జైలులో ఖైదీల వీరంగం

జైలులో ఖైదీల వీరంగం

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని మీరట్ జైలులో బుధవారం ఉదయం జైలు అధికారులు, ఖైదీలకు మధ్య జరిగిన ఘర్షణలో పలువురు గాయపడ్డారు. ఈ విషయమై జైలు అధికారి ఒకరు ఓ టీవి ఛానల్‌తో మాట్లాడుతూ.. ఖైదీలు మెస్‌లోకి వచ్చి ఉదయం ఫలహారం(బ్రేక్ ఫాస్ట్) కోసం వచ్చారని, ఆ సమయంలో ఖైదీల మధ్య ఘర్షణ చోటు చేసుకుందని చెప్పారు. ఆ తర్వాత ఘర్షణ పరిస్థితి విషమించిందని చెప్పారు.

ఆ సమయంలో ఓ పోలీసు వారి మధ్య సంధి కుదిర్చేందుకు వెళ్లారని, అయితే వారు మాత్రం పోలీసు పైనే దాడి చేశారని చెప్పారు. ఖైదీలు ఎల్‌పిజి సిలిండర్‌ను అంటించారని, రాళ్లను జైలు అధికారుల పైకి విసిరారని చెప్పారు. ఈ ఘటనలో డిప్యూటీ జైలర్‌తో పాటు పలువురు పోలీసులు, ఖైదీలు గాయపడ్డారని చెప్పారు.

ఫలహారం కోసం వచ్చిన ఖైదీల మధ్య ఘర్షణే ఇంత ఉద్రిక్తతకు దారి తీసిందని ఆయన చెప్పారు. కాగా ఖైదీలు వీరంగం సృష్టిస్తున్న సమయంలో పోలీసులు పోలీసులు ఓ ఖైదీ చేతిలో ఉన్న సిగరేట్ లైటర్ తీసుకోవడం కూడా మరింత ఉద్రిక్తతకు దారి తీసిందని అంటున్నారు. ఖైదీలు కొందరు గ్యాస్ సిలిండర్‌కు నిప్పు అంటించి జైలు సిబ్బందితో ఘర్షణకు దిగారు.

పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో జైళ్ల శాఖ అడిషనల్ డైరెక్టర్ జనరల్ పరిస్థితి అదుపులోకి తెచ్చేందుకు గాలిలోకి కాల్పులు జరిపినట్లుగా తెలిపారు. జైలులో శాంతిభద్రతలు నెలకొల్పేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.