ఎసిబి కుమ్ములాట

ఎసిబి కుమ్ములాట

తాజాగా బయటపడిన అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) వ్యవహారం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు మధ్య జరుగుతున్న సమరాన్ని మరింత బాహాటం చేసింది. ఇరువురు నేతల మధ్య స్పర్థలు వ్యక్తిగత స్థాయికి చేరుకున్నాయనే మాట వినిపిస్తోంది. మద్యం సిండికేట్ల వ్యవహారంలో బొత్స సత్యనారాయణను దోషిగా నిలబెట్టి పదవీచ్యుతుడిని చేయాలని కిరణ్ కుమార్ రెడ్డి ఎత్తుగడ వేసినట్లు చెబుతున్నారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఎసిబి మద్యం సిండికేట్లపై దాడులు చేసినప్పటికీ బొత్స సత్యనారాయణ సొంత జిల్లా విజయనగరంలో మాత్రం ఇప్పటి వరకూ జరగలేదు. మద్యం వ్యాపారమే బొత్స సత్యనారాయణకు ప్రధాన ఆర్థిక వనరు. దీంతో బొత్సను దెబ్బ తీయాలనే వ్యూహంతో కిరణ్ పనిచేస్తున్నట్లు తెలుస్తోంది.

మద్యం సిండికేట్ల కేసులో బొత్స సత్యనారాయణ కుటుంబ సభ్యుల పేర్లను చేర్చాలంటూ సిట్‌కు నేతృత్వం వహిస్తున్న ఎసిబి అదనపు డైరెక్టర్ శ్రీనివాస రెడ్డి తనపై ఒత్తిడి తెస్తున్నారని ఎసిబి ఇన్‌స్పెక్టర్ ఎంవి గణేష్ ఆరోపించారు. అందుకు నిరాకరించడంతో తనను తీవ్ర పదజాలంతో దూషించారని ఆరోపిస్తూ గణేష్ లీగల్ నోటీసులు పంపించారు. శ్రీనివాస రెడ్డి ఒత్తిళ్ల వెనక కిరణ్ కుమార్ రెడ్డి ప్రమేయం ఉందని అంటున్నారు. అయితే, ఈ విషయంలో బొత్స సత్యనారాయణ కూడా వ్యూహాత్మకంగానే వ్యవహరించారని అంటున్నారు. గణేష్ మార్చి 27వ తేదీన శ్రీనివాస రెడ్డికి పంపిన లీగల్ నోటీసు వ్యవహారాన్ని బొత్స వర్గమే లీక్ చేసిందని చెబుతున్నారు. అసమ్మతికి కేంద్రంగా మారిన బొత్స సత్యనారాయణకు చెక్ పెట్టడం ద్వారా అందరి నోళ్లూ మూయించాలని కిరణ్ కుమార్ రెడ్డి అనుకున్నట్లు, దాంతో మద్యం సిండికేట్లలో బొత్సను ఇరికించాలని అనుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. 

ఈ స్థితిలో బొత్స సత్యనారాయణ ఢిల్లీకి వెళ్లారు. రాబోయే ఉప ఎన్నికలపై అధిష్టానంతో చర్చించడంతో పాటు కిరణ్ కుమార్ రెడ్డి వ్యవహారాన్ని కూడా తెలపాలనే ఉద్దేశంతో బొత్స ఢిల్లీ వెళ్లినట్లు చెబుతున్నారు. ఆయన శుక్రవారం కూడా అక్కడే ఉన్నారు. విజయనగరం జిల్లాలోని మద్యం సిండికేట్లపై తన క్లయింట్ గణేష్ రహస్య విచారణ జరిపి, ఎప్పటికప్పుడు వివరాలు అందిస్తున్నారని, అయినా, వినకుండా బొత్స సత్యనారాయణ, ఆయన కుటుంబ సభ్యుల పేర్లు ఎందుకు చేర్చలేదంటూ తీవ్ర పదజాలంతో దూషించారని గణేష్ తరఫు న్యాయవాది శ్రీనివాస రెడ్డికి లీగల్ నోటీసు పంపించారు. తనకు నష్టపరిహారం కింద పది లక్షల రూపాయలు చెల్లించాలని కూడా గణేష్ ఆ నోటీసులో డిమాండ్ చేశారు. ఏమైనా, ఈ వ్యవహారమంతా బొత్స, కిరణ్ మధ్య సమరంలో భాగమేనని అంటున్నారు.