మంచు విష్ణు షూటింగ్‌లో ప్రమాదం

మంచు విష్ణు షూటింగ్‌లో ప్రమాదం

విష్ణు, హన్సిక జంటగా 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై రూపొందుతున్న సినిమా షూటింగ్‌లో ప్రమాదం చోటు చేసుకుంది. జి. నాగేశ్వరరెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఈ నెల 22 నుంచి తిరుపతి పరిసరాల్లో జరుగుతోంది. కాగా తిరుపతి సమీపంలోని ఐతేపల్లి గ్రామంలో ఫైట్‌మాస్టర్ సెల్వ నేతృత్వంలో ఈ చిత్రానికి సంబంధించిన క్లైమాక్స్ సన్నివేశాల్ని చిత్రీకరిస్తున్నారు. ఈ సన్నివేశాల్లో కొన్ని ఎడ్ల బండ్లను ఉపయోగించారు. ఓ షాటులో ఎద్దులు బెదిరి, కెమెరా సిబ్బంది మీదకు దూసుకురావడంతో ఇద్దరు కెమెరా అసిస్టెంట్లకు గాయాలయ్యాయి. 

సన్నివేశాలు తీస్తున్న రెడ్ కెమెరా పూర్తిగా ధ్వంసమైంది. గాయాలైన వారిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో సెట్స్ మీద విష్ణు, హన్సిక, రవిప్రకాశ్, సినిమాటోగ్రాఫర్ సిద్ధార్థ్ తదితరులున్నారు. గాయాలైన ఇద్దరు వ్యక్తులూ క్షేమంగా ఉన్నారనీ, కొంత సమయం తర్వాత యథావిధిగా షూటింగ్ కొనసాగిందనీ విష్ణు తెలిపారు. ఈ నెల 31 వరకు ఈ షెడ్యూల్ జరుగుతుందనీ, ఏప్రిల్ 4 నుంచి బ్యాంకాక్‌లో రెండు పాటల్ని తీస్తామనీ ఆయన చెప్పారు. ఇక ఈ చిత్రానికి దొరకడు అనే టైటిల్ కన్సిరిడేషన్ లో ఉంది. పూర్తి కామెడీ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం రూపొందుతోందని సమాచారం.