దర్శకుడిగా మారుతున్న మరో కమెడియన్

బాలీవుడ్ మూవీ త్రీ ఇడియట్స్ చిత్రంలో చతుర్ పాత్రలో అందరినీ నవ్వించిన కమెడియన్ ఓమి వైద్య సినీ రంగంలో మరో మెట్టు ఎక్కబోతున్నాడు. త్వరలో మెగా ఫోన్ పట్టుకుని ఓ చిత్రానికి దర్శకత్వం వహించ బోతున్నాడు. ఈ మేరకు అందుకు సంబంధించిన ఏర్పాట్లలో బిజీగా గడుపుతున్నాడు. 

హాలీవుడ్‌లో మనోజ్ నైట్ శ్యామలన్ తీసిన ‘ది సిక్త్ సెన్స్' స్పూర్తితో సినిమా రూపొందించాలనే ఆలోచనలో ఓమీ వైద్య ఉన్నాడు. సైకలాజికల్ థ్రిల్లర్ కథాంశంతో ఈచిత్రం ఉంటుందని తెలుస్తోంది. 

ఓమి వైద్య న్యూయార్క్ యూనివర్శిటీలో మూవీ మేకింగ్ కోర్స్ చేశారు. అక్కడ నేర్చుకున్న విషయాలకు పదును పెడుతూ విభిన్నంగా తన చిత్రాన్ని రూపొందించడానికి చాలా కష్ట పడుతున్నాడని ఆయన సన్నిహితులు అంటున్నారు. ఈ సంవత్సరం ప్లేయర్స్, జోడి బ్రేకర్స్ చిత్రాలు చేసిన తర్వాత ఓమి వైద్య ఎలాంటి సినిమాలు ఒప్పుకోలేదు. తన దృష్టి మొత్తం దర్శకత్వంపైనే పెట్టడం వల్లనే నటనకు దూరంగా ఉంటున్నాడని తెలుస్తోంది.