పాట పాడిన సూపర్ స్టార్

సూపర్ స్టార్ రజనీకాంత్ మరోసారి పాట పాడారు. 1992లో విడుదలైన 'మన్నన్'లో రజనీకాంత్ తొలిసారిగా పాడారు. ఆ తర్వాత ఇప్పుడే మళ్లీ గొంతు సవరించుకొన్నారు. తన కుమార్తె ఐశ్వర్య దర్శకత్వంలో రజనీకాంత్ తాజాగా నటిస్తున్న చిత్రం 'కోచ్చడయాన్'. ఇందులో ఆయన ఓ పాటను ఆలపించారు. గీత రచయిత వైరముత్తు రాసిన ఈ గీతాన్ని ఏఆర్ రెహ్మాన్ సంగీత దర్శకత్వంలో రజనీకాంత్ పాడారు. ఇటీవలే ఈ పాట రికార్డింగ్ చెన్నైలో జరిగింది. ఇందుకు సంబంధించి దర్శకురాలు మీడియాతో మాట్లాడుతూ.. 'కోచ్చడయాన్' తొలిభాగం లండన్‌లో చిత్రీకరించాలనుకున్నాం. ప్రస్తుతం వీసా కోసం వేచి చూస్తున్నాం. అనుకున్న సమయానికి లభిస్తే.. ఈనెల 21 నుంచి అక్కడ చిత్రీకరణ ప్రారంభిస్తాం. ఇందులో ఓ పాటను రజనీకాంత్ పాడారు. చాలా అద్భుతంగా వచ్చింది. అభిమానులకు ఇదో విందులా ఉంటుందని చెప్పారు.
ఇక సినిమా విషయమై సౌందర్య మాట్లాడుతూ..'ఇప్పటివరకు 'కోచ్చడయాన్'ను తెలుగు, తమిళం, హిందీలోనే తెరకెక్కించాలని అనుకున్నాం. ఇప్పుడు ఆంగ్లంలోనూ తీసుకొచ్చే ఆలోచన ఉంది. ఆ విషయాన్ని త్వరలోనే చెబుతాం. ఈనెల 15 నుంచి రజనీకాంత్, దీపికాతోపాటు యూనిట్ లండన్‌కు వెళ్లనుంది. అక్కడ 25 రోజుల పాటు చిత్రీకరణ ఉంటుంది. తరవాత విరామం తీసుకొని మరో 25 రోజులు చెన్నైలో తెరకెక్కిస్తాం. ఆగస్టు లేదా సెప్టెంబరులో చిత్రాన్ని విడుదల చేస్తామని అంది. ఇక ఈ చిత్రంలో రజనీకాంత్ సరసన దీపికా పదుకొణే నటిస్తోంది. ఈ చిత్రానికి ఎ.ఆర్.రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. శరత్‌కుమార్, స్నేహ, ఆది కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రంలో రజనీకాంత్ సిక్స్ ప్యాక్ లో కనిపించనున్నారు. ఈ మేరకు ఆయన కూతురు సౌందర్య తన ట్విట్టర్ లో ఓ ఫోటోని పెట్టి పోస్ట్ చేసింది. ఈ పాట రికార్డింగ్‌లో రజనీతోపాటు వైరముత్తు, సంగీత దర్శకులు ఏఆర్ రెహ్మాన్, దర్శకురాలు ఐశ్వర్య తదితరులు పాల్గొన్నారు.