CM Kiran Kumar Reddy against Congress opinions, Kiran in Dual roles, Aparichithudu

CM Kiran Kumar Reddy against Congress opinions, Kiran in Dual roles,  Aparichithudu

ఈ అపరిచితుడు ఎవరివాడు

సినిమాలలో హీరోలో హీరోయిన్లో ద్విపాత్రాభినయం చేస్తుంటే ప్రేక్షకులు చాలా ముచ్చటగా చూస్తారు. గత ఐదు నెలలుగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆ హీరోలకి ఏమాత్రం తీసిపోని రీతిలో ఒక కాంగ్రెస్ నేతగా, తిరుగుబాటు నేతగా ఎంతో గొప్పగా ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఈ రాష్ట్ర విభజన సస్పెన్స్ సీరియల్ మొదలయిన నాటి నుండి తిరుగుబాటుదారుడుగా పాత్రను పోషిస్తున్న ఆయన దానిని చాలా చక్కగా రక్తి కట్టించారు. ఆయనలో తెలంగాణా నేతలు, ప్రజలు ఒక గొప్ప విలన్నిచూస్తే, సీమాంధ్ర ప్రజలు ఆయనలో ఒక గొప్ప హీరోని చూసారు. అంటే ఆయన చేస్తున్న డబుల్ రోల్ కి అదనంగా ఇది డబుల్ షేడ్స్ ఉన్నఅపరిచితుడి పాత్ర వంటిదన్నమాట. అదే సమయంలో కాంగ్రెస్ అధిష్టానం "ఆయన విలన్ కాదు, విధేయుడే" అని పనిగట్టుకొని ప్రచారం మొదలుపెట్టేసరికి సీమాంధ్ర ప్రజలు కూడా "ఇంతకీ ఆయన హీరోనా లేక విలనా?" అనే డైలెమాలో పడ్డారంటే ఆయన తన పాత్రను ఎంత బాగా రక్తి కట్టించారో అర్ధం చేసుకోవచ్చును.

ఈ హై సస్పెన్స్ సీరియల్ దాదాపు క్లైమాక్స్ కి వచ్చేవరకు ఆయన రెండు షేడ్స్ ఉన్నఅపరిచితుడి పాత్రలో పూర్తిగా ఒదిగిపోతూ రెండు ప్రాంతాల ప్రజలు, నేతల నుండి ఏదో రూపంలో శభాషీలు అందుకొంటున్నారు. అయితే మధ్య మధ్యలో డిల్లీ వెళ్ళి వస్తూ కాంగ్రెస్ వాది పాత్ర కూడా పోషిస్తున్నప్పటికీ, ఈ అపరిచితుడి పాత్రనే ఎక్కువ హైలైట్ అయింది.

ఇక సీరియల్లో క్లైమాక్స్ సన్నివేశం దగ్గిరపడుతున్న కొద్దీ, అసలు సిసలయిన కాంగ్రెస్ వాది పాత్ర కూడా తెరమీదకి వచ్చేసింది. గత ఐదు నెలలుగా ఆయనలోని కాంగ్రెస్ వాది, ప్రజల కోసం తిరుగుబాటు చేస్తున్నముఖ్యమంత్రి పాత్రలు చాలా మానసిక సంఘర్షణ అనుభవించినట్లు ఆయన నిండు శాసనసభలో చాలా బాధపడుతూ చెప్పినప్పుడు అందరి కళ్ళు చమర్చాయిట!

ఆయన కాంగ్రెస్ విధేయుడని దిగ్విజయ్ సింగ్, గులాం నబీ ఆజాద్, చాకోవంటి వారు మొదటి నుండి ఎంత మొత్తుకొంటున్నా పట్టించుకోని జనాలు, నిన్నఆయన స్వయంగా పార్టీ రాజ్యసభ అభ్యర్ధులను వెంటబెట్టుకొని వెళ్లి వారిచేత దగ్గిరుండి నామినేషన్లు వేయించిన తరువాత ఇక నమ్మక తప్పలేదు. మహా మహా నటులు సైతం ఆయనలా ఒకే సమయంలో ఒక కంట కన్నీరు(పార్టీ కోసం), మరో కంట (పార్టీపై) ఆగ్రహం ప్రదర్శించలేరంటే అతిశయోక్తి కాదు.

