అగ్ని 5 హైదరాబాద్ కీలక పాత్ర

అగ్ని 5  హైదరాబాద్ కీలక పాత్ర

లాంగ్ రేంజ్ అగ్ని 5 క్షిపణ రూపకల్పనలో హైదరాబాద్ కీలక పాత్ర పోషించింది. అగ్ని 5 క్షిపణకి సంబంధించిన చాలా విడిభాగాల రూపకల్పన, తయారీ హైదరాబాదులోనే జరిగింది. హైదరాబాద్‌లోని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థకు చెందిన పలు లాబొరేటరీలు ఇందులో పాలు పంచుకున్నాయి. రక్షణ విడిభాగాల తయారీలో స్థానిక కంపెనీలు పనిచేశాయి. అగ్ని 5 కోసం హైదరాబాదుకు చెందిన సంస్థలు ఐదేళ్ల పాటు నిరంతరం శ్రమించాయి.

అగ్ని5 పరిశోధన, అభివృద్ధికి కృషి చేసిన ఆరు సంస్థల్లో నాలుగు హైదరాబాదులోనే ఉన్నాయి. ది అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ లాబొరేటరీ, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ లాబొరేటరీ, డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ రీసెర్చ్ లాబొరేటరీ, రీసెర్చ్ సెంటర్ ఇమారత్ అగ్ని 5 కోసం పనిచేశాయి. అగ్ని5కు సంబంధించిన విడిభాగాలు 80 శాతానికి పైగా దేశంలో తయారయ్యాయని అంటున్నారు. ఆ విషయాన్ని డిఆర్‌డిఒ చీఫ్ డాక్టర్ వికె సరస్వత్ చెప్పినట్లు ఆ ఆంగ్ల దినపత్రిక రాసింది. సరస్వత్ ఉత్తరప్రదేశ్‌కు చెందినవారైనా ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచే డాక్టరేట్ పట్టా పొందారు. 

భారత్ తొలిసారిగా ఖండాంతర క్షిపణి అగ్ని 5ని ఒడిషాలోని వీలర్ ఐలాండ్ నుంచి ప్రయోగించిన విషయం తెలిసిందే. అగ్ని 5 ప్రయోగంతో ఖండాంతర క్షిపణి రక్షణ వ్యవస్థ ఉన్న అతికొద్ది దేశాల సరసన భారత్ చేరినట్లయింది.ఇప్పటి వరకు యుఎస్, రష్యా, చైనా, ఫ్రాన్స్, యుకే మాత్రమే ఇందులో ఉన్నాయి. దేశ అమ్ముల పొదిలో అగ్ని ఓ కీలక ఆయుధం కానుంది.

సుమారు యాభై టన్నుల బరువు, పదిహేడు మీటర్ల పొడవు ఉండే అగ్ని 5 క్షిపణి ఒక టన్ను బరువైన అణ్వస్త్రాలను మోసుకుపోతూ ఐదువేల కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ధ్వంసం చేయగలదు. ఇది బుధవారమే ప్రయోగించాల్సి ఉండగా, వాతావరణం అనుకూలించలేదు. అగ్ని క్షిపణిల్లో ఐదో సిరీస్ కూడా విజయవంతం కావడంతో భారత రక్షణ వ్యవస్థలో మరో కలికితురాయి చేరింది.