Sindhu Sakshi Shine - Real Facts how you can cash their hardwork

Sindhu Sakshi Shine - Real Facts how you can cash their hardwork

పి వీ సింధు నీకు జోహార్లు!! ..

ఈ  పేరు  తెలియని  వాళ్లు తెలుగు  రాష్ట్రాల్లోనే  కాదు  యావద్భారత  దేశం  లోనే  లేరు. ఆమె  సాధించిన  విజయం  మన  భారత  దేశ చరిత్ర  లోనే  చిర స్థాయిగా  నిలిచిపోతుంది. ఈ  విజయం  వెనక  ఎన్నో  ఏళ్ళ  కృషి, పట్టుదల  మరియు  ఎన్నో  త్యాగాలు  కలిసి  ఉన్నాయంటే  అతిశయోక్తి  కాదు.
ఈ  విజయం  ఆమె  సాధించడానికి  ఆమె  తల్లిదండ్రులైన P. V. రమణ మరియు విజయలక్ష్మి  దంపతుల  సహాయ సహకారాలు నిజంగా మెచ్చుకోదగ్గవి. ఒక  చిన్న  పిల్లాడు పెరిగి  పెద్దయ్యే  క్రమం  లో  నేటి  తల్లి  తండ్రులు  కేవలం  చదివించి  వారి  కాళ్ళ  మీద  వారు  నిలబడేలా  చెయ్యడానికే  నానా కష్టాలు  పడిపోతున్నారు.
పైగా  భార్యా భర్తలిరువురూ  ఉద్యోగం  చేసే  క్రమం  లో  నేటి  ఆధునిక  సమాజపు  పిల్లలు  ఎక్కువగా  క్రెచ్  ల  లోను  లేదా  స్కూల్ లోనే  ఎక్కువ  సమయం  గడుపుతున్నారు.
వారికోసమే సంపాదిస్తున్నాం  అంటూనే  వారికోసం  సమయం  కేటాయించలేక  సతమతమైపోతున్నారు.
అటువంటి సమయం  లో  శ్రీ  రమణ  మరియు  శ్రీమతి  విజయలక్ష్మి దంపతులు  తమ   కూతురిని  ఈ  స్థాయికి  తీసుకురావడానికి  ఎన్ని  వ్యయ  ప్రయాసలకోర్చెరో  అర్ధం  చేసుకోగలం.
ఈనాటి  సింధు  విజయానికి  ఆమెకి  వ్యక్తిగతం  గా  ఎన్ని  అభినందనలు  తెలియజెయ్యాలో  అంతకన్నా  ఎక్కువ  వారి  తల్లిదండ్రులను  అభినందించ వలసిన  అవసరం  ఎంతైనా  ఉంది.
ఇక  ఆమె  గురువు  పుల్లెల్ల  గోపీచంద్  గారి  మాటకొస్తే, ఆయన  కృషి  మరింత అనన్యసామాన్యం.   ఆమెను ఒక  బాడ్మింటన్ ప్లేయర్ గా ప్రపంచం  లోనే  రెండవ  అత్యున్నత  స్థాయిలో  నిలబెట్టడానికి  అవసరమైన  మెళకువలు  నేర్పి  తమ  వంతు  బాధ్యతని  చాలా అద్భుతం  గా  నెరవేర్చారు. వారి కృషి యొక్క ఫలితమే ఈరోజు సింధు సాధించిన  పతకం.
వీరందరి సమిష్టి కృషి  ఈరోజు భారతదేశానికి ఒలింపిక్స్  లో  ఒక  పతాకాన్ని సాధించిపెట్టింది. వీరికి ఆనందోత్సాహాలతో స్వాగతాలు పలికి ఘన సన్మానాలు  చెయ్యవలిసిన అవసరం తప్పక ఉంది. భారతీయ సంప్రదాయం ప్రకారం ఎవరి ప్రతిభా పాటవాలైన రాణించినప్పుడు వారిని గౌరవించడం అత్యద్భుతమైన ఒక ప్రక్రియ.
ఇలాంటి స్వాగత సత్కార కార్యక్రమాలు చేపట్టిన భారత ప్రభుత్వ ప్రముఖులకు అభినందనలు.
