శ్రీలక్ష్మి బినామీ మరిదే:

శ్రీలక్ష్మి బినామీ మరిదే:

కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి అక్రమ మైనింగ్ కేసులో అరెస్టయిన ఐఏఎస్ అధికారి వై.శ్రీలక్ష్మి బినామీ ఎవరనే దానిపై సీబీఐ దృష్టిసారించింది. తన మరిది మామిడి రాకేశ్ వద్ద ఆమె కొంత పెట్టుబడులు పెట్టినట్లు గుర్తించిన సీబీఐ అధికారులు ఈ దిశగా విచారణ ప్రారంభించారు. శ్రీలక్ష్మి భర్త, ఐపీఎస్ అధికారి గోపీకృష్ణకు రాకేశ్ సోదరుడు. అక్రమ మార్గాల్లో సంపాదించిన డబ్బును శ్రీలక్ష్మి వివిధ చోట్ల పెట్టుబడి పెట్టినట్లు, ఆమె తరపున రాకేశ్ రియల్ ఎస్టేట్ దందా సాగిస్తున్నట్లు అనుమానిస్తూ అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ నేపథ్యంలో సీబీఐ అధికారులు తనను వేధిస్తున్నారంటూ రాకేశ్ హైకోర్టును ఆశ్రయించారు. 

ఇదే కేసులో అధికారులు తమను వేధిస్తున్నారంటూ రంగారెడ్డి జిల్లా కొత్తపేటకు చెందిన వెంకటేశ్వరరావు, మెహదీపట్నానికి చెందిన ఎన్.మధుసూదన్‌రావు వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. రాకేశ్ బాబు చాలాకాలం నుంచి తమకు తెలుసని, ఆయన తమ వద్ద నుంచి రూ.44.25 లక్షలు చెల్లించి భూమి కొనుగోలు చేశారని, ఆ డబ్బు శ్రీలక్ష్మిదేనని చెప్పాల్సిందిగా సీబీఐ అధికారులు తమపై ఒత్తిడి తెస్తున్నారంటూ పిటిషన్లలో పేర్కొన్నారు. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ అసుతోష్ మొహంతా పిటిషనర్లను ప్రశ్నించడానికి సీబీఐకి అనుమతిచ్చారు. వారిపై ఒత్తిడి తేవద్దని, థర్డ్ డిగ్రీ ప్రయోగించరాదని స్పష్టం చేశారు.