ఆచార్య! కుట్రదారులెవరో చెప్పండి

ఆచార్య! కుట్రదారులెవరో చెప్పండి

ఎమ్మార్ కేసులో కుట్రదారులు ఎవరో చెప్పాలని డిమాండ్ చేస్తూ మాజీ మంత్రి శంకరరావు ఐఎఎస్ అధికారి బిపి ఆచార్యకు లీగల్ నోటీసు ఇచ్చారు. ఎమ్మార్ కుంభకోణం కేసులో తాను నిర్దోషినని, తనను కావాలని ఇరికించారని, దోషులు బయట తిరుగుతున్నారని బిపి ఆచార్య ఇటీవల అన్నారు. దీనిపై శంకరరావు బిపి ఆచార్యకు లీగల్ నోటీసులు ఇచ్చారు. ఈ విషయాన్ని ఆయన శనివారం మీడియా ప్రతినిధులతో చెప్పారు. ఎవరు కుట్రదారులో కోర్టు నిర్ధారించాలని ఆయన అన్నారు. దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రులతో విభేదించారే తప్ప అధిష్టానాన్ని ధిక్కరించలేదని ఆయన చెప్పారు. అందుకే వైయస్ రాజశేఖర రెడ్డికి సిఎల్పీ నేతగా, ముఖ్యమంత్రిగా అవకాశం ఇచ్చిందని ఆయన చెప్పారు. 

వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో 26 జీవోల విడుదలకు సంబంధించి మంత్రుల ప్రమేయం ఉందనే విషయం ఎంతవరకు వాస్తవమో తేలాల్సి ఉందని మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి శనివారం కడపలో మీడియా ప్రతినిధులతో అన్నారు. మంత్రి కన్నా లక్ష్మినారాయణకు ఇచ్చిన నోటీసును తాను చూశానని, కన్నా జారీ చేసిన జీవోలో పస లేదని, కన్నా పాత్ర ఏమీ లేదని ఆయన అన్నారు. పారిశ్రామిక విధానంలో ఉన్న పరిస్థితిని బట్టి 2010లో జీవో జారీ అయిందని, కానీ మంత్రి కన్నా ఆ జీవోపై సంతకం చేయలేదని ఆయన అన్నారు. ఫైలు చూడనప్పటికీ కన్నాకు నోటీసు రావడమేమిటని ఆయన అడిగారు. మంత్రుల సంతకాలు లేకుండా జీవోలు విడుదలైన విషయంపై లోతుగా ఆలోచించాల్సి ఉంటుందని ఆయన అన్నారు. ఎవరు బాధ్యులనేది తేలాల్సి ఉందని ఆయన అన్నారు.