బాబు ధర్నా వెనుక కిరణ్!

బాబు ధర్నా వెనుక కిరణ్!

 విజయనగరంలో సోమవారం టీడీపీ ధర్నా వ్యవహారమంతా సీఎం కిరణ్, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుల మధ్య అవగాహనతోనే జరిగిందని పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ వర్గీయులు బలంగా అనుమానిస్తున్నారు. మద్యం సిండికేట్ల వ్యవహారం తెరపైకి వచ్చినప్పటి నుంచీ ఏసీబీ జరుపుతున్న విచారణ, దానిపై బాబు స్పందిస్తున్న తీరు వారిద్దరి మధ్య మ్యాచ్‌ఫిక్సింగ్‌కు అద్దం పడుతోందని బొత్స తొలి నుంచీ సన్నిహితుల వద్ద అనుమానాలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు. విజయనగరం కేంద్రంగా టీడీపీ ధర్నా తలపెట్టడం, దానిపై నడిచిన హైడ్రామా కూడా ఆద్యంతం కిరణ్-బాబు అవగాహన మేరకే జరిగాయని ఆయన సోమవారం తన సన్నిహితులతో పేర్కొన్నారు. పట్టణంలో ధర్నాలపై నిషేధాజ్ఞలు విధించినా బాబు అందులో సాఫీగా పాల్గొన్నారని, పోలీసులు కూడా ఆయన్ను అడ్డుకోలేదని బొత్స భావిస్తున్నారు. 

భారీ బందోబస్తు పెట్టి కూడా బాబు కాన్వాయ్‌ను అడ్డుకోకపోవడం విస్మయకరమని ఆయనంటున్నారు. కిరణ్ తెరవెనుక ఆదేశాలే ఇందుకు కారణమని అనుమానిస్తున్నారు. గతంలో బాబు వరంగల్ జిల్లా యాత్ర మాదిరిగానే ఇప్పుడు కూడా కిరణ్ ఆయనకు పూర్తిగా అండదండలు అందించారంటున్నారు. అసలు మద్యం సిండికేట్ల వ్యవహారం తెరపైకి వచ్చినప్పటి నుంచి బాబు కేవలం తననే టార్గెట్ చేసుకుని మాట్లాడుతున్నారు తప్ప మొత్తం వ్యవహారంపై నోరు మెదపడం లేదని చెబుతున్నారు. అసలు బాబును విశాఖలోనో, మార్గంమధ్యలోనో అరెస్టు చేస్తారని బొత్స భావించారు. కిరణ్‌పై అనుమానంతో, ఏమో గానీ ఆయన ఉదయం నుంచీ తన ఇంట్లోనే ఉండి పరిస్థితిని ప్రతి క్షణం సమీక్షించారు. అనుయాయులకు ఫోన్ల ద్వారా సూచనలిస్తూ వచ్చారు. అసలు బాబు యాత్రకు దీటుగా కాంగ్రెస్ కూడా నిరసన తెలిపేలా బొత్స పథక రచన చేశారు. అందుకు పలువురు మంత్రులు, ఉత్తరాంధ్ర కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా విజయనగరం వెళ్లాలని ఆయన సూచించారు. కానీ మంత్రి తోట నర్సింహం తప్ప మంత్రులెవరూ వెళ్లలేదు. వారిపై కిరణ్ ఒత్తిడే ఇందుకు కారణమని బొత్స అనుమానిస్తున్నారు. దానికి తగ్గట్టే ఓ మంత్రి కూడా మీడియా సన్నిహితులతో మాట్లాడుతూ, ‘ధర్నాకు వెళ్లాలని బొత్స చెప్పారు. వెళ్తే కిరణ్‌కు కోపమొస్తుంది. ఎందుకొచ్చిందని ఊరుకున్నాను'' అని అన్నారు.

తొలి నుంచీ మద్యం కుంపట్లే...
మద్యం సిండికేట్ల ఉదంతం తొలి నుంచీ కిరణ్, బొత్సల మధ్య నిప్పు రాజేసింది. అసలు బొత్సే లక్ష్యంగా ఈ తేనెతుట్టెను కిరణ్ కదిపారని పీసీసీ వర్గాలంటున్నాయి. దీనిపై బొత్స నేరుగా అధిష్టానానికే ఫిర్యాదు చేయడం, ఏసీబీని నిలువరించకుంటే రాజీనామా చేస్తాననడం తెలిసిందే. బొగ్గు కొనుగోలులో కిరణ్ కోట్లు దండుకున్నారని, దీన్ని అధిష్టానం ముందుంచుతానని హెచ్చరించారని కూడా వార్తలొచ్చాయి. అధిష్టానం జోక్యంతో కిరణ్ రాజీకి వచ్చినట్టు కన్పించినా ఏసీబీ తీరులో మార్పు రాకపోవడం బొత్సలో అనుమానాలు పెంచింది. మద్యం కేసును ఉత్తరాంధ్ర జిల్లాల చుట్టే తిప్పి చివరకు తన మెడకు చుట్టేలా పావులు కదుపుతున్నట్లు ఆయన భావిస్తున్నారు. తనను రాజకీయంగా దెబ్బ కొట్టేందుకు బాబు, ‘ఈనాడు' అధిపతి రామోజీరావులతో కిరణ్ తెరవెనుక ఒప్పందాలు కుదుర్చుకున్నారని అనుమానిస్తున్నారు. బాబు ఉప్పందించిన మేరకే ‘ఈనాడు'లో కథనాలు వస్తున్నాయని, వాటిని తిరిగి ఆరోపణలుగా బాబు తనపై గుప్పిస్తున్నారని ఆయనంటున్నారు. పైగా ఏసీబీ కూడా వాటినే తన పత్రాల్లో పొందుపరిచిందని చెబుతున్నారు.