సోనియా ప్రసంగంలో ఆత్మరక్షణ ధోరణి

సోనియా ప్రసంగంలో ఆత్మరక్షణ ధోరణి

ఎఐసిసి అదినేత్రి సోనియాగాందీ మొత్తం మీద ఆత్మరక్షణలో పడ్డట్లే కనిపిస్తోంది. ఆమె డిల్లీలో చేసిన ఉపన్యాసాన్ని గమనిస్తే అవినీతి గురించి ప్రస్తావించారు తప్ప, తన అల్లుడుమీద, స్వయంగా తమ మీద వచ్చిన ఆరోపణలను నేరుగా సమాధానం ఇచ్చినట్లు కనబడదు.అయితే అదే సమయంలో నీతి బోధలు చేయడం విశేషం. సమాజానికి అవినీతి రాచపుండు వంటిదని, దానిని తుదముట్టించేందుకు అందరూ కలిసి పోరాడాల్సి ఉందన్నారు.
ప్రజాస్వామ్య వ్యవస్థలను ప్రతిపక్షాలను నిర్వీర్యం చేసే విధంగా వ్యవహరిస్తున్నాయని, పీకల్లోతు అవినీతిలో కూరుకుపోయిన వారే దాని గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. తమపై వచ్చిన అవినీతి ఆరోపణలను సమర్థవంతంగా ఎదుర్కొంటామన్నారు. అవినీతి ఆరోపణలు రుజువైతే ఎవరినైనా వదిలే ప్రసక్తి లేదన్నారు. నిందలు వేసే వారికి అభివృద్ధితోనే తాము గట్టి సమాధానం చెబుతామన్నారు.ఎంతసేపు ఆమె తమపై వచ్చిన ఆరోపణలను ఎదుర్కుంటామని, అలాగే అవినీతి చేసినవారే ఆరోపణలు చేస్తున్నారని అన్నారే తప్ప, తమపై వచ్చిన తొంభై కోట్ల ఆరోపణకుగాని, ట్రస్టును కొనుగోలు చేయడంపైకాని,డి.ఎల్.ఎఫ్ .తో తన అల్లుడు వద్రా లావాదేవీలు గురించి కాని ఎక్కడా వివరణ ఇచ్చినట్లు కనబడదు.కేవలం ఎదురుదాడితోనే ప్రజలలో తమకు సానుకూలత తెచ్చుకోవాలని ఆమె ప్రయత్నిస్తున్నట్లుగా ఉంది.అయితే అవినీతిని కాన్సర్ తో పోల్చి దానిపై పోరాడతామని ఆమె అనడం విశేషం.ఢిల్లీ రామ్ లీల మైదానంలో జరిగిన ఈ సభలో ఆత్మరక్షణ ధోరణిలో సోనియాగాందీ మాట్లాడారని చెప్పవచ్చు.