‘అధినాయకుడు'లో చిరుపై సెటైర్లు?

‘అధినాయకుడు'లో చిరుపై సెటైర్లు?

బాలకృష్ణ హీరోగా పరుచూరి మురళి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘అధినాయకుడు'. ఈ నెల 12న ఈ చిత్రం విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రంపై ఓ సక్తికర వార్త ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతోంది. ఈ వార్త ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా ప్రస్తావనకు రావడం చర్చనీయాంశం అయింది. 

బాలకృష్ణ ఈచిత్రంలో మూడు విభిన్నమైన పాత్రలు చేస్తున్నారు. ఇందులో ముసలి గెటప్‌లో ఉండే బాలయ్య పాత్ర...పరోక్షంగా మెగాస్టార్ చిరంజీవిని టార్గెట్ చేస్తుందని, ఆయనపై ఇండైరెక్టుగా రాజకీయ విమర్శలు చేస్తారని తెలుస్తోంది. ఆ మధ్య బాలయ్య మీడియాతో మాట్లాడుతూ చిరంజీవి పదవుల కోసం ఢిల్లీ చుట్టు తిరుగుతున్నారని విమర్శించడం, చిరంజీవి స్పందిస్తూ బాలయ్యది చిన్నపిల్లల మనస్తత్వం అంటూ కౌంటర్ ఇవ్వడం తెలిసిందే. ఈ నేపథ్యంలో బాలయ్య సినిమా ద్వారా చిరుపై విమర్శల రివేంజ్ తీర్చుకుంటున్నారని అంటున్నారు. 

రాష్ట్రంలో చిరంజీవి, బాలయ్యకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇప్పటికే ఇద్దరి అభిమానుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. ఆ మధ్య మెగా, నందమూరి అభిమానుల మధ్య ఇంటర్నెట్, సెల్ ఫోన్ మెసేజ్ వార్ పోలీసులకు ఫిర్యాదు చేసే వరకు వెళ్లింది. ఈ నేపథ్యంలో ‘అధినాయకుడు' చిత్రంలో చిరంజీవిపై విమర్శలు ఉంటే మళ్లీ అభిమానులు మధ్య రచ్చ మొదలవుతుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరి ‘అధినాయకుడు' చిత్రంలో అలాంటి సీన్లు, డైలాగులు ఉన్నాయో, లేదో సినిమా విడుదలయ్యే వరకు చెప్పడం కష్టమే.

జయసుధ, సలోని, లక్ష్మీరాయ్ బాలయ్య మూడు పాత్రలకు జోడీలుగా నటిస్తున్నారు. కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, చరణ్‌రాజ్, ఎమ్మెస్‌నారాయణ, వేణుమాధవ్, ఆదిత్యమీనన్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు, సమర్పణ: సందీప్, నిర్మాత: ఎం.ఎల్. కుమార్ చౌదరి, దర్శకత్వం: పరుచూరి మురళి.