పార్టీని నిర్మించింది నేనే: బాబు

పార్టీని నిర్మించింది నేనే: బాబు

ఎన్టీ రామారావు హయాంలో కూడా పార్టీని నిర్మించింది తానే అని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. రాజ్యసభ సభ్యుడు హరికృష్ణ చేసిన వ్యాఖ్యలకు సమాధానంగా ఆయన ఆ విధంగా అన్నారు. నందమూరి కుటుంబమంటే తనకు గౌరవం ఉందని ఆయన చెప్పారు. ఎబిఎన్ ఆంధ్రజ్యోతి శుక్రవారం సాయంత్రం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. బహిరంగ వ్యాఖ్యలు చేయవద్దని, ఏదైనా ఉంటే తనతో మాట్లాడాలని ఆయన అన్నారు. పార్టీని భావితరాలకు అందించాల్సిన బాధ్యత తనపై ఉందని ఆయన అన్నారు. 

మీ కుమారుడు నారా లోకేష్‌ను పార్టీలోకి తెస్తారా అని అడిగితే ఆయన సూటిగా సమాధానం ఇవ్వలేదు. పార్టీలోకి వచ్చే వారందరినీ ఉపయోగించుకుంటామని, అయితే ఎవరైనా సరే క్రమశిక్షణతో వ్యవహరించాల్సి ఉంటుందని, ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తామంటే కుదరదని, అలా చేస్తే అదుపులో పెట్టాల్సిన బాధ్యత తనపై ఉంటుందని ఆయన అన్నారు. వైయస్సార్ కాంగ్రెసు, తెరాస పట్ల తాను అసహనం ప్రదర్శించడం లేదని, అసహనంగా లేనని, ఓ సీనియర్ రాజకీయ నాయకుడిగా జరుగుతున్నవాటిని చూసి బాధేస్తోందని ఆయన అన్నారు. వాటిని సరిదిద్దాల్సిన బాధ్యత తనపై ఉందని ఆయన అన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ మాఫియా రాజకీయాలు నడుపుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు.