తెలంగాణపై చేతులెత్తేసిన చిదంబరం

తెలంగాణ సమస్యపై కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం చేతులెత్తేశారు. తెలంగాణ సమస్యకు పరిష్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ పార్టీల చేతుల్లోనే ఉందని ఆయన అన్నారు. తెలంగాణ అంశంపై ఆ ప్రాంత సభ్యులు లోకసభ సభ్యులు సభా కార్యక్రమాలను స్తంభింపజేస్తున్న నేపథ్యంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ అంశంపై రాష్ట్రానికి చెందిన పార్టీలకు స్పష్టత లేకుండా అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయడం వల్ల ప్రయోజం ఏమిటని ఆయన అడిగారు. 

రాష్ట్రంలోని రాజకీయ పార్టీలకు తెలంగాణ అంశంపై స్పష్టత లేకుండా తాము ఏమీ చేయలేమని ఆయన అన్నారు. రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు స్పష్టతకు వస్తే అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు. రాజకీయ పార్టీలు స్పష్టతకు వచ్చి ఉంటే అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేసి ఉండేవాళ్లమని ఆయన అన్నారు. రాయలసీమ రాష్ట్ర ఏర్పాటు డిమాండ్ కూడా ఉందని, తలా ఒక్కటి కోరుకుంటే సమస్య ఎలా పరిష్కారమవుతుందని చిదంబరం అన్నారు. 

తెలంగాణపై కాంగ్రెసు, తెలుగుదేశం, మజ్లీస్, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు తమ వైఖరులను స్పష్టం చేయాల్సి ఉందని, ఆ పార్టీలు స్పష్టమైన వైఖరిని తీసుకుని వస్తేనే తెలంగాణ సమస్య పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం ఏమైనా చేస్తుందని ఆయన చాలా కాలంగా చెప్పుకుంటూ వస్తున్నారు.