కిరణ్‌పై డిఎల్ 'బుక్' ఫైట్

కిరణ్‌పై డిఎల్ 'బుక్' ఫైట్

 ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై ఒంటి కాలిపై లేచే మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి ఆయనపై ఇక 'బుక్' ఫైట్‌కు సిద్ధమయ్యారు. ఆయన మేకింగ్ ఆఫ్ సిఎం అనే పేరుతో ఓ పుస్తకాన్ని రాయనున్నారు. అందులో ముఖ్యమంత్రి కావడానికి కావాల్సిన అర్హతలు, ఇప్పటి వరకు కాంగ్రెసు ముఖ్యమంత్రులు ఎవరెవరు శాసనసభ్యుల మద్దతుతో అయ్యారు తదితర అంశాలను పొందుపర్చనున్నారని తెలుస్తోంది.

మేకింగ్ ఆఫ్ సిఎం అనే పుస్తకాన్ని డిఎల్ రవీంద్రా రెడ్డి సాధ్యమైనంత త్వరలో పూర్తి చేయాలనుకుంటున్నారని తెలుస్తోంది. ఈ పుస్తకాన్ని వచ్చే మే నెలలో లేదా జూన్ నెలలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ పుస్తకంలో దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి కావడానికి ఏం కష్టాలు పడ్డారో తెలియజెప్పనున్నారట. డిఎల్ 1974లో రాజకీయాల్లోకి వచ్చారు. అప్పటి నుండి ఇప్పటి వరకు వచ్చిన సిఎంల గురించి అందులో ఆయన రాయనున్నారట.

అలాగే ప్రస్తుత ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పైనా విమర్శలు చేయనున్నారని తెలుస్తోంది. ఇప్పటికే కిరణ్ అంటేనే మండిపడుతున్న డిఎల్ ఆ పుస్తకంలో కిరణ్ పైన ఎన్ని ఆరోపణలు చేస్తారో చూడాలి. డిఎల్ రవీంద్రా రెడ్డిని మంత్రిగా చేసిన సమయంలో కిరణ్‌కు ఆయనతో మంచి సంబంధాలు ఉన్నప్పటికీ ఆ తర్వాత ఇద్దరి మధ్య చెడింది.

కిరణ్ ప్రవేశ పెట్టిన ఒక్క రూపాయి కిలో బియ్యం పథకం మొదలు డిఎల్ రవీంద్రా రెడ్డి మంత్రి అయ్యాక పలు విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో కిరణ్ ఆయనను మంత్రివర్గం నుండి తొలగించాలని భావించారు. అధిష్టానం ఒప్పుకోక పోవడంతో ఆయన శాఖలలో కోత పెట్టారు. దీంతో డిఎల్, కిరణ్‌ల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి.

తన శాఖలను కుదించిన సమయంలో, ఆ తర్వాత మరోసారి డిఎల్ రవీంద్రా రెడ్డి మంత్రి పదవికి రాజీనామా చేస్తారనే ప్రచారం జరిగింది. అయితే ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ బుజ్జగింపులతో ఆయన వెనక్కి తగ్గారు. ఆ తర్వాత సిఎంకు వ్యతిరేకంగా అధిష్టానానికి లేఖ రాసినట్లు కూడా ప్రచారం జరిగింది.

ఇక ముఖ్యమంత్రి పైన ఆయన పలుమార్లు ప్రత్యక్షంగా, పరోక్షంగా విమర్శలు చేశారు. ఒక్క ఎమ్మెల్యే మద్దతు కూడా లేకుండానే కిరణ్ ముఖ్యమంత్రి అయ్యారంటూ ధ్వజమెత్తారు. బుధవారం కూడా పాలకులు ఎసి గదులలో కూర్చొని పాలించడం కాదు ప్రజలలోకి వెళ్లాలని సూచించారు. మరి ఆయన రాసే పుస్తకంలో కిరణ్ పైన ఎన్ని విమర్శలు చేస్తారో చూడాలి.