Manam Movie Notes

Manam Movie Notes

తీరని కోరికలు. దిద్దుకోలేని తప్పులు. అసంపూర్ణమైన ప్రేమలు జన్మజన్మాలకూ సాగుతాయనేది ఒక నమ్మకం. ఆ తప్పుల్ని దిద్దుకోవడానికి, ప్రేమల్ని పొందడానికి, కోరికల్ని పరిపూర్ణం చేసుకోవడానికీ మనిషి మళ్ళీ మళ్ళీ జన్మిస్తాడనేది ఒక ఊహ. ఆ నమ్మకానికి ఊహని కలిపి ఆసక్తికరమైన కథగా మారితే "మనం".

నాగార్జున-శ్రియ రెండు జన్మల్లో ఒక జంట. నాగచైతన్య-సమంత ఒక జంట మరో రెండు జన్మల్లో. ఆ ఇధ్దరి జంటలలో ఒకరికి డైరెక్టుగా, మరొకరికి ఇండైరెక్టుగా లంకె ఉన్న మరో పాత్రలో ఏఎన్నార్ గారు. ఏ జంట ఎందుకు పునర్జన్మ ఎత్తింది . ఎవరు తమ తప్పుని సరిదిధ్దుకోవాలని ఈ జన్మలోని పాత్రల్ని కలపాలనుకున్నారు. ఎవరు కనీసం ఈ జన్మలోనైనా ఆ జంటను కలపాలనుకున్నారు అనేవి తెరమీద చూడాల్సిన విషయాలు.

పైన చెప్పిన కథ తికమకగా ఉంది అనుకుంటే, సినిమా మాత్రం అందరికీ అర్థమయ్యేలా ఉండటానికి ముఖ్యకారణం కథనం. ఎటువంటి కలగాపులగం లేకుండా అరటిపడువలిచినట్టు ఉంటుంది. కాకపోతే అది చాలా నిదానంగా, నింపాదిగా ఉంటుంది. అందంగా, ఆహ్లాదంగా నడుస్తుంది. ఆ కారణంగా సినిమా కొంత మందగించిన ఫీలింగ్ మనకు కలుగుతుంది.

తికమక కథని సాఫీగా చెప్పిన ఘనత దర్శకుడు విక్రంకు చెందిదే, మామూలు మాటల్లాంటి చెళుకుల్ని సంభాషణలుగా రాసిన Harsha Vardhan అభినందనీయుడు. సినిమాని అందంగా ఆహ్లాదకరంగా మలిచింది మాత్రం పి.ఎస్.వినోద్ సినెమాటోగ్రఫి, అనూప్ రూబెన్స్ సంగీతం. అనూప్ రూబెన్స్ సంగీతం పాటల్లోకన్నా, నేపధ్యసంగీతంలో బాగుంది.

ప్రధమార్థంలో పోసానికృష్ణమురళి సీన్, బ్రహ్మానందం కామెడీ పొసగకపోతే, ద్వితీయార్థంలో ఆలి పాత్ర పెధ్ధగా ఇంపాక్ట్ ని చూపించలేకపోయింది. ఉన్నంతలో నెల్లూరు గిరి బాగ చేశాడు.

ముఖ్యతారాగణం తీసుకుంటే ముందుగా చెప్పల్సింది ఏఎన్నార్ గురించి. ఆఖరిచిత్రం అనే సెంటిమెంటు, ఆయన బ్రాండ్ నటనతో బాగుంది. ఈ సినిమాలో అత్యంత భిన్నమైన షేడ్స్ ఉన్న పాత్ర నాగార్జున పోషించిన నాగేశ్వర్ పాత్ర. నాగార్జున చాలా ఈజ్ తో చేశారనే చెప్పాలి. నాగచైతన్య యూత్ ఫుల్ రోల్ కంటే పెళ్ళైన యువకుడిగా బాగా నప్పాడు. శ్రియ-సమంతలకు నటనకు ఆస్కారం ఉన్న పాత్రలు దక్కాయి. వాళ్ళు న్యాయం చేశారు.

కథాకథన వైవిధ్యాలు, నిర్మాణవిలువల ఉన్నతంగా ఉన్నప్పటికీ నెమ్మదించిన గమనం, పొసగని కామెడీ, హడావిడిగా చేసిన ముగింపుల మధ్య ఎమోషనల్ డెప్త్ లేని సినిమాగా "మనం" మిగిలింది. బలమైన భావోద్వేగాలకు ఆస్కారం ఉన్న కథని సాఫీగా,ఆహ్లాదకరంగా చెప్పడానికి చేసిన ప్రయత్నంలో ప్రేక్షకుల హృదయాల్ని సూటిగా తాకే అవకాశాన్ని ఈ సినిమా కోల్పోయింది.

ఏఎన్నార్ గారి ఆఖరి సినిమా అనే విషయం మన మస్తిష్క నేపధ్యంలో ఉంటుంది కాబట్టి, అక్కినేని ఫ్యామిలీ నుంచీ వస్తున్న నవతరం హీరో అఖిల్ ఈ సినిమాతో తెరకు పరిచయం అవుతున్నాడు కాబట్టి ఉండే సినిమాకు సంబంధంలేని ఎమోషన్స్, సెంటిమెంట్స్ కారణంగా ఎక్కువ ప్రేక్షక ఆదరణ పొందగలిగే సినిమా ఇది. కేవలం సినిమాగా చూస్తే ఒక మంచి ప్రయత్నం. కొన్ని కారణాలవల్ల చరిత్రలో మిగిలిపోయే సినిమాగా మారింది.