నీ జనం గొంతెండుతుంది జాగర్త!

 నీ జనం గొంతెండుతుంది జాగర్త!

తమిళ రాష్ట్రంలో కూడా  రెండు ముక్కలు చేయాలనే డిమాండ్‌ చాలా కాలం నుంచి ఉంది. కానీ ఆ విషయాన్ని కేంద్ర మంత్రి చిదంబరం దగ్గర ప్రస్తావించామంటే.. మాత్రం ఆయన ఇంతెత్తున ఎగిరి పడతారు. ‘మీకు తమిళ చరిత్ర తెలుసా? సంస్కృతి తెలుసా?' అంటూ తన పురాణం విప్పుతారు. అక్కడికేదో తెలుగుజాతి మాత్రం చరిత్ర, సంస్కృతి లేని ఏబ్రాసీ జాతి అయినట్లుగా ఆయన విభజించడానికి ఇక్కడ మహోత్సాహం చూపిస్తారు. ఇదంతా ఒక ఎత్తు. అయితే తెలంగాణ జేఏసీ నాయకులు డిమాండ్‌ చేస్తున్న కోరికలను యథాతథంగా  ఆమోదించేట్లయితే.. తన రాష్ట్రానికి చెందిన మదరాసీ తమిళ జనం గొంతెండిపోవడం తథ్యం అని చిదంబరం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.  తెలంగాణ జేఏసీ విభజన విధివిధానాలకు సంబంధించి కేంద్రంలోని మంత్రుల కమిటీకి ఒక నివేదికను పంపింది. అందులో కృష్ణ గోదావరి నదుల మిగులు జలాలపై హక్కులు కూడా పూర్తిగా తమకే ఉండేలా నిర్దేశించాలంటూ కూడా ఒక పాయింటు జత చేశారు. నిజానికి కేంద్ర జలసంఘం కేటాయింపులు లేని ప్రాజెక్టులకు చుక్క నీరు కూడా కేటాయించరాదంటూ.. ఒక నిబంధన కూడా అందులో జత చేశారు.  సీమాంధ్ర ప్రాంతంలో కేవలం మిగులు జలాలను నమ్ముకుని నిర్మాణం అవుతున్న ప్రాజెక్టులు, వాటికింద కొత్తగా సేద్యంలోకి వస్తాయని అనుకుంటున్న భూములు లక్షల ఎకరాలు ఉన్నాయి. ఇప్పుడు కేటాయింపులు లేని ప్రాజెక్టులకు చుక్కనీరు వదలకూడదనే అంశం మీద మంత్రుల కమిటీ గుడ్డిగా తల ఊపేసిందంటే గనుక.. ఆ ప్రాంతమంతా ఎప్పటిలా క్షామం తాండవిస్తుందే తప్ప మరొకటి కాదు. అదే సమయంలో.. తమిళనాడు రాజధాని మద్రాసు నగరానికి తాగునీరు అందించే తెలుగుగంగ ప్రాజెక్టు కూడా కేటాయింపులు లేని వాటి కిందికే వస్తుంది. చిదంబరం ఈ రాష్ట్రంలోల చిచ్చు పెట్టేద్దామని తె'జేఏసీ డిమాండ్లకు సై అన్నారంటే.. అక్కడ ముందుగా తక్షణ నష్టం వాటిల్లేది ఆయన తమిల తంబీలకే! మద్రాసుకు తెలుగుగంగ ప్రాజెక్టు ద్వారా చుక్క నీరు వెళ్లడం కూడా సాధ్యం కాదు.  కాబట్టి.. తెలుగు రాష్ట్రంలో చిచ్చు పెట్టాలనే కోరిక ఒకవేళ ఎంత బలంగా ఉన్నప్పటికీ.. చిదంబరం తన సొంత అరవవాళ్ల ప్రయోజనాల్ని కూడా దృష్టిలో పెట్టుకుని.. నీటి కేటాయింపుల్లో సమంజసమైన విధివిధానాలు రూపొందించేలా మంత్రుల కమిటీకి మార్గదర్శనం చేయాల్సి ఉంటుంది.