నా పై కుట్రపన్నారు.. పవన్ కల్యాణ్..

నా పై కుట్రపన్నారు..  పవన్ కల్యాణ్..

'అత్తారింటికి దారేది సినిమాకు జరిగింది పైరసీ కాదు ... కుట్ర ... ఆ కుట్రదారులెవరో నాకు తెలుసు ... వాళ్ల తాట తీస్తా' అంటూ పవన్ కల్యాణ్ నిన్న రాత్రి 'థ్యాంక్యూ' వేడుకలో చేసిన హెచ్చరిక టాలీవుడ్‌లో సంచలనం రేపి, ప్రకంపనలు సృష్టిస్తోంది. స్వయంగా పవన్ కల్యాణే సభాముఖంగా ఇలా హెచ్చరించడంతో, ఇదిప్పుడు 'టాకాఫ్ ది ఇండస్ట్రీ' అయింది. అసలు ఇలా హెచ్చరించడం కోసమే పవన్ ఈ వేడుకకు హాజరైనట్టు కూడా చెబుతున్నారు!

'అత్తారింటికి దారేది' చిత్రాన్ని 3 సంవత్సరాలపాటు త్రివిక్రమ్‌ కష్టపడ్డారు. ఎంతోమంది టెక్నీషియన్స్‌ పనిచేశారు. వారి కష్టాన్ని పైరసీ రూపంలో దోచేశారు. ఇది పైరసీ కాదు. కాన్స్‌ప్రసీ. కంచే చేను మేసినట్లుగా.. తెలిసినవాళ్ళే నమ్మకద్రోహం చేశారు. నిజంగా పైరసీ చేయాలనుకున్నవారు 50రోజుల వరకు తమ గుప్పెట్లో పెట్టుకోరు. ఎవరిచెబితే పైరసీ చేశారో.. మమ్మల్ని దెబ్బకొట్టాలని చూశారో.. వారిని సభాముఖంగా హెచ్చరిస్తున్నాను. ఏ స్థాయిలో ఉన్నవారినైనా... ఎలాంటి న్యాయం జరగాలో అది చూపిస్తాను. విజయం వచ్చిందని మర్చిపోను. రాబోయేకాలంలో వారి పేరును గుర్తుపెట్టుకుంటాను. ఎవర్నీ వదిలేదులేదు. ప్రేమిస్తాం.. భరిస్తాం.. అవసరమైతే 'తాటతీస్తాం' అంటూ పవన్‌ కళ్యాణ్‌ అభిమానుల కోలాహలంమధ్య హెచ్చరించారు.

అత్తారింటికి దారేది చిత్రం విజయాన్ని చేకూర్చిన ప్రేక్షకులకు, అభిమానులకు పవన్‌ స్వయంగా థ్యాంక్స్‌ ప్రెస్‌మీట్‌ ఏర్పాటు చేయించారు. సోమవారం రాత్రి హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో జరిగింది. అయితే ఎప్పుడూ పెద్దగా మాట్లాడనని పవన్‌ కళ్యాణ్‌ ఈరోజు చాలాసేపు మాట్లాడారు.... కేవలం మాట్లాడాలనే ఈ ఫంక్షన్‌ ఏర్పాటు చేశాను అన్నారు.

అత్తయ్య అంటే చులకనగా చూపించేవారు : పవన్‌ 
అత్తయ్య అంటే మన సినిమాల్లో చులకనగా చూపించేవారు. చాలా సినిమాలు వచ్చాయి. అత్తయ్య అంటే ఎలా ఉండాలి? స్త్రీని గౌరవించాలి. అప్పుడే దేశం గౌరవించబడుతుంది. నాకూ కొన్ని సిద్దాంతాలున్నాయి. వాటినిబట్టి నడచుకుంటూ పోతుంటాను. పైరసీ నిందితులు ఎవ్వరినీ మర్చిపోను. కానీ పరిస్థితులు, సమాజం పట్ల గౌరవం, దేశభక్తితో మాట నోరు జారడంలేదు. ఇది నిగ్రహం కాదు. చేతకానితనం కాదు. 365 రోజులు మేమే ఉండాలని గానీ మా సినిమాలే ఆడాలని మేం కోరుకోం. అలాంటి తక్కుస్థాయి ఆలోచనలు మాకులేవు. అందరూ బాగుండాలని కోరుకుంటాను అన్నారు.

