ప్రేమికుడితో భార్యకు పెళ్లి చేసిన భర్త

ప్రేమికుడితో భార్యకు పెళ్లి చేసిన భర్త ఉదంతం కరీంనగర్ జిల్లాలో చోటు చేసుకుంది. పెళ్లయిన నాటి నుంచే వధువు ముభావంగా ఉండడంతో భర్త ఆలోచనలో పడ్డగా. ఎందుకలా ఉంటున్నావని నిలదీశాడు. పెళ్లికి ముందే మరొకరిని ప్రేమించిన విషయాన్ని ఆమె చెప్పింది. అతనితోనే కలిసి జీవిస్తానని కోరింది. దాంతో ఆ యువకుడు దగ్గరుండి - ఆమెకు, ప్రేమికుడికి పెళ్లి జరిపించాడు. సంతోషంగా జీవించాలని ఆశీర్వదించాడు. కరీంనగర్ జిల్లా మంథని మండలం ఖానాపూర్‌లో ఘటన జరిగింది. 

ఖానాపూర్‌కు చెందిన శ్రీధర్‌తో కమాన్‌పూర్ మండలం కల్వచర్లకు చెందిన రమాదేవికి ఈ నెల 17న వివాహం జరిగింది. పెళ్లయిన రోజు నుంచే రమాదేవి శ్రీధర్‌కు దూరంగా ఉండడం మొదలుపెట్టింది. నాలుగు రోజుల తర్వాత భర్త నిలదీయడంతో తమ గ్రామానికే చెందిన తిరుపతి అనే యువకుడిని రెండేళ్లుగా ప్రేమిస్తున్నానని చెప్పింది. అతనితోనే కలిసి జీవిస్తానని స్పష్టం చేసింది. 

దాంతో ఆ కుటుంబంలో వివాదం చెలరేగింది. అనంతరం వధువు, వరుడి కుటుంబాల మధ్య పంచాయితీ నిర్వహించి, విడాకులు ఇవ్వాలని నిర్ణయించారు. ఆదివారం ఉదయం శ్రీధర్, రమాదేవి విడాకులు తీసుకోగా - అదే రోజు సాయంత్రం శ్రీలక్ష్మీనారాయణ స్వామి ఆలయంలో రమాదేవి, ఆమె ప్రియుడు తిరుపతిల వివాహం జరిగింది. ఈ వివాహాన్ని శ్రీధర్ దగ్గరుండి జరిపించాడు.