మధు కొడాకు బెయిల్

 మధు కొడాకు బెయిల్

 జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి మధు కొడాకు హైకోర్టు గురువారం బెయిల్ మంజూరు చేసింది. అక్రమ పెట్టుబడులు, హవాలా లావాదేవీల కేసులో రెండేళ్లకు పైగా ఆయన జైలులో ఉన్నారు. 2009 నవంబర్ 30వ తేదీ నుంచి కొడా జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. హైకోర్టు సింగిల్ బెంచ్ న్యాయమూర్తి హెచ్‌సి మిశ్రా ఆయనకు బెయిల్ మంజూరు చేశారు. 

మధు కొడా 2006 నుంచి 2008 వరకు జార్ఖండ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆదాయం పన్ను, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు దేశవ్యాప్తంగా 69 ప్రాంతాల్లో 2009లో సోదాలు నిర్వహించిన తర్వాత జార్ఖండ్ విజిలెన్స్ బ్యూరో మధు కొడాను అరెస్టు చేసింది. కొడాకు, ఆయన అనుచరులకు సంబంధించిన స్థలాల్లో నిర్వహించిన సోదాల్లో అధికారులు రూ. 2,500 కోట్ల రూపాయల విలువ చేసే అక్రమ పెట్టుబడులు, హవాలా లావాదేవీలకు సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. 

ఆ తర్వాత కేసును ఈడితో పాటు సిబిఐ చేపట్టింది. 23 నెలల పాటు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో మధు కొడా అక్రమ పెట్టుబడులకు, హవాలా లావాదేవీలకు పాల్పడినట్లు దర్యాప్తు సంస్థలు అభియోగాలు మోపాయి. కొడా స్వతంత్ర శాసనసభ్యుడిగా ఎన్నికై జార్ఖండ్‌లో యుపిఎ ప్రభుత్వానికి నాయకత్వం వహించారు. ఇదే కేసులో మధు కొడా అనుచరులు బినోద్ సిన్హా, వికాస్ సిన్హా, మరో ముగ్గురు జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. 

మధుకొడాను అధికారులు చాయిబసాలో విజిలెన్స్ బ్యూరో అధికారులు 2009 అక్టోబర్‌లో అరెస్టు చేశారు. అప్పట్లో మధు కొడా కేసు ఓ సంచలనం. జార్ఖండ్ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా ఆయన ఓ ఊపు ఊపారు.