త్వరలో కేంద్ర కేబినెట్‌లోకి చిరంజీవి?

త్వరలో కేంద్ర కేబినెట్‌లోకి చిరంజీవి?

రాజ్యసభ సభ్యుడు చిరంజీవి త్వరలో కేంద్రమంత్రి అయ్యే అవకాశాలు కనిపిస్తున్నారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల రెండో దశ మొదలయ్యేలోపే అంటే ఏప్రిల్ 24లోగా ఇటు పార్టీలోను అటు కేంద్ర మంత్రి వర్గంలోను భారీ మార్పులు చేయాలని ఏఐసిసి అధినేత్రి సోనియా గాంధీ, ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ యోచిస్తున్నారట. డిఎంకెకు చెందిన మరో ఇద్దరిని, ఇటీవల రాజ్యసభకు ఎంపికైన చిరంజీవిని కేంద్ర మంత్రి వర్గంలోకి చేర్చుకునే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. సమాజ్‌వాదీ పార్టీని కూడా మంత్రివర్గంలో చేర్చుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇటీవల ఆ పార్టీ అధినేత ములాయం సింగ్ తాము ప్రభుత్వంలో కలవని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే వారిని ఒప్పించేందుకు కాంగ్రెసు పార్టీ అధిష్టానం ప్రయత్నాలు చేస్తున్నట్లుగా సమాచారం.

కేబినెట్‌లోని కీలక శాఖల్లో మార్పులు కూడా ఉంటాయని తెలుస్తోంది. అంతేకాకుండా మంత్రివర్గ మార్పులకు ముందు పార్టీలో పెద్ద ఎత్తున పునర్వ్యవస్థీకరణ జరగనుందని అంటున్నారు. ఒకే వ్యక్తికి ఒకే పదవి సూత్రం ఆధారంగా బాధ్యతలు కల్పిస్తారని, ఒకరిద్దరు మంత్రులను పూర్తిగా పార్టీకి కేటాయిస్తారని తెలుస్తోంది. గులాం నబీ ఆజాద్, ముకుల్ వాస్నిక్ పార్టీ బాధ్యతలతో పాటు మంత్రివర్గ బాధ్యతల్ని కూడా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇక సిడబ్లుసి, పార్టీ ఆఫీసు బేరర్ల పదవుల్లో అన్ని రాష్ట్రాల వారికి బాధ్యతలు అప్పగించనున్నట్లు సమాచారం