రాజీకొచ్చిన హరికృష్ణ!

 రాజీకొచ్చిన హరికృష్ణ!

తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు నందమూరి హరికృష్ణ తన బావమరిది, పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుతో మళ్లీ రాజీ కొచ్చినట్లుగా కనిపిస్తోంది. కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలను నిరసిస్తూ టిడిపి రాష్ట్రవ్యాప్తంగా బుధవారం ఆందోళన కార్యక్రమాలు నిర్వహించింది. ఇందులో భాగంగా హరికృష్ణ కృష్ణా జిల్లా విజయవాడలో ఆందోళన నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే తగ్గించాలని ఆయన డిమాండ్ చేశారు. తెలుగుదేశం పార్టీ ప్రవేశ పెట్టిన సంస్కరణల కారణంగానే కాంగ్రెసు లబ్ధి పొందుతోందన్నారు. కాంగ్రెసు ప్రభుత్వం రాష్ట్రాన్ని నిర్వీర్యం చేస్తోందని ఆరోపించారు. అప్పుల ఊబిలో ముంచుతోందని విమర్శించారు.

చంద్రబాబుతో విభేదాలపై ఆయన వేరుగా స్పందించారు. టిడిపి అధినేతతో తనకు ఎలాంటి విభేదాలు లేవని ఆయన స్పష్టం చేశారు. నందమూరి కుటుంబం టిడిపి అభివృద్ధికి పాటుపడుతుందన్నారు. రానున్న ఉప ఎన్నికల్లో పద్దెనిమిది అసెంబ్లీ, ఒక పార్లమెంటు నియోజకవర్గాలలో పార్టీ గెలుపు కోసం కృషి చేస్తామని చెప్పారు. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో సెంటిమెంట్ వంటి ప్రత్యేక కారణం వల్లనే పార్టీ ఓటమి చెందిందన్నారు.

కాగా ఇటీవల న్యూఢిల్లీలో హరికృష్ణ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. నాయకత్వ లోపం వల్లనే పార్టీ ఈ పరిస్థితిల్లో ఉందని, కార్యకర్తలను నాయకులను ప్రశ్నించాలని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హరికృష్ణ చేసిన ఈ వ్యాఖ్యలు చంద్రబాబును ఉద్దేశించే అన్నారనే వాదనలు వినిపించాయి.