శ్రీరామ నవమి శుభాకాంక్షలు

 శ్రీరామ నవమి శుభాకాంక్షలు

దుష్టశిక్షణ శిష్టరక్షణార్థమై చైత్రశుద్ధనవమినాడు ఐదుగ్రహాలు ఉచ్ఛస్థితిలో ఉన్నకాలమందు పునర్వసు నక్షత్రంలో కూడిన కర్కాటక లగ్నంలో పగటి సమయాన సాక్షాత్తు శ్రీహరియే కౌసల్యాపుత్రుడై ఈ భూమిపైన జన్మంచిన పర్వదినాన్ని మనం శ్రీరామనవమిగా విశేషంగా జరుపుకుంటాం. 

రామ' అంటే రమించుట అని అర్థం. కావున శ్రీరామునిని స్మరిస్తూ ఉండాలి. అగ్నిని మనము తెలిసియో తెలియకో తాకినచో, అది ఎట్టు దహిస్తుందో, అదేవిధంగా శ్రీరామనామ ధ్యానముతో మన పాపాల్ని దహిస్తుంది. 

ఒకసారి పార్వతీదేవి పరమశివుని విష్ణు సహస్రనామ స్తోత్రమ్‌నకు కాస్త సూక్ష్మమైన మార్గం చెప్పమని కోరుతుంది. దానికి పరమేశ్వరుడు ఓ పార్వతీ! 

శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే 
సహస్రనామతత్సుల్యం రామనామ వరాననే ||
అని మూడుసార్లు సర్మించినంతనే ఒక్క విష్ణు సహస్రనామ పారాయణ ఫలితమే కాదు.. అబేధస్వరూపులమైన మా వల్ల భక్తులకు శివసహస్రనామ ఫలితం కూడా లభిస్తుంది సుమా! అని ఆ పార్వతికి మంత్రోపాసనచేస్తాడు. 

ఏ భక్తులు కాశీలో జీవిస్తూ ఆ పుణ్యక్షేత్రమందు మరణిస్తారో వారి మరణ సమయాన ఆ భక్తవంశంకరుడే ఈతారకమంత్రి వారి కుడి చెవిలో చెప్పి వార్కి సద్గతి కలిగిస్తారన్నది భక్తుల ప్రగాఢ విశ్వాసం.

ఇక భక్తరామదాసు అయితే సరేసరి! శ్రీరామనామ గానమధుపానాన్ని భక్తితో సేవించి, శ్రీరామ నీనామ మేమిరుచిరా.. ఎంతో రుచిరా.. మరి ఎంతో రుచిరా అని కీర్తించాడు. మనం శ్రీరామనామాన్ని ఉచ్ఛరించేటప్పుడు "రా" అనగానే మన నోరు తెరచుకుని మనలోపల పాపాలన్ని బయటకు వచ్చి ఆ "రామనామ " అగ్నిజ్వాలలో పడి దహించుకుపోతాయట. 

అలాగే "మ" అనే అక్షరం ఉచ్ఛరించినప్పుడు మననోరూ మూసుకుంటుంది. కనుక బయట మనకు కనిపించే పాపాలు ఏవీ మనలోకి ప్రవేశించలేవటయ అందుచేతనే రామనామ స్మరణ మిక్కిలి జ్ఞానాన్ని, జన్మరాహిత్యాని కలిగిస్తుందట.

పూర్వం జన్మతహః కిరాతకుడై పుట్టి "వాల్మీకి మహర్షి" వద్ద ఒకసారి నారదుడు చూచి నీవు చేస్తున్న ఈ కిరాతకమైన పాపకార్యంలో నీ భార్యాబిడ్డలు ఏమైనా పాలుపంచుకుంటారేమో తెలుసుకునిరా... అని పంపుతాడు. 

వెంటనే ఆ కిరాతకుడు భార్యబిడ్డల వద్దకు వెళ్ళి ఆ ప్రశ్న అడుగుతాడు. దానికి వారు గృహస్తుడుగా మమ్ములను పెంచి పోషించే బాధ్య నీది కాని నీవు చేసే పుణ్యకార్యంలో భాగం పంచుకుంటామే తప్ప పాపకార్యంలో కాదు. అని పలుకుతారు. వారి పలుకులకు వైరాగ్యము చెందే మహర్షి నాకు చక్కని మోక్షమార్గానికి ఉపాయము చెప్పమని నారదుని వద్ద ప్రాధేయపడతాడు. 

అంతటితో నారదుడు "రామ రామ రామ" అను తారక మంత్రాన్ని చెవిలో ఉపదేశిస్తాడు. చివరకు నోరు తిరగకపోయి శరీరంపై పుట్టలు పోస్తున్నా "మర" అంటూనే ఆ తారకమంత్రాన్ని వీడలేదు. 

బ్రహ్మ అనుగ్రహముతో వల్మీకము నుంచి పునర్జీవింపబడి ఆ కిరాతకుడు " వాల్మీకి మహర్షి"గా జ్ఞాన సంపదను ఈ తారకమంత్రముచే పొంది శ్రీమద్రామాయణం అనే కమనీయకావ్యం రచించి భాగ్యశాలి అయినాడు. 

అట్టి "శ్రీమద్రామాయణం"మనకు ఎంతో ఆదర్శవంతమైంది. శ్రీరామనవమి సందర్భంగా- 
" శ్రీ రాఘవం దశరథాత్మజ మప్రేమయం 
సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపమ్ 
ఆజానుబాహుమరవింద దళాయతాక్షం 
రామం నిశాచర వినాశకరం నమామి" అని వేడుకుని శ్రీసీతారామచంద్రమూర్తి అనుగ్రహం పొందుదుముగాక..!.