారు. కాని వారు ఆ మాట పైకి చెప్పరు.ఎందుకంటే అక్కడ ఓట్లు పోతాయేమోనన్న భావన.తెలంగాణలో తెలంగాణవాదాన్ని , సీమాంధ్రలో సమైక్యవాదాన్ని ప్రబలేలా చేసింది నాయకులే. తెలంగాణ వస్తే మొత్తం స్వర్గం అయిపోతుందేమో అన్న భ్రమ కల్పించిది ఈ నేతలే. అన్నిటికి జిందా తిలస్మాత్ మాదిరి తెలంగాణనే వీరికి మందుగా చూపుతారు. అలాగే సమైక్య రాష్ట్రం విడిపోతే ఏదో కొంపలు మునిగిపోతాయని, సీమాంధ్ర తీవ్రంగా నష్టపోతుందని అనవసర ప్రచారం చేసింది, భయాలు సృష్టించింది నేతలే.ప్రత్యేక రాష్ట్రం ప్రకటన వచ్చాక వారంతా కలిసి ఎలాంటి ఉద్యమాన్ని సృష్టించారో వారికి బాగానే తెలుసు.తెలంగాణ వైపు కాని, సీమాంధ్ర వైపు కాని ప్రజల ప్రయోజనాల కన్నా నాయకుల సొంత ప్రయోజనాలే అంటే ఓట్ల రాజకీయాలే నాయకులకు ముఖ్యం.మొత్తం మీద డిల్లీ నుంచి గల్లీదాక ఈ డబుల్ టంగ్ తోనే రాజకీయ నాయకులు ఆత్మవంచన చేసుకుంటూ ప్రజలను వంచిస్తూ కాలం గడిపేస్తున్నారు.అదే వారి గొప్పదనం. ప్రజలు కూడా ఇలాంటి వంచనకు అలవాటుపడడమే విషాదం.