కోవూరు సీటులో మందుబాబుల అభ్యర్థి

కోవూరు సీటులో మందుబాబుల అభ్యర్థి

నెల్లూరు జిల్లా కోవూరు శానససభా స్థానంలో విచిత్రమైన పరిస్థితే నెలకొంది. మందుబాబులంతా కలిసి ఓ అభ్యర్థిని పోటీకి దించడానికి ప్రయత్నించారు. మందుబాబుల సంక్షేమ సంఘం తరఫున సురేంద్ర బాబు అనే అభ్యర్థి నామినేషన్ దాఖలు చేశారు. అయితే, ఏ మత్తులో ఉన్నాడో గానీ నామినేషన్ పత్రంపై ఒక చోట పెట్టాల్సిన సంతకాన్ని మరో చోట పెట్టాడట. దీంతో ఆయన నామినేషన్ తిరస్కరణకు గురైంది. కావాలనే తన నామినేషన్ తిరస్కరించారని, దీనిపై తాను కోర్టుకు వెళ్తానని సురేంద్రబాబు అంటున్నారు. 

అయితే, దీనికి ముందు పెద్ద తతంగమే జరిగింది. నెల్లూరు జిల్లాలో షేక్ సిరాజ్ నాయకత్వంలో మందుబాబుల సంక్షేమ సంఘం ఒకటి ఏర్పడింది. మందుబాబుల సంక్షేమానికి హామీలు ఇస్తూ ఓ ఎన్నికల ప్రణాళికను రూపొందించి కోవూరు ఉప ఎన్నికల్లో పోటీకి దించడానికి పూనుకున్నారు. తాగి తాగి లివర్ పాడైతే కార్పొరేట్ ఆస్పత్రుల స్థాయిలో వైద్యం అందించడానికి హామీ వంటి పలు హామీలను మ్యానిఫెస్టోలో పొందుపరిచారు. నామినేషన్ తిరస్కరణకు గురి కాక ముందు కోవూరులో పెద్దగానే ప్రచారం కూడా సాగించారు. ఏం చేస్తాం, వారొకటి తలిస్తే, మద్యం మరోటి తలిచింది.