సిఎం ఐన ముహూర్తం బాగా లేదు

సిఎం ఐన ముహూర్తం బాగా లేదు

 తాను ముఖ్యమంత్రి అయిన ముహూర్తం బాగా లేదోమోనని సిఎం కిరణ్ కుమార్ రెడ్డి ఆదివారం అన్నారు. ఆయన విశాఖపట్నం జిల్లాలోని నక్కలపల్లిలో ప్రజాపథం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను సిఎం అయిన ముహూర్తం బాగా లేదోమో అందుకే పలుమార్లు ఉప ఎన్నికలు వస్తున్నాయని అన్నారు. ఓ వైపు కొందరు రాష్ట్ర విభజన అడుగుతున్నారని, మరోవైపు కొందరు నేతలు కాంగ్రెసును చీల్చాలని కుట్ర చేస్తున్నారని అన్నారు.

మరోవైపు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికలు రావాలని, కాంగ్రెసును అధికారం నుండి దించాలని చూస్తున్నారన్నారు. ఆ ప్రయత్నంలో భాగంగానే మూడు నెలలకోసారి తాను పదవి చేపట్టాక ఉప ఎన్నికలు వస్తున్నాయన్నారు. ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని ఎవరూ తనకు ఇవ్వడం లేదన్నారు.

సాధారణంగా ఎన్నికలు ఐదేళ్లకోసారి వస్తాయని చెప్పారు. కానీ విపక్షాల అధికార దాహంతో ఉప ఎన్నికలు తరుచూ వస్తున్నాయన్నారు. దురదృష్టవశాత్తూ తాను సిఎం అయినప్పటి నుండి పరిస్థితి బాగా లేదన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసమే ప్రజాపథం ప్రవేశ పెట్టామని చెప్పారు. కాగా రానున్న ఉప ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కిరణ్ కుమార్ రెడ్డి అక్కడ వరాల జల్లు కురిపించారు.

త్వరలో 104 సేవలు మరింత మెరుగుపరుస్తామని చెప్పారు. ఆసుపత్రుల్లో వైద్యులు, మందుల కొరత లేకుండా చూస్తామని చెప్పారు. రైతులకు ఏడు గంటల ఉచిత విద్యుత్ ఇస్తామని చెప్పారు. తాగు నీటి కొరత లేకుండా ఉండేందుకు రూ.100 కోట్ల రూపాయలను విడుదల చేయనున్నట్లు చెప్పారు. మహిళలకు రూ.11,500 కోట్ల వడ్డీ లేని రుణాలు ఇస్తామని చెప్పారు.

రాష్ట్రంలో సుమారు ఏడున్నర కోట్ల మందికి ఒక్క రూపాయికి కిలో బియ్యంను ప్రభుత్వం ఇస్తుందని చెప్పారు. ఇక్కడి ప్రజలు డిగ్రీ కళాశాల అడుగుతున్నారని, దానిని ఇస్తున్నట్లు హామీ ఇచ్చారు. మత్సకారుల పిల్లలు చేపలు పట్టేందుకు వెళుతున్నారని, అలాకాకుండా వారికోసం ప్రత్యేకంగా ఓ రెసిడెన్షియల్ పాఠశాల నెలకొల్పి చదువు చెప్పిస్తామని చెప్పారు. యాబై పడగల గదిని కట్టిస్తామని చెప్పారు. 95 లక్షల మంది రైతులకు వడ్డీ లేని రుణాలు ఇస్తున్నామని, ఇందిర జల ప్రభ పూర్తయితే పది లక్షల ఎకరాలకు సాగునీరు వస్తుందని చెప్పారు.