టీ-కాంగ్రెస్ నేతలు, బొత్ససత్యనారాయణ, చిరంజీవి వంటివారు ఇంతకాలంగా అధిష్టానానికి ఒట్టి చెక్క భజన తప్ప మరేమీ చేయలేదు. కానీ పార్టీకి విధేయుడయిన కిరణ్ కుమార్ రెడ్డి, తిరుగుబాటుదారుడనే ముద్ర వల్ల తీరని మనోవేదన అనుభవిస్తూనే అధిష్టానం కోసం, అధిష్టానం చూపించిన రాజ్యసభ సభ్యులను దగ్గరుండి గెలిపించుకొనే ప్రయత్నం చేస్తున్నారు. ఈ రెండు పాత్రల మధ్య జరిగే మానసిక సంఘర్షణలో ఆయన మనసు ఎంతగా కుమిలిపోతోందో కేవలం ఆయనకీ, అధిష్టానానికే తెలుసు.

అలాగని ఆయన తను పోషిస్తున్న అపరిచితుడు పాత్రకు క్లైమాక్స్ సీన్లో కూడా అన్యాయం చేయాలని అనుకోలేదు. అందుకే, ఆయన లోపభూయిష్టమయిన తెలంగాణా బిల్లుకి వ్యతిరేఖంగా తీర్మానం చేసి, దానిని సభలో ఓడించి, వెనక్కి త్రిప్పి పంపేయాలని కమిటయిపోయారు. బిల్లుపై చర్చించడానికి మరో మూడు వారాలు సమయం కావాలని రాష్ట్రపతికి లేఖ వ్రాయడమే కాక, ఆయనకు హోంశాఖ పంపినది ‘నిజమయిన ఒరిజినల్ బిల్లు' కాదని, అది కేవలం ముసాయిదా బిల్లు మాత్రమేనని, హోంశాఖ రాష్ట్ర శాసనసభను, కేంద్రాన్ని, చివరికి రాష్ట్రపతిని కూడా మోసం చేసిందని చాలా అవేశపడిపోయారు. ‘లా ఒక్కింతయూ తెలియని జైరాం రమేష్ వంటి కేంద్రం మంత్రుల బృందంలో సభ్యులు "ముసాయిదా బిల్లునే అసలయిన బిల్లని కూడా పిలుస్తారని, దీనిలో ఒరిజినల్, డూప్లికేట్ అని వేరేగా ఉండవని" అవాకులు చవాకులు వాగడంతో కిరణ్ కుమార్ రెడ్డి ఈసారి తన మూడో కన్నుకూడా తెరిచేసి, "సరే! మాకు పంపిన బిల్లునే పార్లమెంటులో ప్రవేశపెట్టి చూపండి! నేను రాజకీయ సన్యాసం చేస్తానని" బిల్ మే సవాల్ విసిరారు.

ఇక రేపటితో ఈ మెగా సస్పెన్స్ సీరియల్లో ఆంధ్రా అధ్యాయం పూర్తయి డిల్లీ అధ్యాయం మొదలవుతుంది. కనుక, పార్టీకి వ్యతిరేఖంగా మాట్లాడుతున్నదుకు మనసులో ఎంతగా కుమిలిపోతున్నా, రేపటి నుండి పూర్తిగా తిరుగుబాటుదారుడి పాత్రనే పోషించవచ్చును. చాలా బాధ కలుగుతోంది. చాలా బాధ కలుగుతోంది. అయినా తప్పదు. ప్రజల కోసం, భవిష్యత్ కోసం భరించక తప్పదు.