ఈతకు వెళ్లి 8మంది దుర్మరణం

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి సమీపంలోని చెరువులో మునికి మంగళవారం ఎనిమిది మంది పదో తరగతి విద్యార్థులు మృతి చెందారు. సరదాగా ఈతకు వెళ్లిన వీరు నీటి లోతు తెలియక లోపలికి దిగి మునిగి పోయారు. వీరంతా స్థానిక మినర్వ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో పదో తరగతి చదవుతున్నారు. వీరు కావలిలోని పాతవూరు, వైకుంఠపురం ప్రాంతాలకు చెందినవారు. ఈత కోసం వెళ్లిన ఈ విద్యార్థులు సాయంత్రం అయినా ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందారు. వారి కోసం వెతికారు. కావలి పెద్ద చెరువు వద్దకు సైకిళ్లు వెళ్లినట్లు తల్లిదండ్రులు తెలుసుకున్నారు. అక్కడకు వెళ్లి చూడగా చెరువ కట్ట వద్ద సైకిళ్లు, చెరువులోని నీటి గుంతల వద్ద విప్పిన దుస్తులు, వాచీలు, చెప్పులు ఉన్నాయి.

అక్కడ వదిలిన దుస్తుల ఆధారంగా భరత్, లోహిత్, సాయి ప్రవీణ్, హరీష్, సాయి, మహా శివరాజ్, శివా రెడ్డి, సూరజ్‌లుగా అనుమానిస్తున్నారు. ఆర్ధరాత్రి వరకు వెతికి మృతదేహాలను వెలికి తీశారు. మరోవైపు పశ్చిమగోదావరి జిల్లా పేరుపాలెం సాగర తీరంలోనూ ఇద్దరు విద్యార్థులు ఇదే రీతిలో గల్లంతయ్యారు. నరసాపురం మిషన్ హైస్కూల్లో టెన్త్ చదువుతున్న అయిదుగురు విద్యార్థులు మంగళవారం వీడ్కోలు పార్టీ ముగిశాక బీచ్‌కు వచ్చారు. వీరిలో కళ్యాణ్‌బాబు, మధుబాబు సమ్రుదంలోకి దిగి గల్లంతయినట్లుగా సమాచారం.