ఇలాంటి ఒక సందర్భాన్ని చూసి మన దేశం లో మరింత మంది యువ క్రీడాకారులు ఉత్సాహం గా రక రకాల క్రీడలలో పాల్గొనే ఆసక్తికనబరిచే అవకాశాలు చాలా ఉన్నాయి. వచ్చే ఒలింపిక్స్ నాటికి భారత దేశం లో ఇంకెంత మందిక్రీడాకారులు పాలు పంచుకుంటారో అనే ఆసక్తి ప్రజలలో కూడా కనిపిస్తోంది.
వీటన్నికి ముందు మనం ఎంతో నిశితం గా పరిశీలించవలసిన విషయాలు ఎన్నో ఉన్నాయి.
భారత దేశ జనాభా దాదాపు 1.27బిలియన్లు.
అంత మంది ఉన్న మన జనాభాలో మరెంతమంది ప్రతిభ పాటవాలు గల ఔత్సాహికులైన క్రీడాకారులున్నారో ఊహించగలరా?
మరి వారికి తగ్గ సదుపాయాలు, అసలు క్రీడలలో ఆసక్తి చూపించే ప్రోత్సాహకాలు భారత దేశం లో ఉన్నాయా?
ఒక క్రీడ లో గానీ, కళ లో గానీ, వేరే ఏ రంగం లో నైనా అభివృద్ధి చెందాలంటే కృషి, పట్టుదల మాత్రమే కదండీ.. దానికి తగ్గ సదుపాయాలు అవకాశాలు ఎన్నో కావాలి.
మరి భారత దేశం లో ఎన్ని పల్లెలు, పట్టణాలు మరియు నగరాల్లోక్రీడలకు సంబంధించిన సదుపాయాలు  ఉన్నాయి?
ఆ క్రీడలకు సంబంధించిన శిక్షకులు ఎంతమంది ఉన్నారు?
మనదేశం లో విద్యారంగానికి పెద్ద పీట వేసేరు. అందరికి తెలిసినదే. కానీ ఆ చదువు మాత్రం సవ్యం గా జరుగుతోందా?
అంతా మార్కుల వెనక పరుగులే అని నేటి విద్యార్థులను చూస్తే ఇట్టే తెలిసిపోతుంది.
ఇలా మార్కుల వెనక పరుగులు తీస్తూ వారు వేరే ఏ రంగం లోనూ తమ దృష్టి సారించలేకపోడం దురదృష్టం.
ఒకవేళ వారు ఉత్సాహం గా పాల్గొనదలిచిన, మన  ప్రభుత్వం ఎటువంటి సదుపాయాలు అందజేస్తోంది?
ఎప్పుడైనా ఆలోచించారా?
మన ఇరుగు పొరుగు దేశాలతో కలుపుకుని చిన్న చిన్న దేశాలైన జమైకా, పోర్చుగీస్, అర్జెంటినా, అటు పెద్ద దేశమైన  చైనా  వరకు క్రీడా రంగం లో ఆసక్తి కనబరిచే వారికి ఎన్నో విధాలైన ప్రోత్సాహకాల్ని అందజేస్తున్నాయి.
విజేతలై తిరిగివచ్చిన వారికి ఘన సన్మానాలు చేసే ఏర్పాట్లలో ఎంతో శ్రద్ధ ఉన్న
భారత ప్రభుత్వం, అసలు ఆ స్థితి కి ఎదగడానికి కావలసిన సదుపాయాలను అన్ని తరగతుల క్రీడాకారులకు అందజేయడం మీద కూడా శ్రద్ధ  పెడితే బాగుంటుంది.
లేకపోతే, 1.27 బిలియన్ల జనాభాలో ఎప్పుడో ఒకసారి మెరిసే తార లా సింధు లాంటివాళ్లు తళుక్కు మని మాయం అయిపోతుంటారు.
మళ్ళీ వేరొక సింధు వచ్చెన్తవరకు మనం ఎదురు చూపులు చూస్తూ ఉండిపోవాలిసిందేనా?