అరెకరం పొలం రైతు అవ్వాలనుకున్నా: పవన్‌కళ్యాణ్‌ 
చిన్నప్పటి నుంచి నటుడు అవ్వాలనుకోలేదు. నాన్నగారు గవర్నమెంట్‌ ఎంప్లాయ్‌. పెద్దగా చదువుకోలేదు. అందుకే... అరెకరం పొలం దొరికితే మొక్కలేసుకుని హాయిగా బతికేయచ్చనుకేవాడ్ని. కానీ విధి నన్ను నటుడ్ని చేసింది. ఇప్పటికీ రైతుగా బతకాలనే కోరుకుంటున్నాను. మొదటి సినిమా ఏదో అలా చేసేశాను. తరువాత 'గోకులంలోసీత' నాకు బాగా నచ్చింది. నా చాయిస్‌తో చేసిన సినిమా 'తొలిప్రేమ'. అందులో అన్నీ కుటుంబ సంబంధాలున్నాయి.. మళ్ళీ అలాంటి సినిమా చేయాలని అత్తారింటికి దారేది.. కథను త్రివిక్రమ్‌ చెప్పారు. చేశాను. ఆశీర్వదించారు అన్నారు.

నా ఆత్మ త్రివిక్రమ్ ‌: పవన్‌
త్రివిక్రమ్‌ భావజాలం నాది ఒకేరంగా ఉంటుంది. సినిమాకథ చెప్పడానికి వచ్చేవాడు. ఎందుకనో ఆయన చెబుతుండేవాడు.. నాకు నిద్రొచ్చేది ఎవ్వరూ చెప్పినా రానిది త్రివిక్రమ్‌ చెప్పగానే వచ్చేసింది. ఎన్నోసార్లు పట్టువదలని విక్రమార్కునిగా నా వెంట తిరిగాడు. 'జల్సా' సినిమా చేశాడు. మా ఇద్దరి మధ్య సర్దుకుపోయే తత్వం ఉంది. కుదిరినంతవరకు సర్దుకుపోతాం. లేదంటే ఎవరూ ఊహించని విధంగా ఎదురుతిరుగుతాం. మానవ సంబంధాలు సమాజం అంటే గౌరవం ఉంది.. బంధుత్వాల మీద గౌరవం ఉంది... సినిమా చేయడం సక్సెస్‌మీట్లు పెట్టుకోవడం నాకు ఇష్టం లేదు. ఖుషి తర్వాత అందరికీ నచ్చే సినిమా రాలేదు. అయినప్పటికీ నాపై ప్రేమ చూపించారు. అదే నన్ను ఇన్ని సినిమాలు చేసేలా చేసింది అన్నారు. 

ఇంకా పైరసీని కంట్రోల్‌చేసిన పోలీస్‌డిపార్ట్‌మెంట్‌కూ, పైరసీ సెల్‌ అధికారులకూ కృతజ్ఞతలు తెలియజేశారు. చిత్రంలో నటించిన ప్రతి ఒక్కనటుడ్ని..పేరు పేరునా.... ధన్యవాదాలు తెలిపారు.

పవనిజం అంటే ఏమిటి?
ఇదే అర్థాన్ని అభిమానులు పవన్‌ను అడిగారు.... దానికి అర్థం ఏమిటంటే... అంటూ.... సమాజం కోసం, దేశం కోసం బ్రతకడమే పవనిజం అని నా భావన అన్నారు. ఖుషి తర్వాత 10ఏళ్ళు అలాంటి దానికోసం చూశాను. నాకు కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి... ఎన్నో ఇబ్బందులను భరించాను. ప్రతి చిన్నవిషయానికి వణికిపోయే తత్వంకాదు నాది. నాకూ స్పూర్తినిచ్చేది దేవరకొండ బాలగంగాధర్‌ తిలక్‌. కవితల్ని రిపీట్‌ చేసుకుని చదివేస్తుంటాను. ''చిమ్మచీకటి.. సరిగ్గా కనబడదు. రోడ్డంతా రాళ్లు, దారి కన్పించదు. చెప్పులు లేవు. అయినా నడవాలి.... మొక్కవోని ధైర్యంతో ముందుకు సాగు.'' అంటూ తిలక్‌ చెప్పిన కవితలోని పదాలను పదేపదే గుర్తుచేసుకుంటాను. ఆ ధైర్యంతో నన్ను బతికించేస్తుంది అన్నారు.

జైహింద్‌ అంటే?
నేను ఎక్కడ మాట్లాడినా... జైహింద్‌ ..అంటూ ఉంటాను. అలా ఎందుకు అంటున్నారని చాలామంది అడిగారు. మీరు అడుగుతున్నారు... నా దేశం పట్ల.. మన నేలపట్ల నాకున్నప్రేమే జైహింద్‌.. ఈ నేలమీద పుట్టాను. ఈ నేలమీద పెరిగాను. అందుకు కృతజ్ఞతలుగా చెబుతాను.. మీరూ చెప్పండి.. అంటూ అభిమానులచేత చెప్పించారు.