ఈ మెరుపు కూడా వారి స్వయం ప్రతిభ వల్ల మొదటి నుంచి ప్రతిభకు ప్రోత్సాహం ఉంటే.  ప్రభుత్వాలు ఆలోచించాలి
భారత ప్రభుత్వం ఇప్పటికైనా క్రీడలపట్ల వారి విధానాలను సరి చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఇలాంటి ఎంతోమంది సింధులు తగిన గుర్తింపు, ప్రోత్సాహం మరియు సదుపాయాలు లేక చీకటి లోనే ఉండిపోతున్నారు.
వారిని గుర్తించి తగిన ప్రోత్సాహాన్ని సదుపాయాలను అందిస్తే, భారత దేశ క్రీడాకాశానికి తమ తళుకులతో వెలుగు నింపే క్రీడా తారలు ఎంతోమంది త్వరలోనే వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి.
మరొక విషయం గుర్తించవలిసింది ఏమంటే, మన పొరుగు దేశమైన చైనా క్రీడాకారులు 70 పతకాలు సాధించారు.
అయినప్పటికీ వాళ్ళ దేశ మీడియా వారి పట్ల అసంతృప్తి వ్యక్త పరిచారు.
ఇన్నేళ్ల వారి చరిత్ర లో అత్యల్ప సంఖ్య లో  పతకాలు వచ్చాయని  రాశారు.
మన తమిళనాడు జనాభా తో సమానమైన జనాభా గల కెనడా కి కూడా 22 పతకాలు వివిధ క్రీడా రంగాల్లో వచ్చాయంటే అక్కడి ప్రభుత్వం వారు అందించే ప్రోత్సాహకాలే కారణం అని చెప్పడం అతిశయోక్తి కాదు.
అత్యధిక సంఖ్య లో పతకాలు సాధించిన ఎన్నో దేశాల్లో జనాభా మనకన్నా తక్కువే.
అయినప్పటికీ వారి దేశ పౌరులు క్రీడల పట్ల మక్కువ చూపించడం, ఘన విజయాలు సాధించడం చాలా సాధారణ విషయం గా చెప్పొచ్చు.
ఎప్పుడో ఒక పదేళ్లకు లేదా ఐదేళ్లకి ఒక పతకం సాధిస్తే అది ఆ సాధించిన వారి ఘనతే.
కానీ...  అలాంటి సాధించగల సత్తా ఉన్నప్పటికీ, సరైన ప్రోత్సాహకాలు మరియు సదుపాయాలు అందక ఎంతో మంది ఔత్సాహికులైన క్రీడాకారులు ముందుకు రాలేక పోవడం దేశానికే సిగ్గు చేటు.
భారత ప్రభుత్వం క్రీడల పట్ల చూపే ఈ అలసత్వానికి దేశ ప్రజలు సిగ్గు తో తల దించుకోవాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది.
ఎవరికి వారు ప్రశ్నించుకోవాల్సిన సమయం వచ్చింది.
మనదేశం లో సింధు లాంటి ప్రతిభ పాటవాలు గల క్రీడాకారులు లేదా? మరి మనం కేవలం సింధు లేక సాక్షి లాంటి ఒకరిద్దరి విజయాన్నే ఎందుకు సంబరాలుగా జరుపుకుంటున్నాం?
దీనికి కారణం ఎవ్వరు?
ప్రభుత్వాన్ని గళ మెత్తి ప్రశ్నించే అవసరం సమయం ఆసన్నమైందని ఎవరికీ అనిపించటం లేదా?
ప్రభుత్వ ప్రజా ప్రతినిధులారా....., మీ ప్రభుత్వ విధి విధానాలను మరియొక సారి సరి చూసుకోండి. మీ విధి విధానాల కారణం గా ఎంతో ప్రతిభ ఉన్న మన దేశ యువత వెనకబాటు తనం తో మిగిలిపోకుండా తగిన చర్యలు ఇకనైనా చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
మరొక్క సారి దేశ ప్రతిష్ట ఇలా వెనకబడి పోకుండా ఉండేలా చూసుకునే బాధ్యత మీపైన ఉంది అని తెలుసుకోండి.
ఈ మెలకువ ప్రతి ఇంటి నుంచి జరగాలి, ప్రతి వీధి నుంచి జరగాలి, ప్రతి జిల్లా, రాష్ట్రం, నుంచి యావత్ భారత దేశానికి పాకాలి
మార్పు వస్తుందని ఆశిస్తూ.